కేరళలో తెలంగాణ అధికారుల పర్యటన

హైదరాబాద్ జనవరి 21 (way2newstv.com)
తెలంగాణ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ. విధానం రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల బృందం మంగళవారం కేరళలో పర్యటిస్తున్నది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తో కూడిన బృందం మంగళవారం తిరువనంతరపురంలో కేరళ ప్రభుత్వ ప్రవాస కేరళీయుల సంక్షేమ వ్యవహరాల శాఖ కార్యదర్శి ఇళంగోవన్, ‘నోర్కా రూట్స్’ సంస్థ సిఇవో హరికృష్ణ నంబూద్రితో సమావేశమయ్యారు. 
కేరళలో తెలంగాణ అధికారుల పర్యటన

వివిధ దేశాల్లో ఉండే కేరళీయుల సంక్షేమం కోసం అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, దీనికోసం అవలంభిస్తున్న విధానంపై విస్తృతంగా చర్చించారు. అక్కడి విధాన పత్రాలను అధ్యయనం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి విద్య, ఉపాధి,ఇతర అవసరాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళుతున్నారు. అక్కడ వారు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు ఓ సమగ్ర విధానాన్ని రూపొందించాలని నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే ఎన్.ఆర్.ఐ. పాలసీలు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర అధికారుల బృందం కేరళలో పర్యటిస్తున్నది.
Previous Post Next Post