ఖరీఫ్ కు దారేది... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఖరీఫ్ కు దారేది...

హైద్రాబాద్, జూలై 2, (way2newstv.com)
ఓవైపు వర్షాకాలం మొదలైంది.. మరోవైపు రైతన్న సాగుకు సన్నద్ధమవుతన్నారు.. కానీ పెట్టుబడికి చేతినిండా పైసల్లేక అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరాకు రూ.4వేలు అందించింది. పెట్టుబడి కింద ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ముతో చదును చేయించి దుక్కుల్ని సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఇంతవరకు బాగానే సాగింది. ఇగ ఇక్కడ్నుంచే ఖరీఫ్ సీజన్ ముందుకు సాగుతలేదు. చాలా తక్కువమంది పెట్టుబడి సొమ్ముతోనే అరకొరగా విత్తనాలు తెచ్చి పెట్టుకున్నరు.రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత సమయానికి 36.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం 24.62 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. 
 
 
 
ఖరీఫ్ కు దారేది...
 
అంటే 11.62 లక్షల ఎకరాల్లో పంట సాగు కాలేదన్నమాట. ఎనిమిది జిల్లాలో పదిశాతం పంటల సాగు నమోదు కాలేదు. ఇదిలావుంటే.. ఇప్పటివరకు సాగు చేసిన పంటల విస్తీర్ణంలో పత్తి పంట 14.30 లక్షల ఎకరాలు, 2.95లక్షల ఎకరాల్లో కందులు, 1.98 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.61 లక్షల ఎకరాల్లో సోయాబీన్, 1.29 లక్షల ఎకరాల్లో వరిపంట, 37 వేల ఎకరాల్లో జొన్న పంట సాగయ్యింది. అధికశాతం మంది రైతులకు భూమిని చదును చేయించేందుకే ఆ సొమ్ము సరిపోయింది. దీంతో విత్తనాలు ఎట్లా పెట్టాలో.. ఎరువులు, పురుగుమందులు ఎట్లా కొనుగోలు చేయాలో తెలియక సతమతమవుతున్నడు. వాస్తవంగా ప్రతీ సంవత్సరం పరిస్థితి దాదాపు ఇలానే ఉండేది. దీంతో బ్యాంకులను పంట రుణం కోసం ఆశ్రయించేవారు. బ్యాంకు రుణం దొరకని రైతులు.. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుజేసేవారు. కానీ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు పంట పెట్టుబడి కింద ఎకరాకు రూ.4వేలు అందజేయడంతో బ్యాంకులు రైతులకు రుణాలిచ్చేందుకు విముఖత చూపుతున్నాయి. వానాకాలం మొదలైనా.. ఇంతవరకు ఏ ఒక్కరికీ బ్యాంకులు పూర్తిస్థాయిలో రుణాలిచ్చిన దాఖాలాల్లేవు. ఇగ తప్పనిపరిస్థితుల్లో ప్రతీ సంవత్సరం మాదిరిగానే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రైతులు అప్పుజేసి.. సాగు పనులు మొదలుబెడ్తున్నరు. రుణాలకు సంబంధించి ఏటా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జూన్‌కు ముందే జరగాల్సి ఉంటుంది. కానీ వివిధ కారణాల రీత్యా జూన్ 28న ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ పంట రుణాలతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు బ్యాంకులు అందజేసే రుణాల లక్ష్యాలను ప్రకటించారు. ఇదిలావుంటే.. మరో రెండు వారాల్లో పత్తి పంటలకు బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగియనుంది. అయితే పంట రుణాలు నత్తనడకన సాగుతుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే.. కేవలం రెండు వారాల్లో 47 లక్షల మంది రైతులు రుణాలివ్వడం కష్టతరమే. బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలోనే రైతుల నుంచి కొంత నగదును తీసుకుని పంటలకు బీమాను చెల్లిస్తాయి. ఈ క్రమంలో పంట రుణాలు ఇవ్వడం ఆలస్యమైతే.. పత్తి పంటకు బీమా ప్రీమియం గడువు తీరనుంది. ఫలితంగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.తెలంగాణ రాష్ట్రంలో గతేడాది (2017-18)కి సంబంధించి బ్యాంకులు కేవలం 65 శాతం రుణాలు మాత్రమే ఇచ్చాయి. గతేడాది ఖరీఫ్  పంట రుణాల లక్ష్యం రూ.23,851 కోట్లు కాగా బ్యాంకులు రూ.21,025(88.15 శాతం)కోట్లు మాత్రమే ఇచ్చాయి. యాసంగి సీజన్‌కొచ్చేసరికి పంట రుణాల లక్ష్యం రూ.15,901 కోట్లు కాగా, బ్యాంకులు కేవలం రూ.10,384(65 శాతం) కోట్లు మాత్రమే ఇచ్చాయి. ఇదిలావుంటే.. వీటిలో చాలావరకు బ్యాంకులు రైతులకు నేరుగా రుణాలను ఇవ్వలేదు. కేవలం ఖాతా బుక్కుల్లో అడ్జస్ట్‌మెంట్ మాత్రమే చేసినట్టు సమాచారం. 2018-19 సంవత్సరానికి సంబంధించి 47,65,683 మందికి రూ.42,494 కోట్లను పంట రుణాల కోసం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి చాలామంది రైతులు బ్యాంకుల్లో రుణాలు దొరక్క.. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరీ బ్యాంకులు ఏమేరకు రైతులకు రుణాలు అందిస్తాయనేది వేచిచూడాల్సిన అంశమే.రైతులు బ్యాంకుల్లో రుణాలు పొందాలంటే.. పహాణీలు తప్పనిసరి. కానీ ప్రస్తుతం పహాణీలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆన్‌లైన్‌లో పహాణీల సమాచారం అందుబాటులో ఉండగా, ప్రస్తుతం భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా అధికార యంత్రాంగం దాన్ని నిలిపేసింది. వెబ్‌సైట్ ద్వారా ఇచ్చిన సమాచారంలో తప్పులు దొర్లడంతో వాటిని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ ధ్రువీకరించిన పహాణీని బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. కానీ సమాచార లోపంతో తహసీల్దార్లు కూడా పహాణీలను జారీ చేయడం లేదు. ఫలితంగా బ్యాంకులో రుణం కోసం రైతులు రోజుల తరబడి వ్యవసాయ పనులు మానుకుని.. అధికారుల చుట్టూ ప్రద క్షిణలు చేస్తున్నారు.