విజయవాడ, జనవరి 2, (way2newstv.com)
ఏపీ రాజధాని విషయంలో చర్చ ఇపుడు తీవ్ర స్థాయిలో సాగుతోంది. ఏ ఇద్దరు కలసినా అమరావతిలో రాజధాని ఉంటుందా పోతుందా అన్నదే మాట. అలాగే మూడు రాజధానుల విషయంలోనూ ఏపీ జనాలు బాగానే స్పందిస్తున్నారు. పైగా ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృధ్ధి చేయాల్సి ఉండడం, మరో వైపు నిధులు లేకపోవడం, అమరావతిలో రాజధాని నిర్మాణం లక్ష కోట్ల రూపాయలు పైబడి ఉండడం ఇవన్నీ కూడా జనంలో బాగానే చర్చకు వస్తున్నాయి. నిజానికి ఈ రకమైన చర్చ బాగా జరగాలనే జగన్ కోరుకుంటున్నారుట. అందుకే ఆయన రాజధాని విషయంలో తొందర వద్దు అంటున్నారు.ఓ విధంగా రాజధాని గొడవ కాస్తా ముదిరితే అది అంతిమంగా టీడీపీక నష్టం చేకూరుస్తుందని అంటున్నారు. ఎందుకంటే వికీంద్రీకరణ, మూడు రాజధానులు జగన్ సర్కార్ ప్లాన్.
రాజధాని కధను పెంచేందుకు వ్యూహాలు
మరి దాన్ని ఎంతలా వ్యతిరేకిస్తే అంతలా టీడీపీకి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ ఉత్తరాంధ్రతో పాటు, రాయలసీమ జిల్లాలకు న్యాయం చేస్తామని అంటున్నారు. కాదు, ఒక్క అమరావతిలోనే అన్నీ ఉండాలని చంద్రబాబు అంటున్నారు. ఈ భిన్న వాదనలు జనం ముందు ఇపుడు ఉన్నాయి. మరి బాబు అండ్ కో ఇలా మొండిగా వాదిస్తే అంతిమంగా టీడీపీ రెండు ప్రాంతాల్లో బాగా వ్యతిరేకత మూటకట్టుకోవాల్సివుంటుందని అంటున్నారు.జగన్ హై పవర్ కమిటీని నియమించింది రాజదాని కధను మరింతగా సాగదీయడం వెనక కూడా టీడీపీ రంగులన్నీ జనం ముందు ఉంచడానికేనని అంటున్నారు. అంతటితో ఆగకుండా జగన్ ఈ విషయంలో అఖిలపక్షం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారుట. బాబు మాదిరిగా తాను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా అన్ని పార్టీల అధినేతలను పిలిచి వారి ముందే అన్నీ ఉంచబోతున్నారుట. వారి ముందే బాబు సర్కార్ అమరావతి రాజధాని విషయంలో చేసిన బండారం బయట పెట్టడం ద్వారా టీడీపీని మరింత ఒంటరిని చేయాలన్నది జగన్ వ్యూహంగా ఉంది.మరో వైపు అసెంబ్లీ సమావేశాల్లోనే రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని జగన్ అనుకుంటున్నారుట. అక్కడ నుంచి ఏపీలోని పదమూడు జిల్లాల ప్రజలకు తాను ఏమనుకుంటున్నదీ ఒక సందేశంగా జగన్ వినిపిస్తారని అంటున్నారు. భావి తరాల కోసం తమ ప్రభుత్వం ఏం చేయబోతోంది కూడా పూర్తిగా వివరిస్తారని అంటున్నారు. అక్కడ కూడా టీడీపీ డొల్లతనాన్ని ఎండగట్టడం ద్వారా జనం ముందు దోషిని చేయాలన్నది జగన్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు. అందుకే జనంలో రాజధాని అంశం బాగా నలగాలని జగన్ కోరుకుంటున్నారు. అన్ని విషయాలు వారికి అర్ధమైన తరువాత తన అభిప్రాయం, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం పూర్తిగా అర్ధమవుతాయని జగన్ భావిస్తున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అమరావతి తరలింపుతో పాటే రాజకీయ తెరపై టీడీపీ తరలింపు కూడా జగన్ అజెండాలో ఉందని అంటున్నారు. చూడాలి జగన్ వ్యూహాలకు బాబు ప్రతివ్యూహాలు ఎలా రచిస్తారో.