ఆన్ లైన్ ఫుడ్డు..బాదుడే..బాదుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆన్ లైన్ ఫుడ్డు..బాదుడే..బాదుడు

హైద్రాబాద్, డిసెంబర్ 20, (way2newstv.com)
ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ సంస్థలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూర్చున్న దగ్గరికే ఫుడ్ వస్తోంది. బిజీ బిజీ సిటీ లైఫ్లో ఆన్లైన్ సేవలను చాలామంది వినియోగించుకుంటున్నారు. హోటల్ కు వెళ్లి తినేవారు తగ్గడంతో తొలుత ఫ్రీ సర్వీస్ ఇస్తామని ఒప్పందం చేసుకున్న యాప్ సంస్థలు ఆ తర్వాత అజమాయిషీ చేసే స్థాయికి చేరుకున్నాయి. ఉన్నపళంగా మారిపోయే ధరలతో వినియోగదారులపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఆఫర్లు, డిస్కౌంట్ల పేరిట ఆకట్టుకుంటూనే ఫుడ్డీస్కు తెలియకుండానే జేబులకు చిల్లుపెడుతున్నాయి. సిటీలో నిత్యం అమ్ముడయ్యే  ఫుడ్ ఆర్డర్లలో 60శాతం మేర ఆన్ లైన్ డెలివరీలే ఉంటాయి.  ఒక్క స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థనే నగరంలో రోజూ 80వేల ఆర్డర్ల వరకు యాప్ ద్వారా విక్రయిస్తోంది. 
ఆన్ లైన్ ఫుడ్డు..బాదుడే..బాదుడు

ఇలా మిగతా ఫుడ్ డెలివరీ సంస్థలు అన్ని కలిసి దాదాపు ప్రతి నెల 10లక్షలకు పైనే ఆర్డర్లను ఇంటింటికి చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. మహానగరంలో 12వేల వరకు చిన్న, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. మరో 10వేల దాకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మెస్లు హోటల్ రంగంలో సేవలందిస్తున్నాయి. వీటిలో ఎక్కువ ఆర్డర్లను  ఫుడ్ డెలివరీ యాప్ లైన స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా, ఉబర్ ఈట్స్ వంటివి దక్కించుకుంటున్నాయి. అయితే హోటళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే వినియోగదారులు వస్తుండటంతో ఈ కంపెనీలతో కలిసి పనిచేసేందుకు తొలుత మొగ్గుచూపాయి. కానీ, కాలక్రమంలో హోటల్ నిర్వాహకులకు ఈ వ్యవహారం గుదిబండలా మారింది. ఆయా ఫుడ్ డెలివరీ కంపెనీలు నెలనెల ప్రత్యేక ప్యాకేజీల రూపంలో హోటళ్ల నుంచి వసూలు చేస్తున్నాయి. వినియోగదారుల నుంచి కూడా డెలవరీ, సర్వీస్ పేరిట చార్జి వసూలు చేస్తున్నాయి.సిటీలో ఫుడ్ డెలివరీ యాప్ల వినియోగం పెరగడంతో హోటళ్లు కూడా తొలుత లాభపడ్డాయి. ఒక్కో హోటల్ కనీసం 50 నుంచి 300 ఆర్డర్లను ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా లీడ్స్ పొందాయి. ఆన్ టేబుల్ తగ్గిపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆయా ఫుడ్ డెలివరీ యాప్స్ నిర్వహణ చార్జీలను హోటళ్ల నుంచి వసూలు చేస్తుండటంతో బుగులు చెందుతున్నారు. ఏదైనా హోటల్ ఫుడ్ డెలివరీ యాప్ లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్టింగ్ లో ఉచితంగానే ఇచ్చినా… రెండు నెలల తర్వాత వసూలు చేసే బిల్లు కనీసం ఒక్కో ఆర్డర్ పై 10 నుంచి 20శాతం మేర ఉంటుందని సమాచారం. దీంతో వంద రూపాయల ఫుడ్ ఆన్ లైన్ యాప్ ద్వారా బుక్ చేస్తే ఆయా కంపెనీలే రూ.20వరకు సర్వీస్, డెలివరీ, సర్చార్జిల పేరిట వసూలు చేస్తున్నాయి. ఇలా ఆన్ టేబుల్ గా హోటల్ కెళ్తే గనుక రూ. 60లకే ఫుడ్ దొరుకుతుందని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు తెలిపాడు. ఫుడ్ డెలివరీ కంపెనీలు విధించే చార్జీలు హోటళ్ల యాజమాన్యాలకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో డెలివరీ యాప్ ల కోసం కొన్ని హోటళ్లు ప్రత్యేక మెనూలు, ధరలను రూపొందించి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తున్నాయి. నచ్చిన ఫుడ్ తెప్పించుకునే హడావుడిలో చాలామంది యాప్స్ ఇచ్చే ఆఫర్లు, డిస్కౌంట్ల ఉచ్చులో పడిపోతున్నారు. దీంతో వాస్తవ ధర కంటే కనీసం రూ.10 నుంచి రూ.30 ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారు.చికెన్ బర్గర్ రెస్టారెంట్ ప్రైస్ రూ.99 ఉంటే, ఆన్ లైన్ మెనూలో మాత్రం రూ.150 ఉంటోంది. ప్రొమో కోడ్తో50శాతం డిస్కౌంట్ ఇచ్చినట్లే ఇచ్చి.. రూ.100 లోపు ఆర్డర్లకు డెలివరీ చార్జీల రూపంలో రూ.45 వసూలు చేస్తారు. దీంతో డిస్కౌంట్ పోనూ ఆర్డర్ ధర, డెలవరీ చార్జీలు కలిపి రూ.120 వసూలు చేస్తారు. కస్టమర్ నేరుగా బేకరీకెళ్లి తిన్నా, పార్సిల్ తెచ్చుకున్నా రూ.30 మిగులుతాయి. వినియోగదారుల నుంచే కాకుండా రెస్టారెంట్ల నుంచి కూడా నిర్వహణ చార్జీల రూపంలో ఫుడ్ యాప్స్ వసూలు చేస్తున్నాయి. ఈమధ్య సిటీలోని హోటళ్ల యాజమానులు డెలివరీ యాప్స్ సేవలను నెల రోజుల వరకు బహిష్కరించారు.