కాకినాడ, జనవరి 4, (way2newstv.com)
అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో కొబ్బరికాయ ధర పెరిగింది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎగుమతులు తగ్గడం.. సంక్రాంతి పండగ నేపథ్యంలో కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలోనే వెయ్యి కాయల ధర ఏకంగా రూ.వెయ్యి వరకూ పెరిగింది. నెల కిందట తగ్గి... ఆందోళనలో ఉన్న కొబ్బరి రైతులకు పెరిగిన ధర కొంత వరకు ఊరట కల్పించాలి... కానీ అంచనాలకన్నా తక్కువ దిగుబడి రావడంతో పెరిగిన ధర వల్ల పెద్దగా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. సంక్షోభంలో ఉన్న కొబ్బరి రైతులకు కొబ్బరి కాయల ధర రూపంలో కొంత ఊరట కలి గించే అంశమనుకుంటున్న సమయంలో దిగుబడి కనిష్ట స్థాయికి పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఊరటనిస్తున్న కొబ్బరి ధరలు
గత నెల రోజుల కిందట కొబ్బరి ధర పతనమైన విషయం తెలిసిందే. వెయ్యి పచ్చికాయల ధర రూ.7 వేల నుంచి రూ.7,200 వరకు తగ్గిపోగా, పాత ముక్కుడు కాయ రూ.7,500 నుంచి రూ.8 వేల వరకు ఉండేది. ఇప్పుడు పచ్చికాయ ధర రూ.8 వేల నుంచి రూ.8.500 వరకు, ముక్కుడు కాయ రూ.9 వేల నుంచి రూ.9,500 వరకూ పెరిగింది. ఇంచుమించు రూ.వెయ్యి వరకు పెరగడం విశేషం. ధర పెరగడానికి కారణం ఉత్తరాది మార్కెట్‌కు దక్షిణాది తమిళనాడు, కేరళ, కర్ణాటకల నుంచి ఎగుమతులు చాలా వరకు కారణం. పైగా ఈ రాష్ట్రాల నుంచి వస్తున్న కొబ్బ రి ధర అధికంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు మన రాష్ట్రం నుంచి కొబ్బరి కొనుగోలుకు మొగ్గు చూపడంతో స్థానిక మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడి ధర పెరి గింది. ముఖ్యంగా అంబాజీ పేట మార్కెట్ నుంచి పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్‌కు ఎగుమతిఅవుతున్నాయి.పెరిగిన ధర రైతులకు పెద్దగా సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఈ సీజన్‌లో కత్తెరకాయ దిగుబడిగా వస్తోంది. దీనికితోడు దిగుబడి సైతం గణనీయంగా తగ్గింది. ఎకరాకు 1800 వరకు ఉండే దింపు ఇప్పుడు 400 నుంచి 600 మించడం లేదని రైతులు వాపోతున్నారు. మరో రెండు, మూడు నెలలూ ఇదే పరిస్థితి. దీనివల్ల పెరిగిన ధరల వల్ల తమకు పెద్దగా లాభం లేదని, అయితే ధరలు పెరగడం కొంత వరకు ఊరటనిస్తోందని రైతులు చెబుతున్నారు. అంబాజీపేట మార్కెట్‌లో పచ్చి కొబ్బరితోపాటు కొత్తకొబ్బరి ధరలు కూడా పెరిగాయి. క్వింటాల్ కొత్త కొబ్బరి ధర గతంలో రూ.8,500 నుంచి రూ.8,800 వరకు ఉండగా, ఇప్పుడు అది కాస్తా రూ.8,700 నుంచి రూ.9,300 వరకు పెరిగింది. కొత్త కొబ్బరి రెండో రకం ధర గతంలో రూ.7,500 నుంచి రూ.8.100 వరకు ఉండగా, ఇప్పుడు అది కాస్తా రూ.8,300 నుంచి రూ.8.500 వరకూ పెరిగింది. కురిడీ కొబ్బరి పాత రకంలో వెయ్యికాయల ధర రూ.12 వేలు ఉండగా, అది కాస్తా రూ.12,500 వరకూ పెరిగింది. రూ.11 వేలు ఉన్న పాత కాయ రూ.11,500 వరకు, గటగట పాత కాయ రూ.8 వేల నుంచి రూ.8,300 వరకు, కొత్తకాయ రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఇలా మొత్తం కొబ్బరి ఉత్పత్తుల ధరల పెరగడం విశేషం.