మరోసారంటున్న కేజ్రీవాల్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మరోసారంటున్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ, జనవరి 27 (way2newstv.com)
ఢిల్లీ ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్లు సాగతున్నాయి. వచ్చే నెల 8వ తేదీన జరగబోయే ఎన్నికలకు అన్ని పార్టీలూ గెలుపు కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కూడా విజయం తమదేనన్న ధీమాలో ఉంది. ఇందుకు కారణం ఇటీవల ఇతర రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలే కారణం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈసారి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడం కలసి వస్తుందా? రాదా? అన్న చర్చ జరుగుతోంది. దాదాపు పదిహేను మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ ఈసారి టిక్కెట్లు ఇవ్వలేదు.ఈసారి ఢిల్లీ ఎన్నికలు మోదీ వర్సెస్ కేజ్రీవాల్ అన్న రీతిలో సాగుతున్నాయి. బీజేపీ కూడా ఇదే రకమైన ప్రచారం చేస్తోంది. 
మరోసారంటున్న కేజ్రీవాల్

గతంలో హర్షవర్ధన్, కిరణ్ బేడీలను తమ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించి దెబ్బతిన్న బీజేపీ ఈసారి ఆ తప్పు చేయలేదు. మోదీ ఇమేజ్ ను వాడుకోవాలను కుంటోంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ పార్టీ సయితం కేంద్రంలో మోడీ, ఢిల్లీలో కేజ్రీ అనే నినాదాన్ని పాపులర్ చేశారు. రాష్ట్రంలో తమ గెలుపు ఖాయమన్న ధీమాలో కేజ్రీవాల్ ఉన్నారు.ఢిల్లీ వాసులకు ఇప్పటికే ప్రకటించిన “ఉచిత” ప్రయోజనాలు తమను గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. కానీ ఈసారి ఎక్కువ మంది కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడంతో ఆ ప్రయోగం ఏ మేరకు సఫలమవుతుందో చూడాల్సి ఉంది. తాను అవినీతి లేని పాలనను అందించాలని కేజ్రీవాల్ తన ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. అన్ని వర్గాలను చేరువ చేసుకునే విధంగా కేజ్రీవాల్ బలంగానే ముందుకు వెళుతున్నారు.పార్లమెంటు ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం కేజ్రీవాల్ లో కొంత కంగారు ప్రారంభమయిందనే చెప్పాలి. గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 22 శాతం ఓట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీకి 18 శాతమే లభించాయి. అయితే లోక్ సభ ఎన్నికలు కాబట్టి ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని, రాష్ట్ర ఎన్నికల్లో తమ వైపే ఉంటారని కేజ్రీవాల్ నమ్మకంగా ఉన్నారు. మోదీ ఇమేజ్ ను వాడుకోవాలని బీజేపీ ఎంత ప్రయత్నించినా ఢిల్లీలో మాత్రం వర్క్ అవుట్ కాదన్నది ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి నమ్మకంతోనే ఉంది. మరి కేజ్రీవాల్ ను మరోసారి ఢిల్లీ వాసులు ముఖ్యమంత్రిని చేస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.