ఏలూరు, జనవరి 11, (way2newstv.com)
సంక్రాంతి పండగ పేరు చెప్పగానే అందరికి గోదావరి జిల్లాలే గుర్తుకు వస్తాయి. ఎందుకంటే పండగ జోష్ అంతా ఇక్కడే ఉంటుంది. పచ్చని పొలాల నడుమ గలగలా పారే గోదావరి, కనువిందు చేసే కాలువల నడుమ సాగే పండగ సంబరాలు ఇక్కడ అంబరాన్ని తాకడం సంప్రదాయంగా వస్తున్నదే. ఈ అందాల నడుమ హైలెట్ గా నిలుస్తాయి కోడిపందాలు. పండగ విందు భోజనం ఆరగించి ఆట పాటలతో జనం ఈ పందాల జోష్ లో నిండి పోతారు. ఇలాంటి వేదికల్లో దెందులూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకం వుంది. ఇక్కడ వుండే చింతమనేని ప్రభాకర్ అన్నా ఆయన ప్రయివేట్ సైన్యం అన్నా పోలీసులే హడలిపోయేవారు. దాంతో బిందాస్ గా ఇక్కడ పందాల జోష్ నడిచేది. సాక్షాత్తు ఎమ్యెల్యేనే అన్ని తానై పందెం రాయుళ్ళకు రక్షణ కల్పిస్తుంటే ఎవరు మాత్రం అక్కడికి పోకుండా వుంటారు.
చింతమనేనిలో కనిపించని సంక్రాంతి సందడి
అయితే ఈసారి మాత్రం గతానికి భిన్నంగా దెందులూరు వుండబోతుందా అంటే అవుననే అంటున్నారు అంతా. దీనికి కారణం చింతమనేని ప్రభాకర్ గత ఎన్నికల్లో ఓడిపోవడం ఆయనపై జీవితకాలానికి సరిపడా వున్న కేసుల తో కోడిపందాల ఊసే లేకుండా పోయిందంటున్నారు. వాస్తవానికి సంక్రాంతి పండగకు కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో కానీ చింతమనేని ప్రభాకర్ బరుల్లో పందెం కొళ్ళు మాత్రం చిందులు వేసేవి. కత్తులు కట్టిన కాళ్లతో విన్యాసాలు చేసి రక్తాలు పారించేసివి. అది కూడా పండగకు నెలముందు నుంచే మొదలు అయిపోయేది. అయితే ఈసారి పోలీస్ కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయి పోలిస్ స్టేషన్లు, కోర్టు లు, జైళ్ళ చుట్టూ తిరగడానికే సమయం లేని చింతమనేని ప్రభాకర్ ఇక పాత రోజుల్లో లా హుషారుగా లేరు. దాంతో ఈసారి ఆయన శిబిరం పూర్తి నీరసంగా కనిపిస్తుంది.తమ నాయకుడు చింతమనేని ప్రభాకర్ తో ఉంటే ఏ కేసులు వచ్చిపడిపోతాయో అని బెంబేలెత్తిన ప్రయివేట్ ఆర్మీ, ముఖ్య అనుచరగణం సైతం ఆయన్ను వంటరిని చేసి వదిలి వెళ్లిపోయారు. తనపై వున్న కేసులతో ప్రజలకు ఎంటర్ టైన్మెంట్ గా మారి వున్న దిక్కుమాలిన పరిస్థితిలో వారికి మరో వినోదం అందించడమేమిటి అన్న థియరీతో ఉన్నారట చింతమనేని ప్రభాకర్. దాంతో పాటు కోళ్ళకు కత్తికట్టి మరికొన్ని చిక్కులు కొనితెచ్చుకునే ధైర్యం చింతమనేని ప్రభాకర్ లో పూర్తిగా చచ్చిపోవడంతో ఈ సారి దెందులూరు పండగకు డల్ అయిపోతుందంటున్నారు అంతా. ఇది ఎవరికీ ఎలా వున్నా పందెం రాయుళ్లకు మాత్రం పెద్ద దెబ్బనే చెప్పాలి.