శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల డిసెంబర్ 31 (way2newstv.com)        
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా టిటిడి ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ జ‌న‌వ‌రి 6వ తేదీన వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాలు జ‌రుగ‌నున్నాయ‌ని తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.వైకుంఠ ఏకాద‌శికి మాడ వీధుల్లో షెడ్ల వైకుంఠ ఏకాద‌శికి విచ్చేసే భ‌క్తులు చ‌లికి ఇబ్బందులు ప‌డ‌కుండా గ‌తేడాది త‌ర‌హాలోనే నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల‌తోపాటు మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు చేశామ‌ని ఈవో తెలిపారు. 
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని, షెడ్ల‌కు అనుబంధంగా మ‌రుగుదొడ్లు ఏర్పాటుచేశామ‌ని వెల్ల‌డించారు. భ‌క్తులు టిటిడి అధికారుల‌కు స‌హ‌క‌రించి జ‌న‌వ‌రి 6, 7వ తేదీల్లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ఈవో కోరారు.కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.