పెన్షన్ టెన్షన్ (శ్రీకాకుళం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పెన్షన్ టెన్షన్ (శ్రీకాకుళం)

శ్రీకాకుళం, డిసెంబర్ 23 (way2newstv.com): 
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన ‘వైఎస్‌ఆర్‌ పింఛను భరోసా’లో కిడ్నీ బాధితుల ఎంపిక తీరుపై ఆవేదన వ్యక్తం అవుతోంది. లక్ష్యం బాగున్నా...వివిధ నిబంధనలు పొందుపరిచిన ఉత్తర్వుల మేరకు ప్రక్రియ సాగితే చాలా తక్కువ మందికే లబ్ధి చేకూరే పరిస్థితి కనిపిస్తోంది. ఉద్దానం కిడ్నీ బాధితులకు మేలు చేకూర్చేందుకు గాను 3, 4, 5 దశల్లో(స్టేజిలలో) ఉన్న వారికీ ‘వైఎస్‌ఆర్‌ భరోసా’ కింద రూ.5 వేలు పింఛను అందజేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.ప్రభుత్వ ఉత్తర్వులలో ఏముందంటే: ‘వైఎస్‌ఆర్‌ భరోసా విస్తరణ’ పథకంలో భాగంగా ఇతర దీర్ఘకాలిక రోగులతో పాటు 3, 4, 5 దశల్లో ఉండి...డయాలసిస్‌ చేయించుకోని కిడ్నీ బాధితులకు పింఛను సదుపాయం అందుతుంది. అయితే కొన్ని నిబంధనలు వర్తించే వారికే ఆ అవకాశం. ‘సీరం క్రియాటిన్‌’ 5 కంటే ఎక్కువగా ఉండాలి. అది కూడా మూడు నెలల వ్యవధిలో రెండు సార్లు పరీక్షల నిర్వహణలో ఇలా ఉండాలి. 
పెన్షన్ టెన్షన్ (శ్రీకాకుళం)

అలాగే రక్తాన్ని కిడ్నీ శుద్ధిచేసే సామర్థ్యం, కిడ్నీ పరిమాణం, వివిధ రకాల పరీక్షల ఫలితాలు ఏ స్థాయిలో ఉండాలి అనే వివరాలూ అందులో పొందుపరిచారు. అవన్నీ పరిశీలిస్తే కేవలం ఐదో దశలో ఉన్న బాధితులు మాత్రమే పింఛను భరోసాకు అర్హత సాధిస్తారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆ మేరకు ఎంపిక జరిగితే జిల్లాలో చాలా తక్కువ మందే అర్హత సాధించే పరిస్థితి ఉందని సమాచారం. పింఛను దక్కాలంటే...ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సీరం క్రియాటిన్‌ పరీక్షలు నిర్వహించాలి. మిగిలిన పరీక్షలకు శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి వెళ్లాలి. అక్కడ పింఛను అర్హత నిర్ణయిస్తారు. ఇప్పటికే సీరం క్రియాటిన్‌ పరీక్షలు నిర్వహించి ప్రాథమిక స్థాయి ప్రక్రియను పూర్తి చేశారు. కిడ్నీ వ్యాధి బాధితులు అధికంగా ఉన్న కవిటి, వజ్రపుకొత్తూరు మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన రక్త పరీక్షల్లో సీరం క్రియాటిన్‌ స్థాయి ఐదు దాటిన రోగులను ఒక్కోచోట 180 మంది లోపు మాత్రమే గుర్తించారు. పలాస మండలంలో 55 మంది, సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలిలో 20 మంది చొప్పున, మందసలో 36 మంది మాత్రమే ఉన్నారు. ఉద్దానంతో పాటు ఇతర ప్రాంతాల్లో గుర్తించిన బాధితులు 500 మంది వరకు మాత్రమే ఉన్నారు. వీరికి మిగిలిన పరీక్షలు నిర్వహిస్తే ఎంతమంది అర్హులుగా ఉంటారో తేలాల్సి ఉంది. అర్హత పరీక్షల కోసం కిడ్నీ బాధితులు వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తోంది. స్కానింగ్‌ సదుపాయం సామాజిక ఆసుపత్రుల్లో ఉండడంతో వైద్య నిపుణులు శ్రీకాకుళం కాకుండా ఇక్కడికే వచ్చి ఇతర పరీక్షలు నిర్వహిస్తే రోగులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందంటున్నారు. కవిటి ఉద్దానం నుంచి శ్రీకాకుళం వెళ్లి రావాలంటే ఖర్చుతో పాటు ఇతర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఎన్నిసార్లు వెళ్లాల్సి ఉంటుందో తెలియని పరిస్థితి. 150 కి.మీ నుంచి 170 కి.మీ వరకు దూరం ప్రయాణించాలంటే ఇబ్బందిపడుతున్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధులకు ఇప్పటికీ కారణాలు స్పష్టంగా తెలియని నేపథ్యంలో పింఛను లబ్ధిదారుల ఎంపికలో ‘ప్రత్యేక ప్యాకేజీ’ ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. ‘ఉద్దానం నెప్రోపతి’ పేరిట అంతర్జాతీయంగా ఇక్కడి పరిస్థితిపై అధ్యయనం సాగుతోంది. రాష్ట్రం యూనిట్‌గా ఇక్కడ బాధితులను ఎంపిక చేస్తే ప్రత్యేకంగా మేలు జరగదని సామాజిక, పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.