విజయవాడ, జనవరి 3, (way2newstv.com)
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో అసలు ఏం జరుగుతోందో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కైనా తెలుస్తోందా ? అసలు పార్టీపై ఆయనకు పట్టుందా ? ఇలా అయితే, పార్టీని ఆయన ఏం చేయనున్నారు ? ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీలోనే కాదు.. ఆపార్టీపై అభిమానం పెంచుకున్న వారు కూడా అడుగుతున్న ప్రశ్నలు, చేస్తున్న చర్చలు. కేవలం ఎన్నికలు పూర్తయిన ఏడు మాసాల్లోనే పార్టీలో జరుగుతున్న పరిణామాల పై చంద్రబాబు పట్టుకోల్పోవడం, నాయకులను లైన్‌లో పెట్టలేక పోవడం, పార్టీని ఓ పద్ధతిలో నడిపించలేక పోవడం వంటి అనేక లొసుగులు ఒకదాని తర్వాత ఒకటిగా తెరమీదికి వస్తుండడంతోపాటు కీలకమైన ప్రాంతాల్లో కీలకమైన నాయకులు పార్టీకి దూరం జరగడం కూడా పార్టీ పరిస్థితినే కాకుండా చంద్రబాబుపై కూడా సందేహాలు తెరమీదికి వచ్చేశాయి.
బాబుతో కలిసి రాని తమ్ముళ్లు
కేవలం 23 మంది మాత్రమే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో సగానికి సగం మంది మౌనం వహిస్తున్నారు. ఒకరు పార్టీకి ఇప్పటికే దూరమయ్యారు. మిగిలిన 22 మందిలో సగం మంది చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నప్పటికీ.. చంద్రబాబుకు కలిసి వస్తున్నవారుగా మాత్రం వారు వ్యవహరించడం లేదు. తాను ఒకటి తలిస్తే.. పార్టీ నేతలు మరో రకంగా స్పందించడం అనేది ఎన్నికల తర్వాతే బయటపడి పోయింది.ఆంగ్ల మాధ్యమంపై చంద్రబాబు పోరుకు రెడీ అయిన వెంటనే పార్టీలోని కీలక నాయకులు ఇది కరెక్టే. అని చెప్పడం.. చర్చకు దారితీసింది. ఇక, ఇసుక పై చంద్రబాబు దీక్ష చేపడితే.. స్థానిక ఎంపీనే రాని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో సొంత పార్టీలోనే నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా సాగుతున్న పరిస్థితి ఉంది. ఇక, ఇసుక దీక్ష రోజే గన్నవరం ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేయడం, ఎంపీ నాని.. సొంత పార్టీ మాజీ మంత్రినే టార్గెట్ చేయడం, చంద్రబాబుకు సవాళ్లు రువ్వడం, ఎమ్మెల్సీపై చెప్పుల దొంగ, కొబ్బరి చిప్పల దొంగ అంటూ వ్యాఖ్యలు చేయడం ఇలా ఒకటేమిటి.. ఒకరేమిటి.. ఎవరికి వారు ఎక్కడికక్కడ పార్టీలైన్‌లో కాకుండా తమ సొంత లైన్‌లో వ్యవహరించడం పార్టీపై అభిమానం పెట్టుకున్న వారికి కూడా తీవ్ర ఇబ్బందిగా మారింది.ఇక, తాజాగా రాజధాని కోసం ఉద్యమిస్తున్న సమయంలో అదే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి నేరుగా సీఎం జగన్‌ను కలిసి .. ఆయనను పొగడడంతోపాటు చంద్రబాబును తూలనాడడం మరింతగా పార్టీపై మచ్చ పడేలా చేసింది. తప్పు ఎవరిది? నేతలదా? లేక నేతలను గెలిపించుకున్న వారిని అదుపులోకి తెచ్చుకోలేక పోతున్న చంద్రబాబుదా..? అనే చర్చ జోరుగా సాగుతుందడడం గమనార్హం. మరి ఈ గందరగోళానికి ఎప్పటికి తెరపడుతుందో చూడాలి.