విశాఖకు లైట్ మెట్రో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విశాఖకు లైట్ మెట్రో

విశాఖపట్టణం, జనవరి 11, (way2newstv.com)
విశాఖలో మెట్రో ప్రాజెక్టుకు ఒక్కో అడుగూ ముందుకు పడుతోంది. మెట్రో కారిడార్‌ విస్తీర్ణాన్ని పెంచుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. నగరంలో ఏఏ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటుంది.. ఏ సమయాల్లో ఎక్కువగా ఉంటుందనే అంశాలను తెలుసుకునేందుకు అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ(యూఎంటీసీ)తో ఏఎంఆర్‌సీ నెల రోజుల నుంచి సర్వే నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల్లో యూఎంటీసీ బృందం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఆయా ప్రదేశాల్లో ట్రాఫిక్‌ రద్దీని నమోదు చేస్తున్నారు. ఈ సర్వే మరో 3 వారాల్లో పూర్తి కానుంది. ఈ నెలాఖరుకల్లా ట్రాఫిక్‌ సర్వే రిపోర్టుని ఏఎంఆర్‌సీకి అందించనున్నారు. ఈ రిపోర్టు ప్రకారం మెట్రో రైలు ఎక్కడ, ట్రామ్‌కార్లు ఎక్కడనే దానిపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.
విశాఖకు లైట్ మెట్రో

గతంలో తొలి దశలో 42 కిలోమీటర్లు మాత్రమే ప్రపోజల్స్‌ ఉండేవి. కానీ గాజువాకతోనే ఆపెయ్యకుండా స్టీల్‌ప్లాంట్‌ వరకూ పొడిగించాలన్న డిమాండ్‌ మేరకు ప్రాజెక్టుని మరో 4 కి.మీ మేర విస్తరిస్తూ 46.40 కి.మీ పెంచారు. దీంతో పాటు గతంలో 8 కారిడార్లు మాత్రమే ఉండేవి. పెరుగుతున్న జనాభా, అవసరాల దృష్ట్యా.. కారిడార్ల సంఖ్య కూడా 10కి చేరకుంది. మొత్తం 140.13 కి.మీ వరకూ మెట్రోరైలు పొడిగించారు. దీంతో పాత టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా రీటెండర్లని పిలవాలంటూ ఏఎంఆర్‌సీకి సూచిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. రెండు భాగాలుగా విభజించి మెట్రో ప్రాజెక్టు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచనలందించారు. ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో రైలు, ట్రామ్‌కార్లుగా విభజించాలని సూచించారు. తొలి దశలో మెట్రో ప్రాజెక్టుని, ఆ తర్వాత ట్రామ్‌కార్లుకి సంబంధించి టెండర్లు పిలిచేలా ప్రాజెక్టు రూపొందించేందుకు అమరావతి మెట్రో కార్పొరేషన్‌ సమాయత్తమవుతోంది.అలలు వెంట అందమైన ప్రయాణం చేసే రోజులు త్వరలోనే రానున్నాయి. విశాఖ నగర తీరంలో విద్యుదయస్కాంత శక్తితో నడిచే ట్రాక్‌ లెస్‌ ట్రామ్‌ పరుగులు తీయనుంది. మెట్రో రైలు ఏర్పాటులో భాగంగా ప్రత్యేక మార్గం అవసరం లేకుండానే.. రహదారి ఉపరితలంపై స్పెషల్‌ బస్‌ మాదిరిగా ఉండే తేలికపాటి రైల్వే వ్యవస్థని అందుబాటులోకి తీసుకురానున్నారు. ట్రాఫిక్‌ రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రామ్‌ కార్లు ఏర్పాటు చెయ్యనున్నారు. ఇందులో భాగంగా ప్రాథమికంగా కొన్ని కారిడార్లని గుర్తించారు. ఎన్‌ఎడీ జంక్షన్‌ నుంచి పెందుర్తి వరకూ 10.20 కిలో మీటర్లు, పాతపోస్టాఫీస్‌ నుంచి రుషికొండ బీచ్‌ వరకూ 15.40 కి.మీ, రుషికొండ బీచ్‌ నుంచి భీమిలి బీచ్‌ వరకూ 16.40 కి.మీ దూరంలో ట్రామ్‌ కార్లు అందుబాటులోకి తీసుకురానున్నారు.విద్యుదయస్కాంత శక్తితో నడిచే ట్రాక్‌లెస్‌ రైలు వ్యవస్థనే ట్రామ్‌ కార్‌ అని పిలుస్తారు. ప్రత్యేకంగా రైలు ట్రాక్‌ మార్గం అనేది లేకుండానే రోడ్లపైనే ప్రయాణించడం ట్రామ్‌కార్‌ ప్రత్యేకత. ఒక లగ్జరీ బస్‌ మాదిరిగానే ఈ ట్రామ్‌కార్‌ ఉంటుంది. 300 నుంచి 500 వరకూ ప్రయాణించవచ్చు. ప్రయాణికుల రద్దీ పెరిగితే అవసరానికి తగ్గట్టుగా దారిలో ఉన్న స్టేషన్‌లో అదనపు బోగీ అనుసంధానం చేసేలా వ్యవస్థ ఉండటం దీని ప్రత్యేకత. సాధారణంగా ఒక కిలోమీటర్‌ మేర లైట్‌ మెట్రో ప్రాజెక్టు పూర్తి చెయ్యాలంటే సుమారు రూ.200 కోట్లు అవసరం ఉంటుంది. కానీ ఈ ట్రామ్‌ కార్‌ని లైట్‌ మెట్రో ఖర్చులో సగం అంటే రూ.100 కోట్లతో పూర్తి చెయ్యవచ్చు. గంటకు గరిష్టంగా 70 కి.మీ వేగంతో దూసుకెళ్లే ట్రామ్‌కార్‌ పూర్తిగా పర్యావరణ హితమైంది. అందుబాటులో ఉన్న రోడ్లపై సెన్సార్‌ సిగ్నల్‌ విధానంతో వర్చువల్‌ ట్రాక్‌ ఆధారంగా ట్రామ్‌ నడుస్తుంది. బీచ్‌ రోడ్డుపై ట్రామ్‌కార్‌లో ప్రయాణిస్తుంటే విదేశాల్లో విహరిస్తున్న మధురానుభూతికి ప్రయాణికులు లోనవుతారు.