హడావిడిగా హస్తినకు జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హడావిడిగా హస్తినకు జగన్

విజయవాడ, డిసెంబర్ 5, (way2newstv.com)
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండురోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి చేరుకుంటారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం.. లేదా మధ్యాహ్న సమయంలో ప్రధాని మోదీని సీఎం జగన్ కలవనున్నట్లు సమాచారం.రెండు రోజులుగా ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తుండగా ఈ రోజు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైనట్లు తెలుస్తోంది. 
హడావిడిగా హస్తినకు జగన్

అందువల్లే సీఎం జగన్ హడావిడిగా ఢిల్లీకి బయల్లేదరి వెళ్తున్నట్లు సమాచారం. గురువారం అనంతపురం జిల్లాలోని కియా కార్ల ఫ్యాక్టరీ ఓపెనింగ్ సెరిమనీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్.. తిరిగి తాడేపల్లి చేరుకోవాల్సి ఉంది. అయితే ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైన నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి తదితర విషయాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసిన జగన్ సర్కార్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ విషయాన్ని ప్రధానికి విన్నవించిన సీఎం.. మరోసారి నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉంది. త్వరితగతిన నిధులు విడుదల చేసి పనులు వేగవంతంగా జరిగేందుకు సహకరించాలని.. అలాగే అమరావతి నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరనున్నట్లు సమాచారం.వెనుకబడిన జిల్లాలకు నిధులు.. రామాయపట్నం పోర్టు.. కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు తదితర విషయాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరించి.. ఆర్థిక సాయం చేయాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం జగన్ కోరే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టిపీడిస్తున్న నిధుల సమస్యను కేంద్రానికి వివరించి వీలైనంత ఎక్కువ నిధులు తెచ్చుకోవాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగేందుకు సాయమందించాలని విజ్ఞ‌ప్తి చేసే అవకాశముంది.అలాగే జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కడప స్టీల్ ప్లాంట్‌ నిర్మాణానికి ఈ నెల 26న శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం కూడా కడప స్టీల్ ప్లాంట్‌ పట్ల సుముఖత వ్యక్తం చేసిందని.. ముడి ఇనుము నిక్షేపాలు కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.