విజయవాడ, జనవరి 27 (way2newstv.com)
ఏపీ శాసనమండలి రద్దు ప్రతిపాదనకు రాష్ట్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉదయం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్, శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి దాదాపు అందరు మంత్రులూ హాజరుకాగా, నిమిషాల్లోనే ఈ సమావేశం ముగియడం గమనార్హం. మండలి రద్దు అంశాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ లేవనెత్తగా, కొందరు సీనియర్ మంత్రులు మాత్రం కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం.మరో ఏడాదిలో ఎలాగైనా మండలిలో బలం పెరుగుతుందని, పదవులు లేని పార్టీ నేతలకు స్థానం కల్పించవచ్చని, వారు చెప్పగా, అప్పటికే రద్దుపై ఓ నిర్ణయానికి వచ్చేసిన సీఎం, బిల్లులను అడ్డుకునే సభలు ఎందుకని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో మంత్రులంతా ఆయన నిర్ణయానికి ఆమోదం పలికారు.
ఏపీ మండలికి మంగళం
ఏపీ శాసనమండలి-పూర్వాపరాలు:
ఆంధ్రప్రదేశ్ లో 1958లో ఆర్థికల్-198 కింద జూలై ఒకటిన శాసన మండలి ఏర్పడింది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ 1958 జులై 8 శాసనమండలిని అధికారికంగా ప్రారంభించారు. శాసనమండలి ఆవిర్భవించిన 27 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ 1983లో ఘన విజయం సాధించిన అనంతరం ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ 1985లో శాసన మండలి రద్దుచేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మండలిలో 90 మంది సభ్యులు ఉన్నారు. అయితే టీడీపీ నూతనంగా ఆవిర్భవించడంతో మండలిలో టీడీపీకు ఒక్క సభ్యుడు కూడా లేరు. దీంతో పాలనాపరమైన సమస్యలు ఏర్పడడంతో మండలి వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోగా, బిల్లుల ఆమోదం విషయంలో జాప్యం జరుగుతుండడంతో పాలన సజావుగా సాగడం లేదని అంతేకాకుండా మండలిలో రోశయ్య లాంటి ఉద్దండులు ఉండడం వలన వారిని ఎదుర్కొనలేకే ఎన్టీఆర్ మండలిని రద్దు చేశారనే వ్యాఖ్యలు వినవచ్చాయి. మండలి రద్దు అనంతరం కాంగ్రెస్ వాణి పడిపోయింది. అనేకమంది రాజకీయ నిరుద్యోగులయ్యారు. అప్పట్లో మండలి రద్దు సంచాలనాత్మక నిర్ణయమైంది. అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో 1989 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మండలిని పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టారు. శాసనమండలి పునరుద్దరణలో భాగంగా 1990 జనవరి 2న శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. అప్పటి నుంచి పలు సాంకేతిక కారణాల వలన మండలి పునరుద్ధరణ ప్రతిపాదన పెండింగ్లో పడింది. రాష్ట్రంలో 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మండలి పునరుద్ధరణ అంశం తెరపైకి వచ్చింది. 2004 జూలై 8న మండలి పునరుద్ధరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. 2004 డిసెంబర్ 16న లోక్‌సభలో ప్రవేశపెట్టగా 2006 డిసెంబర్ 15న బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. వెంటనే డిసెంబర్ 20న రాజ్యసభ కూడా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. తదనంతరం 2007 జనవరి 10న రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడంతో కొత్తగా శాసనమండలి 2007 మార్చి 30న అప్పటి గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుల సంఖ్య 90 మంది ఉండగా.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ఎమ్మెల్సీల సంఖ్య 58గా ఉంది. ఆరు సంవత్సరాలు మండలి సభ్యుల కాలపరిమితి కాగా.. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడవ వంతు సభ్యుల కాల పరిమితి ముగుస్తుంది. వారి స్థానంలో కొత్త సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ 58 మందిలో 8 మందిని గవర్నర్ నియమిస్తారు. 40 మంది సభ్యులను శాసనసభ్యులు, స్థానిక సంస్థల నుంచి ఎన్నుకుంటారు. వీరిలో 10 మంది ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎన్నికవుతారు. 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన వైసీపీకి ఏపీ శాసనమండలిలో మాత్రం 58 స్థానాలకుగాను కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి 31, పీడిఎఫ్‌కు 3, నామినేటెడ్ 8, బిజేపీ 2, స్వంతంత్రులు ఐదుగురు ఉన్నారు. మరో స్థానం ఖాళీగా ఉంది. ప్రక్రియ పూర్తయ్యేది ఎప్పుడు..శాసనసభ ఏపీ మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానం ఆమోదానికి దాదాపు ఆరు నెలల నుండి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఇక, శాసనసభలో మెజార్టీ ఉన్నప్పటికీ..మండలి రద్దు చేస్తూ తీర్మానం చేసినా.. తుది ఆమోదం వచ్చే వరకూ ఇప్పుడు అనుసరిస్తున్న ప్రక్రియనే కొనసాగించాల్సి ఉంటుంది. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున సంయుక్త సమావేశాల నిర్వహణ...గవర్నర్ ప్రసంగం మామూలుగానే ఉంటుంది. దీంతో ప్రభుత్వం తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదనే కారణం..అన్నింటీకీ అడ్డుపడుతున్నారనే ఆగ్రహంతో మండలి రద్దు చేసిందని..తుది నోటిఫికేషన్ వచ్చే వరకూ ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ తరువాత నుండి ఇక అధికార ..ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాయనేది కీలకంగా మారుతోంది.మండలిలో ఛైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. కానీ, ఇంకా కమిటీ ఏర్పాటు చేయలేదు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం సభ్యుల పేర్లు ఇవ్వాలని మండలి చైర్మన్ రాసిన లేఖలు ఈ రోజు పార్టీలకు చేరనున్నాయి. మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల నుండి సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీకి మూడు నెలల నుండి సాద్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు మండలి రద్దు తీర్మానం ఆమోదించటంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అవుతుందని..మూడు నెలల నుండి సాధ్యమైంత త్వరగా నివేదిక కమిటీ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో మండలి సమావేశాలు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు యధాతధ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో..బిల్లుల సైతం కమిటీ తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసి నివేదిక ఇవ్వటంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవని యనమల సైతం స్పష్టం చేస్తున్నారు.