హైద్రాబాద్, డిసెంబర్ 20, (way2newstv.com)
హైద్రాబాద్ నగరంలోనూ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని భావిస్తున్నారు. ైఫ్లె ఓవర్ మొదటి అంతస్తులో బీఆర్‌టీఎస్, రెండో అంతస్తులో మెట్రోరైలు ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేయాలని, కింద యథావిధిగా రోడ్డు మార్గం ఉండేలా చూడాలని నిర్ణయించారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయన బాధ్యతను మహారాష్ట్రకు చెందిన మహామెట్రో రైల్ కార్పొరేషన్‌కు అప్పగించారు. ఇటీవల నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వంలో జీహెచ్‌ఎంసీ అధికారుల బృందం మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పుణె నగరాల్లో పర్యటించి అక్కడ నిర్మిస్తున్న డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్లను పరిశీలించిన విషయం తెలిసిందే. అనంతరం పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు ఆయా నగరాల మున్సిపల్ అధికారులు, డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్న ఏజెన్సీ ప్రతినిధులతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.
సిటీలో డబుల్ డెక్కర్ కారిడార్స్
నగరంలోని మూడు మార్గాల్లో డబుల్ డెక్కర్ కారిడార్ల నిర్మాణానికి అధ్యయనం చేయాలని నిర్ణయించారు. అందులో కూకట్‌పల్లి-మాదాపూర్, ఓల్ట్ ముంబై రోడ్, మూసీ ఈస్ట్-వెస్ట్ కారిడార్ తదితర మూడు మార్గాలున్నాయి. నగరాల్లో భూసేకరణ అత్యంత సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో డబుల్ డెక్కర్ కారిడార్ల నిర్మాణంపై దృష్టి సారించారు. అంతేకాకుండా ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ప్రజారవాణా వ్యవస్థను సాధ్యమైనంత ఎక్కువగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మెట్రో, బీఆర్‌టీఎస్ సహా పలు ప్రజారవాణా వ్యవస్థల ఏర్పాటుకు మొగ్గు చూపిస్తున్నారు. బీఆర్‌టీఎస్ విధానంలో కూడా మెట్రో తరహాలోనే ప్రత్యేకంగా బస్సు నడిచే మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మార్గంలోనికి వేరే వాహనాలు ప్రవేశించకుండా నియంత్రిస్తారు. గతంలో ఉప్పల్ నుంచి మెహిదీపట్నం మార్గంలో బీఆర్‌టీఎస్‌ను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ భూ సేకరణ సమస్యలతో ఆచరణ సాధ్యం కాలేదు. నగరంలో మరిన్ని మార్గాల్లో మెట్రో, బీఆర్‌టీఎస్ తదితర రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. అత్యంత రద్దీ మార్గాలైన మూడు మార్గాల్లో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాలని భావిస్తున్నారు. కింద యథావిధిగా రోడ్డు మార్గం కొనసాగిస్తూనే మొదటి అంతస్తులో బీఆర్‌టీఎస్ మార్గాన్ని ఏర్పాటు చేయాలని, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దానిపై రెండో అంతస్తును కూడా నిర్మించి మెట్రోరైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. డబుల్ డెక్కర్ కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదిత మూడు మార్గాల్లో కూకట్‌పల్లి-మాదాపూర్, ఓల్డ్ ముంబై రోడ్డు అత్యంత రద్దీ మార్గాలు కాగా, మూసీ ఈస్ట్-వెస్ట్ మార్గం నగరంలోని రెండు చివర్లను అనుసంధానం చేసేందుకు ఉద్దేశించినది. మూసీ ఈస్ట్-వెస్ట్ కారిడార్ ప్రతిపాదన చాలాకాలంగా పెండింగులో ఉంది. రద్దీ ప్రాంతాల్లో భూసేకరణ దాదాపు అసాధ్యంగా మారిన నేపథ్యంలో, ఆధునిక నిర్మాణ పద్ధతులను అనుసరించి ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. డబుల్ డెక్కర్ కారిడార్ల వల్ల సింగిల్ పిల్లర్ లైన్‌పై బీఆర్‌టీఎస్, మెట్రో మార్గాలను ఏర్పాటుచేసే వీలుండడంతో వారు ఆ దిశగా దృష్టి సారించారు