నిప్పులు చెరిగిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ డిసెంబర్ 17 (way2newstv.com)
విద్యార్థుల పట్ల సోనియా గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత ప్రజలపైనే యుద్ధం ప్రకటించారని సోనియా వ్యాఖ్యానించడాన్ని నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో.. ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను తీహార్‌కు జైలుకు పంపిన విషయాన్ని ఈ సందర్బంగా మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలా బీజేపీ ప్రభుత్వం చేయడం లేదన్నారు. విద్యార్థులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
విద్యార్థుల పట్ల సోనియా గాంధీ మొసలి కన్నీరు
సోనియా గాంధీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.జామియా యూనివర్సిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సోనియా విడుదల చేసిన ప్రకటన సారాంశం.. యువ శక్తి మేల్కొంటే మార్పు తథ్యం. విద్యార్థులు, యువతపై పోలీసుల దాష్టీకంతో మోదీ ప్రభుత్వానికి పతనం మొదలైంది. శాంతి భద్రతలు, రాజ్యాంగ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత. అయితే బీజేపీ సర్కారు సొంత ప్రజలపైనే యుద్ధం ప్రకటించింది. యువత హక్కులను అణచివేయడం, రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన అలజడులు సృష్టించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టమవుతున్నది. స్వయానా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షానే విభజన స్క్రిప్టుకు రచయితలు అని ఆమె మండిపడ్డారు. ఈశాన్య రాష్ర్టాల్లో పర్యటించేందుకు అమిత్ షాకు ధైర్యం చాలడం లేదన్నారు.