నెల్లూరు వైసీపీలో అంతర్గత పోరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నెల్లూరు వైసీపీలో అంతర్గత పోరు

నెల్లూరు, డిసెంబర్ 12, (way2newstv.com)
నెల్లూరు జిల్లా వైసీపీలో గ్రూపు విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకే పార్టీలో శత్రుకూటములు తయారయ్యాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక వర్గంగానూ, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి మరొక వర్గంగానూ ఉన్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య నిన్న మొన్నటి వరకూ ఉన్న అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆధిపత్యపోరుతో పాటు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు వీరి మధ్య మరింత గ్యాప్ పెంచుతున్నాయన్నది వాస్తవం.ఆనం రామనారాయణరెడ్డికి గత కొంతకాలంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో పొసగడం లేదు. 
నెల్లూరు వైసీపీలో అంతర్గత పోరు

ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. వీఆర్ విద్యాసంస్థల్లో అనిల్ కుమార్ జోక్యం ఒక కారణం కాగా మరొక కారణం ప్రాచీన ఆలయం వేణుగోపాల స్వామి వివాదం కూడా ఒకటనే చెప్పాలి. వేణుగోపాల స్వామి ఆలయానికి ఆనం కుటుంబం ట్రస్టీలుగా వ్యవహరిస్తుంది. ఆలయ నిర్వహణ ఖర్చుల కోసం ఇటీవల ట్రస్ట్ బోర్డు ఆలయ భూములను విక్రయించేందుకు సిద్ధమయింది. ఇది తెలిసిన అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు దేవాదాయశాఖతో మాట్లాడి ఆలయ భూముల విక్రయాన్ని నిలిపేశారని తెలిసింది. ఇది కూడా ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహానికి కారణమని చెప్పాలి.ఇక వెంకటగిరి నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో వెంకటగిరి డక్కిలి మండలంలో ఆల్తూరు పాడు రిజర్వాయర్ కు శంకుస్థాపన జరిగింది. మొత్తం 240 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. అయితే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రాజెక్టు టెండర్ ను రద్దు చేసి రివర్స్ టెండర్ కు వెళ్లాలని నిర్ణయించారు. గతంలో ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును దక్కించుకున్న కాంట్రాక్టరు ఆనం రామనారాయణరెడ్డికి సన్నిహితుడు కావడంతో రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం ఆనం రామనారాయణరెడ్డికి ఇష్టంలేదు. అయితే తన నియోజకవర్గంలో ఉన్న ప్రాజెక్టు విషయంలో తనను సంప్రదించకుండా రివర్స్ టెండర్లకు వెళ్లే ఆలోచన చేయడం కూడా ఆనం రామనారాయణరెడ్డికి కోపం తెప్పించిందంటున్నారు.దీంతో పాటు ఆనం రామనారాయణరెడ్డి డీసీసీీబీ ఛైర్మన్ గా తన సన్నిహితుడు మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డికి ఇవ్వాలనిి పట్టుబట్టారు. కానీ మంత్రి అనిల్, కోటంరెడ్డిలు ఆనం సోదరుడు విజయకుమార్ రెడ్డికి ఇవ్వాలని పట్టుబట్టారు. తొలి నుంచి పార్టీలో ఉండటంతో జగన్ కూడా విజయ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఈ కారణాలన్నీ కలసి ఆనం రామనారాయణరెడ్డికి ఆగ్రహం తెప్పించాయంటున్నారు. అలాగే జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి బదిలీ విషయం కూడా ఆనం రామనారాయణరెడ్డికి తెలియకుండా జరిగింది. ఆనంతో కనీసం చర్చించకుండా ఎస్సీగా భాస్కర్ భూషణ్ ను తేవడంపై ఆనం మండిపడుతున్నారు. తమ విషయాల్లో జోక్యం చేసుకుంటున్న మంత్రి అనిల్, కోటంరెడ్డిలను టార్గెట్ చేస్తూ ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల బరస్ట్ అయ్యారంటున్నారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఆనం వర్సెస్ అనిల్ పోరు పీక్ దశకు చేరుకుంది. మరి జగన్ దీనిని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.