పల్లెకు కొత్తరూపు (కర్నూలు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పల్లెకు కొత్తరూపు (కర్నూలు)

కర్నూలు, డిసెంబర్ 05 (way2newstv.com): 
రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన గ్రామ సచివాలయాల ఏర్పాటుతో పంచాయతీల పునర్విభజనకు అవకాశమేర్పడింది. పంచాయతీలు పురపాలికల్లో విలీనం, కొత్తగా పంచాయతీల ఏర్పాటుకు గతంలో ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. జనవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూనే.. మరోవైపు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. గ్రామపంచాయతీలు విడిపోవడం, విలీనంపై 2007లో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడటం, మరో పంచాయతీ లేదా మున్సిపాలిటీలో విలీనానికి మార్గం సుగమమైంది. కొత్తగా ఏర్పడే పంచాయతీలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల విడుదలతోపాటు రాజకీయంగా పదవులు అలంకరించేందుకు అవకాశముంటుంది. 
పల్లెకు కొత్తరూపు (కర్నూలు)

జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో మరో 60 పంచాయతీలకు పైగా కొత్తగా ఏర్పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. 910 పంచాయతీలకు 540 మజరా గ్రామాలున్నాయి. 1000 జనాభా గల మజరా గ్రామాలు 150కిపైగా ఉన్నాయని, వీటిలో అధిక శాతం కొత్త పంచాయతీలు కావాలని కోరుతున్నారు. మూడు నెలల క్రితం జిల్లాలో 500 జనాభా పైబడి ఎస్టీ తండాలను కూడా పంచాయతీలుగా చేయడంతో 20 అదనంగా చేరాయి. ప్రభుత్వ ఉత్తర్వు 542 ప్రకారం 500-3,000 జనాభా కలిగిన గ్రామాన్ని పంచాయతీగా చేయవచ్ఛు పంచాయతీకి 3 కి.మీ. దూరంగా ఉన్నా... రెండు గ్రామాల మధ్య కొండలు, వాగులు, వంకలు ఉన్నా.. రెండుగా విడిపోయేందుకు అవకాశముంటుంది.  కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని గతంలో జిల్లా పంచాయతీ కార్యాలయానికి స్థానిక ప్రజలు ప్రతిపాదనలు పంపినవి.. ఆస్పరి మండలం చిగిలి పంచాయతీ నుంచి బెనిగేరి కొత్త పంచాయతీగా విడిపోవడం. ఆదోని మండలం చిన్నగోనెహాల్‌ నుంచి చిన్నహరివణం ,శిరువెళ్ల మండలం కోటంపాడు పంచాయతీ నుంచి వీరారెడ్డిపల్లి ,ఆదోని మండలం గోనబావి పంచాయతీ నుంచి హూగనూరు గ్రామం , ఉయ్యాలవాడ మండలం బోడెమ్మనూరు పంచాయతీ నుంచి పుచ్చకాయలమడ గ్రామాలున్నాయి. జిల్లాలో బనగానపల్లి, బేతంచెర్ల, కోవెలకుంట్ల, ఆలూరు, పత్తికొండ, కొసిగి, కోడుమూరు మేజరు పంచాయతీలను పురపాలక సంఘాలుగా మార్చేందుకు కొంత కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిని పంచాయతీలుగా ఉంచుతారా.. లేదా పురపాలికలుగా ఏర్పాటు చేస్తారా అనేది సందిగ్ధంగా ఉంది. ఆదోని మున్సిపాలిటీలో మండగిరి, సాదాపురం, మదిరె, ధనాపురం, బసాపురం, ఇస్వీ గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కర్నూలు కార్పొరేషన్‌లో లక్ష్మీపురం, పెద్దపాడు, పందిపాడు గ్రామాల విలీన ప్రతిపాదన కూడా ఉంది. నంద్యాల మున్సిపాలీటిలో 10 గ్రామాలను విలీన ప్రక్రియ ప్రతిపాదన ఉంది. ● ఇవన్నీ పురపాలక సంఘాల్లో కలిస్తే.. జిల్లాలో మరో 26 గ్రామ పంచాయతీల సంఖ్య తగ్గుతుంది.