ఇక ఆర్టీసీకీ కొత్త ఛైర్మన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇక ఆర్టీసీకీ కొత్త ఛైర్మన్

హైద్రాబాద్, డిసెంబర్ 10 (way2newstv.com)
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ముగిసింది. సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్... ఆ తరువాత వారిపై వరాలు కురిపించారు. ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే... ఆర్టీసీ సమ్మె ముగియడంతో అధికార పార్టీలో కొత్త చర్చ మొదలైంది. ఆర్టీసీ సమ్మెకు ముందు సంస్థ చైర్మన్‌గా ఒకరిద్దరి పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే అంతలోనే ఆర్టీసీ సమ్మె మొదలుకావడం... అసలు సంస్థ ఉంటుందో లేదో అనే చర్చ మొదలుకావడంతో టీఆర్ఎస్‌లో ఆర్టీసీ చైర్మన్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే తాజాగా మరోసారి ఆర్టీసీ చైర్మన్ పదవి అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
 ఇక ఆర్టీసీకీ కొత్త ఛైర్మన్

త్వరలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కీలకమైన కార్పొరేషన్ పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్... ఆర్టీసీ చైర్మన్ పదవిని సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి బాజిరెడ్డి గోవర్ధన్‌కు రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి ఇస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ పోస్టును పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చిన కేసీఆర్... బాజిరెడ్డికి కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు మరికొన్ని కార్పొరేషన్ పదవులను కూడా త్వరలోనే పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలకు ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.