మాఫియా స్థాయికి నీటి వ్యాపారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మాఫియా స్థాయికి నీటి వ్యాపారం

తిరుపతి, జనవరి 7, (way2newstv.com)
చిత్తూరు జిల్లాలో నీళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. కలుషిత నీటిని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. ఎటువంటి అనుతులు లేకుండానే పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంటులను ఏర్పాటు చేస్తూ.. మినరల్ వాటర్ పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ నీళ్ల వ్యాపారం మాఫియా స్థాయికి చేరింది. చిత్తూరు జిల్లాలో నిరుద్యోగులు కనిపిస్తే సన్నిహితులు ఇచ్చే సలహా ఒక్కటే. నీకు పనిలేదా.. చేతిలో లక్ష రూపాయలు ఉన్నాయా? అయితే ఓ మినరల్ వాటర్ ప్లాంటు పెట్టు.. లక్షలు సంపాదివచ్చు. ఈ మాటలు వింటే మీకే అర్థం అవుతుంది. జిల్లాలో తాగునీటికి ఉన్న డిమాండ్ ఎలాంటిదో.. తాగేందుకు నీళ్లు దొరక్క ప్రభుత్వం అందించే వాటర్ ట్యాంకుల వద్ద ప్రజలు రోజూ యుద్దాలు చేసుకుంటుంటారు. అందులోనూ జిల్లా వ్యాప్తంగా ఫ్లోరైడ్ శాతం ఎక్కువుగా ఉంది. 
మాఫియా స్థాయికి నీటి వ్యాపారం

ప్రభుత్వం సరఫరా చేస్తున్న రక్షిత మంచినీటి పథకాలు ఉన్నప్పటికీ అవి పరిశుభ్రమైన తాగు నీటిని అందించలేక పోతున్నాయి.  ఇదే అదనుగా భావించి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి మినరల్ వాటర్ ప్లాంట్లు. ప్యూరిఫైడ్ వాటర్ పేరుతో నీటి వ్యాపారం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ఏటా నకిలీ వాటర్ ప్యాకేజీ కంపెనీలు 150కోట్ల నుండి 200 కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేస్తూ ప్రజలను దోచేస్తున్నాయి. నకిలీ వాటర్ కంపెనీలు కలుషిత నీటిని అమ్ముతూ కొట్లలో టర్నోవర్ చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 1100లకు పైగా మంచినీటి ప్లాంట్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో స్థానిక పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పోరేషన్ అనుమతి పొందినవి కేవలం వందలోపే ఉంటాయి. అయితే మిగతావన్నీ ఇక్కడ చేస్తున్నవి అక్రమ నీటి వ్యాపారమే. కేంద్ర ప్రభుత్వ ఆహార మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం జిల్లాలో 90 శాతం ప్యాకేజీ వాటర్ కంపెనీలు నడవడం లేదు. లైసెన్స్ లేకుండానే విచ్చలవిడిగా నాసిరకం, కలుషితమైన నీటితో వ్యాపారం చేస్తున్నాయి. ఒక్క తిరుపతిలోనే ఐఎస్ఐ ముద్రలేని వాటర్ ప్లాంట్లు 100కిపైగానే ఉన్నాయి. ఇళ్లల్లో నడుస్తున్న చిన్నా చితకా అనధికారిక కంపెనీలు నాలుగు వందలకు పైగా ఉన్నాయి.  మదనపల్లెలో 60, చిత్తూరులో 100కి పైగా ఇలాంటి బోగస్ వాటర్ ప్యాకేజీ కంపెనీలు ఉన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా వందల్లోనే బోగస్ వాటర్ ప్లాంట్లు వెలసి ఉన్నాయి. శివారు ప్రాంతంలో స్థలం లీజుకు తీసుకొని బోరు వేయడం, ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ ప్లాంటు అనధికారికంగా ప్రారంభించేయడం జిల్లాలో సర్వసాధారణంగా మారింది. సాధారణంగా వాటర్ ప్లాంటు నడిపేవారు కొన్ని ప్రమాణాలు పాటించాలి. ప్రతి ప్లాంటుకు ఐఎస్ఐ గుర్తింపు ఉండాలి. వాటర్ టిస్టెంట్ స్టాండర్స్ బ్యూరో నుంచి త్రైమాసిక ధ్రువీకరణ పత్రం ఉండాలి. క్వాలిపైడ్ టెక్నీషియన్ విధిగా అందుబాటులో ఉండాలి. రోజూ క్యాన్లను వేడినీళ్లలో శుభ్రపరచిన తరువాతే నీళ్లను నింపాలి. పురపాలక, పంచాయితీల నుంచి ఎన్ఓసీ తప్పనిసరిగా ఉండాలి. మైక్రో బయాలజీ, బయోకెమికల్ కల్చరల్ పరీక్షలు నిత్యం నిర్వహించాలి. సిబ్బందికి ఆరు నెలలకొకసారి వైద్య పరీక్షలు చేయించాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా గుర్తింపు పొంది ఉండాలి. ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ లేబుల్ పై ఐఎస్ఐ మార్కు, వాటర్ ప్యాకేజీ చేసిన తేదీ, గడువు తీరే తేదీ ముద్రించాలి. ఒక వాటర్ ప్యాకెట్ ను లేదా బాటిళ్ మూడు రోజుల్లోనే విక్రయించాలి. కానీ ఇలాంటి నిబంధనలు ఏమాత్రం పట్టించు కోకుండానే యథేచ్ఛగా నీటి వ్యాపారం కొనసాగిస్తున్నారు. వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసే పరికరాలు చూస్తే చాలా ఆశ్చర్య మనిపిస్తుంది. కేవలం చిన్నపాటి రూమ్ లో పంచాయితీ, మున్సిపల్ కొళాయిలకు నేరుగా వాటర్ ట్రీట్ మెంట్ పరికరాలు బిగించి రెండు ట్యాంకులు ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటిని శుభ్రపరుస్తూ వాటర్ బిజినెస్ చేసుకుంటున్నారు. పరిశుభ్రమైన తాగునీరు పేరుతో బోరుబావుల దగ్గర నీటిని క్యాన్లలో పట్టుకొచ్చి ప్యూరిఫైడ్ వాటర్ పేరుతో అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ట్యాంకులలోకి నీటిని తీసుకొని మినరల్ వాటర్ పేరుతో అమ్ముతున్నారు. 20లీటర్ల నీటికి 15రూపాయల నుంచి 20రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలో రోజుకు 50లక్షల రూపాయలకు పైగా నీటి వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. అంటే నెలకు 15 కోట్లకు పైమాటే. ఇలా రక్షిత మంచినీటి పేరుతో జనాన్ని మోసం చేస్తూ కోట్ల రూపాయలు దండుకొంటున్నారు. సాధారణంగా ఏ నీరైనా ఎంతోకొంత కలుషితమై ఉంటుంది. అయితే తాగే నీటి విషయంలో పిహెచ్ విలువ 6.5నుంచి 8.5వరకు ఉంటే వాటిని శుభ్రమైన నీటిగా గుర్తిస్తారు. అంతకు తక్కువ, ఎక్కువ ఉన్ననీరు తాగకూడదు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వాటర్ ప్లాంట్లు వినియోగానికి ఉపయోగిస్తున్న పరికరాలు ఏ ఒక్కటీ ఐఎస్ఐ మార్కు ఉన్నవి కాదు. రైళ్లు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి విష్ణునివాసం, శ్రీనివాసం వంటి యాత్రికుల సముదాయాల వద్ద నాసిరకం, కలుషిత ప్యాకేజీ వాటర్ ను విరివిగా అమ్ముతున్నారు.  ఐఎస్ఐ ముద్ర ఉన్న కంపెనీ బాటిల్స్ లీటర్ 20రూపాయలకు అమ్ముతుంటే.. ఎలాంటి నాణ్యత లేని, ప్రమాణాలు పాటించని కంపెనీల వాటర్ బాటిల్స్ ను 20రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. ఆయా మున్సిపల్ కమీషనర్లు, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. నీటిని ఎలాంటి ప్రోసెసింగ్ చేయకుండానే నేరుగా తయారైన వాటర్ బాటిల్స్ పై అధిక మొత్తంలో మార్జిన్ ఇస్తున్నారు. దీంతో దుకాణ దారులు కూడా నాసిరకం నీటి ఉత్పత్తులపైనే ఆసక్తి చూపుతున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేసి చేతులు దులుపుకుంటున్నారు. తర్వాత యధావిధిగా వ్యవహారం కొనసాగుతోంది. ఇందులో అధికారులకు వాటాలు ముట్టుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాణాలు పాటించకుండా తయారైన నీటిని తాగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయని వైద్యలంటున్నారు. జీర్ణ వ్యవస్థ దెబ్బతిని ఆహార నాళంపై పొక్కులు ఏర్పడుతాయంటున్నారు. తక్కువ పీహెచ్ ఉన్న నీటిని తాగితే.. రక్తపోటు పై ప్రభావం చూపుతుందని, ప్లోరైడ్ అవశేషాలు ఉన్నట్లైతే జట్టు, నాడీమండలం, కంటిచూపుపై ప్రభావం చూపే అవకాశముంటుందని డాక్టర్లు చెబుతున్నారు.