హ్యాట్రిక్ కోసం మమత తాపత్రయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హ్యాట్రిక్ కోసం మమత తాపత్రయం

బెంగాల్, డిసెంబర్ 9 (way2newstv.com)
ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రత్యర్థులను కట్టడి చేసే పనిలో ఉన్నారు. మమత బెనర్జీకి రానున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. ఒకవైపు బీజేపీ రాష్ట్రంలో దూసుకు పోతోంది. మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం మమతకు మరింత భయం పట్టుకుంది. అందుకే క్షణం తీరిక లేకుండా రాష్ట్రంలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు.గత రెండు సార్లు అఖండ విజయం సాధించిన మమత బెనర్జీ హ్యాట్రిక్ విజయం కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. హిందూ ఓటు బ్యాంకు కు కన్నం పడకుండా మమత అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకు మమత బెనర్జీ వరాలు ప్రకటించేశారు. నియోజకవర్గాల వారీగా మమత బెనర్జీ సమీక్షలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఇన్ ఛార్జులతోనూ నిత్యం సమావేశాలు జరుపుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.
హ్యాట్రిక్ కోసం మమత తాపత్రయం

మరోవైపు మమత మరో భయం ఎంఐఎం. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం బరిలో ఉంటుందని ప్రకటించింది. మహారాష్ట్ర, బీహార్ ఉప ఎన్నికల్లో గెలుపుతో ఎంఐఎం మంచి ఊపు మీద ఉంది. పశ్చిమ బెంగాల్ లో ముస్లిం ఓటు బ్యాంకు దాదాపు 30 శాతం వరకూ ఉంటుంది. ఆ ఓట్లు కనుక ఎంఐఎం చీల్చుకుంటే భారతీయ జనతా పార్టీ లబ్ది పొందే అవకాశముంది. అందుకోసమే ఎంఐఎం ట్రాప్ లో ముస్లింలు పడకుండా ముందు నుంచే మమత బెనర్జీ చర్యలు తీసుకుంటున్నారు.ముస్లింలు ఇప్పటి వరకూ తృణమూల్ కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎంఐఎం ఎంటర్ అయితే తమ ఓట్ల సంఖ్య గణనీయంగా పడిపోతుందని మమత బెనర్జీ ఆందోళన చెందుతున్నారు. అందుకే ఎన్ఆర్సీని మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శరణార్థులకు ప్రత్యేక కాలనీలను క్రమబద్ధీకరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అందుకోసమే మమత బెనర్జీ తాజాగా డీజీపీని ఆదేశించారు. పశ్చిమ బెంగాల్ లో ఎటువంటి ర్యాలీలకు, సమావేశాలకు అనుమతి ఇవ్వవద్దని ఆదేశించారు. హిందుత్వ సంస్థలకు గాని, ముస్లిం పెద్దల సభలకు గాని అనుమతి ఇవ్వవద్దంటూ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. దీన్ని బట్టీ దీదీకి ఎంత భయం పట్టుకుందో చెప్పకనే తెలుస్తోంది