మిల్లర్లు చెప్పిందే వేదం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మిల్లర్లు చెప్పిందే వేదం

శ్రీకాకుళం, డిసెంబర్ 19, (way2newstv.com)
ధాన్యం కొంటేనే రైతుకు గిట్టుబాటు ధర అందుతుంది.  ప్రభుత్వ మద్దతు ధర రైతుకు అందించాలంటే మా వల్లే సాధ్య౦ . మేమంతా ఒకటే. మేము చెప్పిందే వేదం... అంటూ కొందరు మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు ఇక చెల్లకపోవచ్చు. ధాన్యం కొనుగోలు చేయకుండా ఏవో వంకలు చూపుతున్న మిల్లులపై  బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి సిద్ధమయ్యింది జిల్లా యంత్రాంగం.  ఏంటీ. ఈ కొత్త విధానం ఇప్పుడు చూద్దాం.వరి సాగు అధికంగా చేసే శ్రీకాకుళం జిల్లాల్లోని ధాన్యాన్ని ఇతర జిల్లాల అవసరాలకు కూడా మళ్లించేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో ధాన్యం మిగులు ఉత్పత్తులు సాధించే జిల్లాల నుంచి లోటు ఉన్న జిల్లాలకు నేరుగా సరఫరా చేసే ప్రక్రియను ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొన్నట్టు.. అదంతా మిల్లులకు రవాణా చేసినట్లు రాస్తున్నారు.  
మిల్లర్లు చెప్పిందే వేదం

కొత్త విధానంలో ఈ కేటాయింపు రాయలసీమ జిల్లాలోని మిల్లులకూ వర్తించనుంది. అంటే.. ప్రస్తుతం జిల్లాలో కొన్నట్లు చూపించిన ధాన్యాన్ని జిల్లా మిల్లర్లతో పాటు రాయలసీమ మిల్లులకు పంచుతారన్నమాట. వారికి ఎంత పరిమాణం కేటాయిస్తే.. అంత పరిమాణం జిల్లా మిల్లులకు లోటు పడుతుంది. కొత్త విధానం లేకుంటే.. ఆ మిల్లులకు పంపించే ధాన్యాన్ని కూడా జిల్లాలోని మిల్లులే రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. అక్కడి మిల్లులకు కూడా పని కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఆయా మిల్లుల నుంచి బ్యాంకు గ్యారంటీలు, కేటాయింపులు వంటి అంశాలను ఆ జిల్లాలోని పౌర సరఫరాల శాఖ డీఎస్వో, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరులు సమీక్షించనున్నారు. సీఎమ్మార్‌ కింద బియ్యాన్ని కూడా వారి జిల్లాల్లోనే తీసుకుంటారు.ధాన్యం లోటు ఉన్న రాయలసీమ జిల్లాలకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి 25 వేల టన్నుల వంతున కేటాయింపు జరిగింది. దీనిపై పౌర సరఫరాల సంస్థ కమిషనర్‌ ఆదేశాలిచ్చారు. అక్కడి మిల్లరు అక్కడే నిర్ణీత పరిమాణంలో బియ్యం జమ చేయాల్సి ఉంటుంది. మిగులు జిల్లాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని లోటు ఉన్న జిల్లాలకు పంపిస్తారు. ఎంతతొందరగా వారు ఇక్కడి నుంచి తీసుకెళ్తుంటే.. మళ్లీ మళ్లీ కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ భావిస్తున్నారు. ఏ జిల్లాలో లేని విధంగా శ్రీకాకుళం జిల్లాలో కొందరు మిల్లర్ల తీరు ఇష్టారాజ్యంగా మారింది. అన్ని జిల్లాల్లోనూ 1:1 బ్యాంకు గ్యారంటీలు అమలవుతుంటే..  శ్రీకాకుళం జిల్లాలో ఒకసారి 1:2, అంతకు ముందు 1:4 దామాషా పద్దతిలో బ్యాంకు గ్యారంటీలకు మిల్లర్లు పట్టుబట్టారు. అలా కాకుంటే.. మిల్లింగు చేయలేమంటూ మొండికేశారు.  గత మూడేళ్లలో ఎన్ని రాయితీలు ఇచ్చినా.. సక్రమంగా వినియోగించుకోలేక పోవడాన్ని గుర్తిస్తూ వచ్చారు. కొందరు మిల్లర్లు బియ్యం ఎగ్గొట్టడం.. ఏడాది చివరి వరకు బకాయిలు పడటంతో చివరికి కమిషనర్‌, డైరెక్టర్ల స్థాయిలోనే అసహనం వ్యక్తం చేశారు.గత సంవత్సరం ఏకంగా బియ్యం సరఫరా చేయకుండానే.. చేసినట్లు దొంగ ఏసీకేల సృష్టికి తెగబడటం ఉన్నత అధికార వర్గంలో ఆగ్రహానికి కారణమైంది.  ఈ క్రమంలోనే  శ్రీకాకుళం జిల్లాను దృష్టిలో ఉంచుకుని.. మిల్లర్లను దారికి తేవాలన్న ఆలోచనతో... ఇతర జిల్లాలకు ధాన్యాన్ని పంపించాలనే యోచన ఉన్నత స్థాయిలో ఆలోచనలు అమలు చేశారు.