న్యూఢిల్లీ, డిసెంబర్ 5, (way2newstv.com)
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి 105 రోజులు జైల్లో గడిపిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బుధవారం రాత్రి విడుదలయ్యారు. తీహార్ జైలు నుంచి విడుదలైన చిదంబరం.. గురువారం పార్లమెంటుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉల్లిధరలు పెరుగుదలపై పార్లమెంట్ భవనం వద్ద కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకున్న చిదంబరం.. మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని వ్యాఖ్యానించారు.కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో తాను ఏం చేశానో అందరికీ తెలుసని, నాతో పనిచేసిన అధికారులు, గమనించిన జర్నలిస్టులకు తన గురించి బాగా తెలుసున్నారు.
నిర్మలపై చిదంబరం సెటైర్లు
తీహార్ జైలులో ఉండటం వల్ల తన ఆత్మస్థైర్యంతో పాటు శరీరం కూడా గట్టిపడిందని పేర్కొన్నారు. చెక్కబల్లపై నిద్రపోవడంతో మెడ, వెన్నెముక, తల మరింత దృఢపడ్డాయని అన్నారు. తీహార్ జైలుకు వెళ్లిన నుంచి చిదంబరం దాదాపు 8 కిలోల బరువు తగ్గినట్టు సమాచారం.ఈ సందర్భంగా బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ విధానాలపై విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యస్థను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడూ మాట్లాడిందిలేదని దుయ్యబట్టారు. ఉల్లిధరలు పెరిగినా కనీసం చీమ కుట్టినట్టయినా లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడుల గురించి విలేకర్లు ప్రశ్నించినప్పుడు ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆర్థిక మందగమనం నుంచి గట్టెక్కవచ్చన్న కాంగ్రెస్ సీనియర్ నేత... ప్రభుత్వం అసమర్థంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాలు తిరోగమనంలో ఉన్నాయని.. తప్పుడు విధానాల వల్ల సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మీడియా సహా అన్ని వ్యవస్థలూ భయాందోళనలో ఉన్నాయని చిదంబరం వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరి నాటికి ఒకవేళ వృద్ధిరేటు 5 శాతానికి చేరితే అదృష్టమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోపభూయిష్టమైన జీఎస్టీ, నోట్ల రద్దు లాంటి అనాలోచిత నిర్ణయాలతో మొండిగా వ్యవహరిస్తోందని, ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదని దుమ్మెత్తిపోశారు.వృద్ధిరేటు 5 శాతం కంటే దిగువకు పడిపోయే ప్రమాదం ఉందన్న డాక్టర్ అరవింద్ సుబ్రమణియమ్ హెచ్చరికలను దయచేసి గుర్తించుకోవాలని, ఎందుకంటే అనాలోచిత విధానాల కారణంగా ఇది మరింత తగ్గిపోయి 1.5 శాతానికి పడిపోయే అవకాశం ఉందని చిదంబరం పేర్కొన్నారు. ఆర్ధిక వ్యవస్థ మెల్లగా కుప్పుకూలుతోంది కానీ, ఈ ప్రభుత్వం సమర్ధంగా దానిని ఎదుర్కొలేకపోతుందని మండిపడ్డారు.ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏడు నెలలు గడిచిపోయిన తర్వాత కూడా ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు తాత్కాలికమైనవి ప్రభుత్వం నమ్మడం పొరపాటని హెచ్చరించారు. ఆర్ధిక వ్యవస్థను మందగమనం నుంచి కాపాడటానికి కాంగ్రెస్, ఇతర పార్టీలు విధానాలు ఉపయోగపడ్డాయని, కానీ, మన సమయం వచ్చే వరకూ వేచిచూడాలని అన్నారు.అంతకు ముందు పార్లమెంట్‌లో తనదైన శైలిలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై చిదంబరం సెటైర్లు వేశారు. ఉల్లి ధరలపై చిదంబరం ఘాటుగా స్పందించారు. తాను ఉల్లిగడ్డ తనని ఫ్యామిలీ నుంచి వచ్చానని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించగా.. ఉల్లిగడ్డ తినరా.. ఆమె అవకాడో పండు తింటారా? అని చిదంబరం చురకలు అంటించారు.ఉల్లి సామాన్యుడి కంట కన్నీరు తెప్పిస్తున్న నేపథ్యంలో లోక్‌సభలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. నేను ఉల్లిపాయలు, వెల్లుల్లి ఎక్కువగా తినను. మీరు చింతించకండి. ఆ రెండింటితో పెద్దగా సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చాను సీతారామన్ అన్నారు.