కౌంటింగ్ కు పూర్తయిన ఏర్పాట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కౌంటింగ్ కు పూర్తయిన ఏర్పాట్లు

హైద్రాబాద్, జనవరి 24, (way2newstv.com)
నగర పాలక, మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. 120 మున్సిపాలిటీలు, 9 నగరపాలక సంస్థల్లో 25న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆయన చెప్పారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి నిబంధనలు, మార్గదర్శకాలు ఖరారు చేసినట్లు వివరించారు. 25న సాయంత్రానికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని నాగిరెడ్డి ప్రకటించారు. మున్సిపాలిటీల్లో మొత్తం 74.4 శాతం, కార్పొరేషన్లలో 58.83 శాతం పోలింగ్ నమోదైందని నాగిరెడ్డి వివరించారు.27వ తేదీన మున్సిపల్ ఛైర్ పర్సన్లు, కార్పొరేషన్లకు మేయర్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని వివరించారు. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ విప్‌లను నియమించుకోవచ్చని అన్నారు. 
కౌంటింగ్ కు పూర్తయిన ఏర్పాట్లు

రాజకీయ పార్టీలు మేయర్, ఛైర్ పర్సన్లకు ప్రతిపాదించే వారి పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలని సూచించారు. అయితే, ఈ నెల 26న ఉదయం 11 గంటల వరకూ ఫామ్-ఏ, 27న ఉదయం 10 గంటల లోపు ఫామ్-బీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. పరోక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఎన్నికల నిబంధన అమలు చేయనున్నట్లు వివరించారు. 25వ తేదీ సాయంత్రం నుంచి ఈ నియమావళి అమలు మొదలవుతుందని తెలిపారు.కరీంనగర్ మేయర్ ఎన్నిక మాత్రం ఈ నెల 29న ఉంటుందని ఎస్ఈసీ నాగిరెడ్డి వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు సమానంగా వస్తే లాటరీ పద్ధతి ద్వారా విజేతను ఎంపికచేస్తామని చెప్పారు. ఎన్నికలు జరిగేటప్పుడు తాను కారు గుర్తుకు ఓటేశానని బహిరంగంగా చెప్పిన మంత్రి గంగుల కమలాకర్ అంశాన్ని పరిశీలిస్తామని నాగిరెడ్డి అన్నారు.మున్సిపల్ శాఖ ప్రధాన కమిషనర్ శ్రీదేవి మాట్లాడుతూ.. ఎక్స్ అఫిషియో సభ్యులకు కూడా ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఒక ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో ఒకే మున్సిపాలిటీ ఉన్న పక్షంలో ఒకే ఎక్స్ అఫీషియో ఉంటారని, ఒకటికి మించి ఉన్నచోట ఎమ్మెల్యేలు ఆప్షన్‌లు ఇవ్వాల్సి ఉంటుందని శ్రీదేవి వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఎక్స్ అఫీషియో కోసం ఆప్షన్‌లు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ఎక్స్ అఫీషియో సభ్యత్వం కోసం 25 సాయంత్రం వరకూ ఆప్షన్ ఇవ్వవచ్చని శ్రీదేవి వెల్లడించారు. ఆప్షన్లు ఇచ్చే విషయంలో ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.