కర్నూలు, జనవరి 23, (way2newstv.com)
రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్‌ల ఎన్నికకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్‌లు కూడా ఖరారవుతున్నాయి. మహిళలకు 50 శాతం సీట్లను రిజర్వ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీ చైర్మన్‌లు, చైర్‌పర్సన్‌ల బరిలో కీలక నేతలు నిలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కర్నూలు విషయాన్ని తీసుకుంటే.. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, కొందరు ఆశావహులకు టికెట్లు లభించలేదు. దీంతో వీరు ఇప్పుడు జెడ్పీ బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కర్నూలు జెడ్పీ చైర్మన్ ఓసీ మహిళలకు రిజర్వ్ కావడంతో పలువురు కీలక నేతలు తమ సతీమణులను రంగంలోకి దించుతున్నారు.
ఈ లిస్టు ప్రకారం చూస్తే ఈ కింది ఆశావాహులు చైర్మన్ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు.ఎస్వీ విజయమనోహరి: కర్నూలు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ఎస్వీమోహన్‌రెడ్డి సతీమణి. 2014లో కర్నూలు నుంచి వైసీపీ టికెట్‌పై విజయం సాధించిన మోహన్‌రెడ్డి.. తర్వాత అనూహ్యంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, గత ఏడాది ఎన్ని కల్లో తనకు టికెట్ రాకపోయే సరికి అలిగి మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోయారు. అయితే, అప్పటికే ఈ టికెట్ వేరేవారికి కేటాయించారు. దీంతో ఆయన ఆశ పెట్టుకున్నా టికెట్‌లభించలేదు. దీంతో ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల్లో తన సతీమణి విజయమనోహరిని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. చాగలమర్రి లేదా ఉయ్యాలవాడల్లో ఏది జనరల్‌కు కేటాయిస్తే అక్కడ నుంచి ఆమె పోటీకి రెడీ అవుతున్నారు. తన భార్యకే జెడ్పీ చైర్‌పర్సన్ పోస్టు ఇప్పించుకునేందుకు ఎస్వీ మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.కోట్ల సుజాతమ్మ: రాజకీయ దురంధరుడు దివంగత కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణిగా సుజాతమ్మ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. తర్వాత రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ హవా తగ్గిపోవడంతో వీరు టీడీపీలోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీ టికెట్ పైనా, సుజాతమ్మ ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు సుజాతమ్మ జెడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. కోడుమూరు లేదంటే పత్తికొండ నుంచి పోటీ చెయ్యాలని సుజాతమ్మ భావిస్తున్నట్టు తెలుస్తోంది.వీరిద్దరితోపాటు జిల్లాలో కీలక నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ కూడా జెడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అలాగే బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి కూడా జడ్పీ బరిలో నిలవాలని అనుకుంటున్నట్టు సమాచారం. జిల్లాలో నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో బైరెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టు ఉంది. దీంతో కర్నూలు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరి వీరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందో చూడాలి.