కర్నూలు, జనవరి 07(way2newstv.com):
పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జిల్లాలో మనబడి ‘నాడు-నేడు’ కార్యక్రమానికి ఎంపికైన పాఠశాలల్లో తొమ్మిది రకాల పనులు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో నిధుల వినియోగాన్ని కఠినతరం చేశారు. ప్రతి పైసాకు లెక్క చూపేలా.. ఖర్చులన్నీ చెక్కు ద్వారానే చెల్లింపులు చేసేలా నిబంధనలు రూపొందించారు. చెక్ పవర్ వినియోగాన్ని సైతం ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. జిల్లాలో 2,969 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 4,25,611 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యాలయాల పరిస్థితి అధ్వానంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో భవనాలు కూలిపోయే స్థితిలో ఉండగా.. మరికొన్నింటిలో కనీస వసతులు కరవయ్యాయి.
బడికి మంచిరోజులు (కర్నూలు)
దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడతగా జిల్లాలో 1,111 పాఠశాలలను ఎంపిక చేసింది. ఇక్కడ జరిగే పనులు.. నిధుల వినియోగం పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. చెక్కు చెల్లుబాటు కావాలంటే దానిపై ఐదుగురు సభ్యులతో కూడిన పాఠశాల యాజమాన్య కమిటీ సంతకాలతో ఆమోదం తెలపాల్సి ఉంది. మనబడి నాడు-నేడు పర్యవేక్షణ బాధ్యతలను సమగ్ర శిక్షాభియాన్ ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించారు. పనులన్నీ తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించేలా మార్గదర్శకాలు జారీ చేశారు. పాఠశాలల వారీగా అభివృద్ధి పనులు రూపొందించి వాటిని ప్రభుత్వం ఏజెన్సీకి అప్పగించింది. పనుల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా పాఠశాల యాజమాన్య కమిటీలకే అప్పగించింది. చెక్కుపై సంతకం చేసే ఐదుగురు సభ్యుల్లో తప్పనిసరిగా ముగ్గురు మహిళలై ఉండాలి. మరో ఇద్దరు ఎస్సీ, ఎస్టీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చెక్‌పవర్ వినియోగ సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా సంబంధిత పనులు చేపట్టే శాఖకు చెందిన క్షేత్రస్థాయి ఇంజినీరు ఉండాలి. చెక్‌పవర్ కమిటీలు ఏర్పాటుచేసే బాధ్యతను ఎంఈవోకు అప్పగించారు. పాఠశాల కమిటీ చైర్మన్, మరో నలుగురు సభ్యులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌తో కలిపి ఈ ఖాతాలు ప్రారంభిస్తారు. వాటిని ఎస్‌టీఎంఎస్ యాప్‌లో నమోదు చేయాలి. పనులు ప్రారంభించేందుకు అవసరమైన అంచనా విలువలో 15 శాతం నిధులు తీసుకోవాలంటే తల్లిదండ్రుల కమిటీలో తీర్మానం చేయాలి. తరగతుల నిర్వహణకు సరిపడా గదులు కూడా లేని పాఠశాలలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. క్రీడా మైదానాలు, ప్రహరీలు, నిరంతర నీటి సరఫరా అంతంతమాత్రమే. జిల్లాలోని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది పేద పిల్లలే ఇక్కడ చదువుకొంటున్నారు. ఈ భవనాలకు మరమ్మతులు కానరాకపోవడంతో శిథిలమైన వాటిల్లోనే పాఠాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల స్థితిగతులను మార్చేందుకు శ్రీకారం చుట్టింది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎంపిక చేసిన బడుల్లో తొమ్మిది రకాల పనులు చేసేందుకు సంకల్పించారు. అందులో తరగతి గదుల నిర్మాణం.. భవనాలకు మరమ్మతులు, ప్రహరీ, నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు, పంకాలు, దీపాలు అమర్చడం.. తాగునీటి సదుపాయం.. బల్లలు, ఉపాధ్యాయులకు కుర్చీలు, భవనాలకు రంగులు వేయడం...ఆకుపచ్చ బోర్డుల ఏర్పాటు, ల్యాబ్ సదుపాయం కల్పించనున్నారు. ఈ పనులు పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయిలో సమగ్ర శిక్ష అభియాన్, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమశాఖ, ఈడబ్ల్యూఐడీసీ, ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ అధికారులతో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఒక కేటగిరీ, ఉన్నత పాఠశాలలు మరో కేటగిరీగా విభజించి అందులోని విద్యార్థుల సంఖ్యను బట్టి కాంపోనెంట్ (భాగం) వారీగా నిధులు మంజూరు చేస్తున్నారు. వచ్చే నెలలో ప్రారంభించే పనులను ఎలా చేయాలి.. తల్లిదండ్రుల కమిటీ బాధ్యతలు తదితర అంశాలపై ఉన్నతాధికారులకు శిక్షణ ఇస్తున్నారు.