విజయవాడ డిసెంబర్ 23 (way2newstv.com)
రాజధాని రైతుల నిరసనలను బలవంతంగా అణచివేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేటి ఉదయం రాజధాని తరలింపుపై తమ నిరసన తెలియ చేసేందుకు తుళ్లూరు లో రోడ్ పై టెంట్ వేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. నిరసన తెలియచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.దాంతో తుళ్లూరులో పోలీసులకి రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పోలీసులు రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు భారీగా మోహరించారు. దాంతో రైతులు కూడా తమ ఆందోళన తీవ్రతరం చేయడంతో చివరకు పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రోడ్డుపైన టెంట్ వేసిన రైతులు అందులో నిరసర దీక్ష ప్రారంభించారు.
కొనసాగుతున్నరాజధాని రైతుల నిరసనలు
మూడు రాజధానుల కాన్సెప్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో రైతులు నేడు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ తాము ధర్నాలు కొనసాగిస్తామని రాజధాని రైతులు తెలిపారు.అదే విధంగా హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలపాలని అడ్వొకేట్స్ జేఏసీ తీర్మానించింది. ప్రతిరోజూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈనెల 24న ‘చలో హైకోర్టు’ చేపట్టాలని నిర్ణయించింది. ఆదివారం విజయవాడలో నిర్వహించిన బెజవాడ బార్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు.