అందుబాటులోకి సీ అండ్ డీ జీడిమెట్ల ప్లాంట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అందుబాటులోకి సీ అండ్ డీ జీడిమెట్ల ప్లాంట్

హైద్రాబాద్, డిసెంబర్ 16, (way2newstv.com)
 నిర్మాణాలు, కూల్చివేతల ద్వారా వచ్చే వ్యర్థాలను శాస్త్రీయపద్ధతిలో రీసైక్లింగ్‌ చేసి మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన సీ అండ్‌ డీ ప్లాంటు(కన్‌స్ట్రక్షన్‌, డెమాలిషన్‌ వేస్ట్‌) జీడిమెట్లలో అందుబాటులోకి వచ్చింది. రోజుకు 50మెట్రిక్‌ టన్నులను రీసైక్లింగ్‌ చేసే సామర్థ్యం గల ఈ ప్లాంటులో ప్రయోగాత్మకం గా చేపట్టిన పనులు సఫలమయ్యాయి. దీంతో త్వరలో ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తోంది. ప్రజలు ఇక నిర్మాణ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి నిర్ణీత ఫీజు చెల్లిస్తే వారే ఆ వ్యర్థాలను తీసుకొని వెళ్తారు. పట్టణీకరణ ప్రభావంతో నిర్మాణాలు, కూల్చివేతలు పెరిగిపోయి వీటి ద్వారా వచ్చే వ్యర్థాలు ఎక్కువవుతున్నాయి. ఇవికాకుండా రోడ్ల పునరుద్ధరణ, వరద నీరు, మురుగునీటి కాల్వల పూడికతీత, కొత్త పైప్‌లైన్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం తదితర పనుల ద్వారా కూడా మట్టి, ఇతర నిర్మాణ వ్యర్థాలు వెలువడుతున్నాయి. 
అందుబాటులోకి  సీ అండ్ డీ జీడిమెట్ల ప్లాంట్

నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల్లో మట్టి, ఇసుక, మొరం-36శాతం ఉంటుండగా, ఇటుకలు, రాళ్లు-31శాతం, కాంక్రీట్‌-23, మెటల్స్‌-5, బిటుమెన్‌-2, కట్టె-2, ఇతర వ్యర్థాలు 1శాతం ఉంటున్నాయి. ఇంతకాలం ఈ వ్యర్థాలను నిల్వచేసేందుకు, తిరిగి ఉపయోగించేందుకు ప్రత్యేక విధానం లేకపోవడం వల్ల ఎవరి ఇష్టమొచ్చిన విధంగా వారు రోడ్ల వెంబడి, చెరువుల వెంబడి పోస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు, చెరువులు పూడిపోవడం, కబ్జాలు ఏర్పడ డం, వర్షాకాలంలో ఈ వ్యర్థా లు నాలాలు, పైప్‌లైన్లలో చేరి ముంపు సమస్య ఏర్పడుతోంది. ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా ఈ నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల సమస్య మరీ ఎక్కువైపోయింది. పురాతన, వేగంగా అభివృద్ధి చెందుతున్న మన హైదరాబాద్‌ నగరంలో రోజుకు 2000మెట్రిక్‌ టన్నుల నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకొని జీహెచ్‌ఎంసీ సీ అండ్‌ డీ వేస్ట్‌ రీసైక్లింగ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసిం గ్‌, నిర్వహణ(సీ అండ్‌ డీ వేస్ట్‌) కోసం జీహెచ్‌ఎంసీ పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో రాంకీ సంస్థ ఆధ్వర్యం లో బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(బీఓటీ) పద్ధతిలో జీడిమెట్ల పారిశ్రామికవాడలో 17ఎకరాల విస్తీర్ణంలో రీసైక్లింగ్‌ ప్లాం టును ఏర్పాటు చేసింది. గంటకు 50మెట్రిక్‌ టన్నుల చొప్పున రోజుకు 500మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను ఇది శాస్త్రీయపద్ధతుల్లో రీసైక్లింగ్‌ చేస్తుంది. ఈ ప్లాంటులో ముఖ్యంగా ఐదు దశలున్నాయి. మొదటిదశలో వ్యర్థాలను రాళ్లు, ఇటుకలు, ఇసుక తదితర విధంగా సెగ్రిగేట్‌ చేయ డం ఉంటుంది. అనంతరం డెబ్రిస్‌ హ్యాండ్లింగ్‌, మల్టిపుల్‌ స్క్రీనింగ్‌, మెటీరియల్‌ వాషింగ్‌, సాండ్‌ వాషింగ్‌, వాటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం తదితర దశలుంటాయి. ఈ ప్లాంట్‌లో వ్యర్థాల రీసైక్లింగ్‌ ఒక భాగమైతే, రీసైక్లింగ్‌ చేయడం ద్వారా వచ్చిన మెటీరియల్‌ను ఉపయోగించడం మరో భాగం.వ్యర్థాల రీసైక్లింగ్‌ ద్వారా వచ్చే మెటీరియల్‌ను ఇటుకలు, ఫుట్‌పాత్‌ టైల్స్‌ తదితర వస్తువులను తయారుచేసేందుకు ఉపయోగిస్తారు. అలాగే, నిర్మాణాలకు కాకుండా రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో ఈ మెటీరియల్‌ను ఉపయోగించవచ్చు. గతేడాది జవవరిలో వారికి స్థలాన్ని అప్పగించగా, వారికి కేటాయించిన స్థలం పూర్తిగా గ్రానైటు క్వారీ కావడంతో నిర్మాణ వ్యర్థాలతో ముందుగా గుంతలను పూడ్చివేసి ప్లాంటును నెలకొల్పారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలు కుండా వ్యర్థాల రవాణాను రాత్రి పొద్దుపోయిన తరువాత, తెల్లవారుజాము వేళల్లో నిర్వహించాలని నిశ్చయించారు. జీడిమెట్లతోపాటు జవహర్‌నగర్‌, ఫతుల్లగూడ, కోత్వాల్‌గూడ ప్రాంతాల్లో కూడా ఈ తరహా ప్లాంట్లను ఏర్పాటుచేసేందుకు జీహెచ్‌ఎంసీ భూములు కేటాయించింది. త్వరలోనే ఈ మూడు ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూడూ అం దుబాటులోకి వస్తే వ్యర్థాలను నూటికి నూరుశాతం రీసైక్లింగ్‌ చేసే వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు.