విజయవాడ, డిసెంబర్ 3, (way2newstv.com)
వైసీపీ ఎంపీల్లో సీనియర్ పార్లమెంటు సభ్యుడు, రాజకీయంగా సీనియర్ కూడా అయిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తన మార్కు రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ అధినేతకు ఎంతో ఇష్టుడుగా పేరున్న బాలశౌరికి రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. ముఖ్యంగా ప్రజలను తనవైపు తిప్పుకోవడంలోనూ ఆయన నేర్పుగా ముందుకు సాగుతారనే పేరు తెచ్చుకున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన వల్లభనేని బాలశౌరి ఇక్కడ వరుస విజయాలు సాధిస్తున్న టీడీపీ నాయకుడు కొనకళ్ల నారాయణను ఓడించి విజయం దక్కించుకున్నారు. ఆ వెంటనే ఆయన కార్యరంగంలోకి దిగిపోయారు.
కార్యరంగంలోకి దిగిన బాలాశౌరి
సమస్యలున్న చోట తాను ఉన్నానంటూ నిరూపించుకుంటున్నారు. తాజాగా ఆయన కీలక ప్రాజెక్టు విషయంలో వేసిన అడుగు వైసీపీకి మంచి పేరు తెస్తోంది. కృష్ణా జిల్లా వాసుల చిరకాల కల అయిన బందరు పోర్టులో కదలిక వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పోర్టు నిర్మాణంపై జిల్లావాసుల్లో ఆశలు సన్నగిల్లాయి. పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని మంత్రులు ప్రకటిస్తూ వచ్చినా దానిపై స్పష్టత లేకుండాపోయింది.తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవ తీసుకోవడంతో కెనరా బ్యాంకు పోర్టు నిర్మాణానికి రుణ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కెనరా బ్యాంకు ఎండీ ఆర్‌ఏ శంకర్‌నారాయణను బాలశౌరి స్వయంగా తీసుకువచ్చి.. సీఎం జగన్‌ను సచివాలయంలో కలిసేలా ఏర్పాటు చేశారు. వీరి నడుమ సుమారు అరగంటకుపైగా భేటీ జరిగింది. ఈ భేటీలో బాలశౌరి కీలకంగా వ్యవహరించారు. బందరు పోర్టు నిర్మాణానికి సుమారు రూ.4వేల కోట్ల రుణసాయం చేసేందుకు కెనరా బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది.రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పోర్టు నిర్మాణం త్వరలో మొదలవుతుందని వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. దీంతో బందరు పోర్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురించినట్లయింది. దీని వెనుక బాలశౌరి కష్టం ఉండడంతో ఆయన అనుచరులు సహా వైసీపీ ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అయితే, రెండు నెలల కిందట కూడా రాష్ట్ర సమస్యలను కేంద్రానికి వివరించడంలోను, లేఖలు రాయడంలోనూ వల్లభనేని బాలశౌరి దూకుడు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.