ఎమోషనల్ యాక్టింగ్ తో వెంకీమామ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎమోషనల్ యాక్టింగ్ తో వెంకీమామ

హైద్రాబాద్, డిసెంబర్  13  (way2newstv.com)
విక్టరీ వెంకటేష్‌, యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా వెంకీ మామ. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌లు ఆ అంచనాలను మరింతగా పెంచేశాయి. బాబీ (కేయస్‌ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడిగా పాయల్‌ రాజ్‌పుత్‌, నాగచైతన్యకు జోడిగా రాశీఖన్నాలు నటించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తమన్‌ సంగీతమందించాడు. రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లు రీల్‌ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ క్రేజ్‌ ఏర్పడింది. మరి ఆ అంచనాలను వెంకీ మామ అందుకున్నాడా...?వెంకటరత్నం నాయుడు (వెంకటేష్‌), అమ్మ నాన్న లేని తన అల్లుడిని ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుతాడు. 
 ఎమోషనల్ యాక్టింగ్ తో వెంకీమామ

తాను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి తన అల్లుడ్ని సరిగ్గా చూసుకోదని పెళ్లి చేసుకోవటమే మానేస్తాడు. అల్లుడు కార్తిక్‌ శివరామ్‌ (నాగ చైతన్య)కు కూడా మేనమామే ప్రపంచంగా బతికేస్తుంటాడు. లండన్‌లో ఉద్యోగం వచ్చినా మామయ్యకు దూరంగా వెళ్లడం ఇష్టం లేక ఆ ఉద్యోగాన్ని వదిలేసుకుంటాడు. అదే సమయంలో తమ ఊరికి వచ్చిన హిందీ టీచర్‌ వెన్నెల (పాయల్‌ రాజ్‌పుత్‌)తో వెంకటరత్నం, క్లాస్‌మెట్‌ హారిక(రాశీఖన్నా) తో కార్తిక్‌ ప్రేమలో పడతారు. అంతా ఆనందంగా ఉందనుకున్న సమయంలో కార్తీక్‌, వెంకటరత్నంలు విడిపోవాల్సి వస్తుంది. ఒకరికొకరు ప్రాణంగా కలిసుండే మామా అల్లుళ్లు విడిపోవడానికి కారణం ఏంటి..? గోదావరి జిల్లాల్లో మామతో కలిసి అల్లరి చేసే కార్తిక్‌ సైన్యంలోకి ఎందుకు వెళ్లాడు..? మామా అల్లుళ్లు తిరిగి ఎలా కలిశారు..? అన్నదే మిగతా కథ.రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లు వెంకీ, చైతూలు రీల్‌ లైఫ్‌లోనూ అంతే ఈజ్‌తో నటించారు. ఇద్దరు తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి. ముఖ్యంగా తెర మీద వీరిద్దరి కాంబినేషన్‌ సూపర్బ్ అనిపించేలా ఉంది. వెంకటేష్‌ తన కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్‌ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. వెంకీ స్థాయి యాక్టింగ్‌ను మ్యాచ్‌ చేయటంలో చైతూ కాస్త తడబడినా తన పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్లు పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నాలు గ్లామర్‌ విషయంలో ఒకరితో ఒకరు పోటి పడ్డారు. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా ఉన్నంతలో పరవాలేదనిపించారు. ఇతర పాత్రల్లో నాజర్‌, ప్రకాష్‌ రాజ్‌, రావూ రమేష్‌, దాసరి అరుణ్‌, హైపర్‌ ఆది, విద్యుల్లేఖ రామన్‌ తదితరులు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారుచాలా కాలం తరువాత ఓ పర్ఫెక్ట్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు బాబీ. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ను పర్ఫెక్ట్‌గా సెట్‌ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌ కామెడీ, లవ్‌ సీన్స్‌తో సరదా సరదాగా గడిచిపోతుంది. అక్కడక్కడ కాస్త డైలాగ్స్‌లో డబుల్‌ మీనింగ్‌లు వినిపించినా కమర్షియల్‌ ఫార్మాట్‌లో పరవాలేదనిపిస్తాయి. పల్లెటూరి వాతావరణం, అక్కడి ప్రేమానురాగాలను, రాజకీయాలు చాలా బాగా చూపించాడు దర్శకుడు. ప్రథమార్థం సరదాగా నడిపించిన దర్శకుడు ద్వితీయార్థాన్ని ఎమోషనల్‌గా తెరకెక్కించాడు. మామా అల్లుళ్లు దూరమవ్వటం ఆ తరువాత జరిగే పరిణామాలు ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌ ఆడియన్స్‌తో కంటతడి పెట్టిస్తాయి. అయితే ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే సెకండ్‌ హాఫ్‌ కాస్త తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్మీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు లాజిక్ లేకపోవటంతో పాటు సుధీర్ఘంగా సాగుతూ ఇబ్బంది పెడతాయి. మిలటరీ మిషన్‌కు సంబంధించిన సన్నివేశాలు కూడా తెర మీద అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు.సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమా రిలీజ్‌కు ముందే పాటలతో హిట్ కొట్టిన తమన్‌, నేపథ్య సంగీతంతో మరింత ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌ లవ్‌, కామెడీ సీన్స్‌తో పాటు సెకండ్‌ హాఫ్‌లో వచ్చే యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ సినిమాటోగ్రఫి ప్రసాద్‌ మూరెళ్ల. పల్లెటూరి సన్నివేశాలతో పాటు ఆర్మీ ఎటాక్‌, కాశ్మీర్‌లో చిత్రీకరించిన క్లైమాక్స్‌ సీన్స్‌లో కెమెరామెన్‌ పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్‌ కలిగిస్తాయి. ఫ్యామిలీ మల్టీ స్టారర్‌ సినిమా కావటంతో సురేష్‌ బాబు ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించాడు.ఓవరాల్‌గా వెంకీమామ నవ్విస్తాడు.. ఏడిపిస్తాడు.. మెప్పిస్తాడు.. కాసులు కూడా కురిపించేలాగే ఉన్నాడు