హైద్రాబాద్, నవంబర్ 29, (way2newstv.com)
ఆరేళ్లలో తొలిసారిగా రాష్ట్ర ఆదాయం రివర్స్ అయింది. అక్టోబర్ నెలాఖరు నాటికి ఆదాయ వృద్ధి శాతం భారీగా తగ్గిపోయింది. గతేడాది ఇదే నెలాఖరుతో పోలిస్తే రాష్ట్ర ఆదాయం రెండు శాతం మేర పడిపోయింది. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్తో ఈ ఏడాది ఆరంభం నుంచే కాసుల కష్టాలు మొదలయ్యాయి. ఏటేటా కాస్తో కూస్తో ఆదాయం పెరుగుతుందనే ప్రభుత్వ అంచనాలు పల్టీ కొట్టాయి. గత అయిదు సంవత్సరాలు దేశంలో రెవెన్యూ మిగులు రాష్టాల్లో తెలంగాణ ఒకటి. ఆదాయ వృద్ధి రికార్డు స్థాయిలో 21 శాతం మేరకు పెరుగుతూ పోయింది. దేశమంతటా మాంద్యం ప్రభావం కనిపిస్తోందని, అందుకే వృద్ధి దాదాపు 19 శాతం పడిపోయిందని గత నెలాఖరునే సీఎం కేసీఆర్ వెల్లడించారు. అదృష్టవశాత్తూ మైనస్లోకి పడిపోలేదని చెప్పారు. ఇప్పుడు ఆదాయ వృద్ధి క్రమంగా మైనస్ డిజిట్కు చేరుకున్నట్లు తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి.
రివర్స్ గేర్ లో ఆదాయం
రాష్ట్ర ఆర్థిక శాఖ కాగ్కు సమర్పించిన నెలనెలా అకౌంట్లను విశ్లేషిస్తే… సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆదాయం బాగా తగ్గిపోయింది.పన్నుల ద్వారా వచ్చే రాబడి తగ్గిపోవటంతో పాటు జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. మొత్తం పన్నుల ద్వారా వచ్చే రాబడి గత ఏడాది కంటే రూ.838 కోట్లు తగ్గింది. నిరుడు అక్టోబర్ నెలాఖరున రూ.44,615 కోట్లు ఉన్న ఆదాయం.. ఈసారి రూ.43,777 కోట్లుగా ప్రభుత్వం చూపించింది. పన్నేతర ఆదాయమూ తగ్గిపోయింది. దీంతో మొత్తంగా ఆదాయ వృద్ధి మైనస్లోకి చేరినట్టు తేలింది. ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై దీని ఎఫెక్ట్ పడుతుందని అధికారులంటున్నారు.జీఎస్టీ అమలుతో ఆదాయం అంతకంతకు పెరుగుతుందనే అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఆ ఎఫెక్ట్ కన్పించింది. రాష్ట్ర ఖజానాకు ఎక్కువగా ఆదాయం తెచ్చిపెట్టేది జీఎస్టీనే. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు, 7 నెలల్లో జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి రూ.16,429 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ ఆఖరుకు ఇది రూ.14,097 కోట్లకు పరిమితమైంది.దీంతోపాటు కేంద్రం పన్నుల వాటా ద్వారా వచ్చే ఆదాయం తగ్గి పోయింది. ఈ రెండు పద్దుల ద్వారానే దాదాపు రూ.4,500 కోట్ల మేరకు కోత పడిందిజీఎస్టీ తర్వాత లిక్కర్, పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపైనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈసారి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి తెచ్చిన సర్కారు వైన్ షాపుల వేలం దరఖాస్తుల ద్వారానే రూ.975 కోట్లు సంపాదించింది. దీంతో మద్యం ద్వారా వచ్చే ఆదాయమే మాంద్యాన్ని కవర్ చేసిందని, దాదాపు రూ.3 వేల కోట్ల ఆదాయం పెరిగిందని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. ఆర్థిక శాఖ అకౌంట్ల ప్రకారం.. లిక్కర్, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా నిరుడు అక్టోబర్ నాటికి రూ.16,014 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.19,557 కోట్లు ఆదాయం వచ్చింది.రియల్ ఎస్టేట్రంగంపై మాంద్యం పెద్దగా ఎఫెక్ట్ చూపించ లేదు. అందుకే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కొంత మెరుగ్గానే ఉంది. భూములు, స్థిరాస్తుల క్రయ విక్రయాల ద్వారా ప్రతి నెలా దాదాపు రూ. 600 కోట్ల నుంచి రూ.700 కోట్లు రాష్ట్ర ఖజానాలో జమవుతున్నాయి. ఈ ఏడాది ముందునుంచీ ఇదే ట్రెండ్ కొనసాగింది. అక్టోబర్ నెలాఖరు వరకు ఈ శాఖ నుంచి రూ.3,716 కోట్ల ఆదాయం వచ్చింది. నిరుడు ఇదే సమయానికి రూ.3,127 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పటితో పోలిస్తే 18 శాతం వృద్ధి నమోదైంది. కానీ భారీ మొత్తంలో ఉండే జీఎస్టీ, పన్నుల వాటాలో పడ్డ కోత ఎక్కువగా ఉండటంతో ఆదాయ వృద్ధి పడిపోయింది.