విజయవాడ, జనవరి 9, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ లో తాజాగా నెలకొన్న పరిస్థితులను ఆసరాగా చేసుకుంటూ కమలం పార్టీ రాజకీయ విస్తరణ వ్యూహాలను సిద్దం చేసుకుంటోందా? అధికార విపక్షాలకు సవాల్ విసిరేందుకు బలమైన నేతలపై ఆకర్షణాస్త్రం ప్రయోగిస్తోందా? ఒక వైపు రాజధానిపై ప్రకంపనలు పుడుతున్నాయి. మరోవైపు బీజేపీ భిన్నవాదనలు ప్రజల్లోకి పంపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజధానులపై చర్చోపచర్చలు నడుస్తున్నా.. కమలం అధిష్ఠానం కాసింతైనా స్పందించకుండా వేచి చూడటం వెనక పక్కా రాజకీయప్రయోజనాలు దాగి ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొనేవారే రాణిస్తారు. బలమైన రెండు పార్టీలు ముఖాముఖి మోహరించి ఉన్నప్పుడు మూడోపక్షం ఎదిగేందుకు అవకాశాలు అంతంతమాత్రమే.
విస్తరణకు కమలం వ్యూహాలు
ఏదో ఒక పార్టీ బలహీనపడినప్పుడు లేదా పరిస్థితులు పూర్తిగా రివర్స్ స్వింగ్ లోకి వెళ్లినప్పుడు మాత్రమే రాజకీయ అవకాశం చిక్కుతుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం అందుకు ఆస్కారం కల్పిస్తోందని బీజేపీ భావిస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మూడు రాజధానుల అంశాన్ని పట్టుకుని అధికార వైఎస్సార్ కాంగ్రెసు దూకుడు కనబరుస్తోంది. మూడు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరుస్తూ రాజకీయ స్థిరత్వాన్ని సాధించాలనేది ఈ నిర్ణయం వెనక అధికారపార్టీ లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో వైసీపీ ఆశించిన పూర్తి సానుకూలత కనిపించడం లేదు. రాజకీయ పార్టీల్లో ప్రాంతాలవారీ భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దాంతో సర్కారుకు వందశాతం మైలేజీ దక్కడం లేదు. ప్రజలు రకరకాల సమీకరణలు వేసుకుంటున్నారు.నిజానికి రాజధాని వంటి కీలక నిర్ణయంలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నప్పుడు దాని ద్వారా గరిష్ఠంగా ప్రయోజనం పొందే అవకాశం ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్, సామాజిక వర్గం అంశాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ముందరికాళ్లకు బంధం వేసింది. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ సర్కారుపై బలంగా పోరాటం సాగించలేని బలహీనత టీడీపీలో కనిపిస్తోంది. అందులోనూ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని టీడీపీ నాయకులు పార్టీ నిర్ణయానికి బాసటగా నిలవలేకపోతున్నారు. ఇది ప్రతిపక్షానికి బలహీనతగా పరిణమించింది. అదే సమయంలో అధికారపార్టీలో మాత్రం అధిష్టానం నిర్ణయాన్ని బహిరంగంగా ఎవ్వరూ వ్యతిరేకించలేకపోతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి నిర్ణయమే శిరోధార్యమంటూ తేల్చి చెబుతున్నారు. కొందరు వైసీపీ నాయకులైతే ఉద్యమం సాగిస్తున్న రైతులకు ఉద్దేశాలను అంటకడుతూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ మొత్తం పరిస్థితులను అధ్యయనం చేస్తున్న బీజేపీ మెల్లగా పావులు కదుపుతోందరాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, సీనియర్ పార్టీ నేత సోము వీర్రాజు లు ఒక రకమైన వాదనతో ప్రజల్లోకి వెళుతున్నారు. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి బీజేపీకి సంబంధం లేదని వారు చెబుతున్నారు. దాంతో ప్రభుత్వంతో తాము విభేదించడం లేదనే ధోరణిని వారు కనబరుస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ సారథ్యంలోని రాష్ట్రశాఖ మాత్రం అధికారికంగా అమరావతిని తరలించకూడదనే భావనను వ్యక్తం చేస్తోంది. మొత్తం వ్యవహారాన్ని బేరీజు వేస్తే పొలిటికల్ ఎత్తుగడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడు రాజధానుల నిర్ణయంతో రాజకీయంగా అధికారపార్టీకి నష్టం వాటిల్లితే బలహీనంగా ఉన్న ప్రతిపక్షం బదులుగా తాను ప్రయోజనం పొందవచ్చనే ఆలోచన బీజేపీలో తొంగి చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జేసీ దివాకరరెడ్డి వంటి సీనియర్ నాయకులతోపాటు మోహన్ బాబు వంటి సీనియర్ నటులనూ సన్నిహితం చేసుకుంటోంది. అదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ తో పాత సంబంధాల పునరుద్ధరణ యత్నాలను ముమ్మరం చేసింది. సహజంగా ఆంధ్రప్రదేశ్ లో కమల వికాసానికి అవకాశాలు తక్కువ. అయితే ప్రాంతీయ పార్టీల ధోరణులు ప్రజల్లో విసుగు కల్పించే వాతావరణం ఏర్పడితే మాత్రం బీజేపీ ఎదుగుదలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లే.