ఆదిలాబాద్, డిసెంబర్ 16 (way2newstv.com):
సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రతి మండలంలో రెండు సహకార సంఘాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు సంఘాల ఏర్పాటులో అధికారులు నిమగ్నమయ్యారు. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 79 సంఘాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 43 సంఘాలు ఏర్పాటు చేసేందుకు అవకాశముంది. మండలాల వారీగా సభ్యులు, గ్రామాల పరిధి తదితర వాటిని బట్టి సంఘాల ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న సహకార సంఘాల పదవీకాలం ఎప్పుడో ముగిసినా.. ఎన్నికలు జరుపకుండా గతంలో ఉన్న పాలకవర్గాల పదవీకాలన్నీ పొడిగిస్తూ వచ్చారు. తాజాగా కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలతో పాటు, గతంలో ఉన్న మండలాల్లో ఒక సంఘం ఉంటే, ఆయా మండలాల్లో రెండు సంఘాలు ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.
సహకారానికి బలం(ఆదిలాబాద్)
జిల్లా విభజనకు ముందు 52 మండలాలు ఉండేవి. వాటిని 70 మండలాలుగా చేశారు. కొత్తగా ఏర్పాటు అయిన 18 మండలాల్లో రెండు చొప్పున 36 సంఘాలను అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవిగాక అదనంగా పాత మండలాల్లో ఆరు సంఘాలు ఏర్పాటు చేయాలని గుర్తించారు. రైతులకు సహకార సంఘాలు అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సంఘాలకు అదనంగా మరి కొన్ని సంఘాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జిల్లాల విభజనకు ముందు అవసరాన్ని బట్టి అప్పట్లో ఒక్కో మండలంలో మూడు, నాలుగు సంఘాలు ఏర్పాటు చేసుకోగా, కొన్ని మండలాల్లో అసలు సంఘాలే లేవు. జిల్లాలు విభజించిన తరువాత సంఘాల విభజన జరిగింది. వీటితో పాటు కొత్త మండలాలు ఏర్పాటు అయ్యాయి. మండలాల వారీగా ప్రతి రైతు సంఘాల ద్వారా లబ్ధి పొందాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ప్రతి మండలంలో రెండేసి సంఘాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గతంలో ఉన్న సంఘాలను తగ్గించకుండా అవసరమైన చోట కొత్త సంఘం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. ఇచ్చోడ మండలంలో నాలుగు సంఘాలు ఉన్నాయి. కొన్ని మండలాల్లో ఇప్పటికే రెండేసి సంఘాలు ఉన్నాయి. కొత్త మండలాలతో పాటు మండలాల్లో ఒకే సంఘం ఉన్న చోట అదనంగా మరో సంఘం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 28 సంఘాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో రెండేసి సంఘాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, ఆదిలాబాద్ గ్రామీణం, అర్భన్ మండలాల్లో అదనం సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా మొత్తంలో గతంలో ఉన్న సంఘాలతో పాటు కొత్తగా ఏర్పాటు అయ్యే వాటితో కలిపి 43 సంఘాలు ఉండే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం 20 సంఘాలు ఉన్నాయి. కొత్త మండలాలతో పాటు అదనంగా ఏర్పాటు చేసే వాటితో జిల్లాలో 31 సంఘాలు అయ్యే వీలుంది. కుమురంభీం జిల్లాలోని కొత్త మండలాలతో పాటు, పాత మండలాల్లో ఒక్కో సంఘం ఉన్న చోట అదనంగా మరో సంఘం ఏర్పాటు చేయనున్నారు. జిల్లా మొత్తంలో అదనంగా ఎనిమిది సంఘాలు ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం 17 సంఘాలు ఉన్నాయి. తాజాగా తొమ్మిది అదనంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే సంఘాలు, వాటి పరిధి తదితర వాటికి రూపకల్పన చేసి తొలుత ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే అభ్యంతరాలను స్వీకరిస్తారు. తరువాత కొత్త ప్రతిపాదనలు పంపించి తిరిగి అనుమతి పొందిన తరువాత వాటిని సంఘంగా గుర్తిస్తారు. సంఘాలు ఏర్పాటు చేసిన తరువాత ఎన్నికలు జరిపే అవకాశముంది. సహకార సంఘాల పదవీ కాలం ఎప్పుడో పూర్తి అయింది. ఇప్పటి వరకు ఆరు నెలల చొప్పున మూడు విడతలుగా పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చారు. కొత్త సంఘాల ఏర్పాటు చేయడం పూర్తయిన తరువాత గతంలో ఉండే సంఘాలతో పాటు కొత్త సంఘాలకు కలిపి ఎన్నికలు నిర్వహించే అవకాశముంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నాయి. సభ్యత్వం పొందిన రైతులకే వీటి ద్వారా సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడమే గాకుండా, పంట రుణాలు ఇస్తాయి. ఈ మధ్య రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నాయి. వ్యవసాయ పరంగా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు సంఘం బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. సంఘాలు అందుబాటులోకి వస్తే దళారుల బెడద తగ్గుతుంది.