27న ప్రమాణం చేయనున్న హేమంత్ సోరెన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

27న ప్రమాణం చేయనున్న హేమంత్ సోరెన్

రాంచీ, డిసెంబర్ 24 (way2newstv.com)
జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ సీఎంగా ఈ నెల 27న  ప్రమాణం చేయబోతున్నారు. 2000లో జార్ఖండ్ ఏర్పాటైన తర్వాత.. తొలిసారి ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన రఘుబర్ దాస్.. ఎమ్మెల్యేగానూ ఓడిపోయారు. తన మంత్రివర్గంలో పని చేసి టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సరయూ రాయ్ సీఎంను 8550 ఓట్ల తేడాతో ఓడించారు.ఈ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేశాయి. ఎన్నికల ప్రచారం ఈ కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించడలో 44 ఏళ్ల హేమంత్ సోరెన్ కీలకంగా వ్యవహరించారు. బీజేపీని ఓడించడటం కోసం 2019 జనవరిలో.. ఆయన కాంగ్రెస్, ఆర్జేడీలతో చర్చలు జరిపారు. మహాఘటబంధన్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్నెళ్ల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమి చిత్తుగా ఓడింది. 
27న ప్రమాణం చేయనున్న హేమంత్ సోరెన్

కానీ కొద్ది గ్యాప్‌లో విపక్షం పుంజుకుంది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 2018లో వివిధ రంగాలకు చెందిన 12 మందితో సోరెన్ ఓ టీం ఏర్పాటు చేసుకున్నారు. పబ్లిక్ పాలసీ, కమ్యూనికేషన్ తదితర రంగాలకు చెందిన.. ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన నిపుణులతో ఈ టీంను ఏర్పాటు చేశారు. ప్రజాసమస్యలను గుర్తించడం కోసం, క్షేత్రస్థాయి విశ్లేషణ కోసం ఈ టీం పని చేసింది. రఘుబర్ దాస్‌కు దీటైన అభ్యర్థిగా హేమంత్ సోరెన్‌ అని చూపడంలో ఈ టీం విజయవంతమైంది. ఈ ఎన్నికలను రఘుబర్ దాస్, సోరెన్ మధ్య పోటీగా మార్చేశారు.ఎన్నికల ప్రచారం సందర్భంగా.. గిరిజనులకు అనుకూలంగా ఉండే కౌలు చట్టాలను సవరించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా హేమంత్ ఆందోళనలు చేపట్టారు. 70 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌కు మద్దతు పలికారు. రిటైల్‌గా మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ స్కూళ్ల విలీనాన్ని వ్యతిరేకించారు.రఘుబర్ దాస్ కంటే ముందు హేమంత్ సోరెన్ ఏడాదిన్నరపాటు సీఎంగా పని చేశారు. 2013-14 మధ్య ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సోరెన్.. పిన్న వయస్కుడైన జార్ఖండ్ సీఎంగా గుర్తింపు పొందారు. 1975 ఆగస్టు 10న జన్మించిన హేమంత్.. 2005లో దుమ్కా అసెంబ్లీ స్థానం నుంచి హేమంత్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తన అన్న దుర్గా సోరెన్ అకాల మరణంతో.. 2009లో తన తండ్రి శిబు సోరెన్ వారసుడిగా పార్టీలో కీలక బాధ్యతలను చేపట్టారు. 2009 జూన్ 24 నుంచి 2010 జనవరి 4 మధ్య రాజ్యసభ సభ్యుడిగా ఆయన పని చేశారు.2000లో రాష్ట్రంగా ఏర్పాటైన జార్ఖండ్.. రాజకీయ అనిశ్చితిలో ఉండిపోయింది. 19 ఏళ్లలో ఆరు ప్రభుత్వాలు మారాయి. హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ మూడు పర్యాయాలు సీఎంగా పని చేశారు. కానీ మొత్తం పది నెలలు మాత్రమే అధికారంలో ఉన్నారు. కొంత కాలమే సీఎంగా పని చేసిన శిబు సోరెన్.. అవినితి ఆరోపణలను ఎదుర్కొన్నారు. అవకతవకలకు పాల్పడ్డారనే విమర్శలకు గురయ్యారు. 2010 నుంచి 2013 వరకు అర్జున్ ముండా ప్రభుత్వంలో హేమంత్ జార్ఖండ్ డిప్యూటీ సీఎంగా పని చేశారు. అనంతరం సీఎం అయ్యారు. హేమంత్ సోరెన్ ఏడాదిన్నర తన పదవీ కాలంలో వివాదాలకు దూరంగా ఉండేలా జాగ్రత్త వహించారు.హేమంత్ సోరెన్ తన తండ్రి నీడ నుంచి బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. 2014 ఎన్నికల్లోనే హేమంత్ తనేంటో ఫ్రూవ్ చేసుకున్నారు. బీజేపీకి సొంతగా మెజార్టీ దక్కకుండా చేయగలిగారు. ఆ ఎన్నికల్లో అర్జున్ ముండా, బాబూలార్ మరాండీ, మధు కోడా లాంటి నేతలు ఓడిపోయారు. 2014లో జేఎంఎం 16 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.పట్నా హైస్కూల్‌లో చదువుకున్న హేమంత్.. రాంచీ బిట్‌లో నుంచి మెకానిల్ ఇంజినీరింగ్‌‌లో చేరారు. కానీ కుటుంబ సమస్యలు, రాజకీయ గందరగోళం కారణంగా ఆయన బీటెక్ పూర్తి చేయలేకపోయారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ వీడియో గేమ్స్ ఆడటం అంటే సోరెన్‌కు ఎంతో ఇష్టం.