ఖరీఫ్ కు ప్రాణం పోసిన వర్షాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఖరీఫ్ కు ప్రాణం పోసిన వర్షాలు

ఖమ్మం, జూలై 9,(way2newstv.com)
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వానలతో ఎండిపోయే దశకు చేరుకుంటున్న విత్తన మొలకకు ఈ వర్షం ప్రాణం పోసినట్లైంది. దీంతో అన్నదాతలో ఆనందం కనిపిస్తోంది. ములకలపల్లి మండలంలో ప్రవహిస్తున్న ముర్రేడు, పాములేరు వాగుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. గుండాల, ఇల్లెందు, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం, ములకలపల్లి మండలాల్లో ఓ మోస్తారు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంచి వర్షం కురవడంతో పత్తి, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలు, వరి సాగు చేస్తున్న రైతులకు ఊరటనిచ్చింది. సాధారణ వర్షం కంటే ఎక్కువ పడినట్లుగా అనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పడిన చోట్లలో భారీ వర్షాలు పడటం, పడని చోట్ల నామమాత్రం కంటే తక్కువగా ఉండడం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 మండలాల్లో ఎక్కువగా, నాలుగు మండలాల్లో సాధారణ, మూడు మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో 10 మండలాల్లో ఎక్కువ వర్షపాతం, తొమ్మిది మండలాల్లో సాధారణ, ఒకచోట లోటు వర్షపాతం నమోదైంది.
 
 
 
ఖరీఫ్ కు ప్రాణం పోసిన వర్షాలు
 
నాలుగు రోజుల నుంచి సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఉభయ జిల్లాల్లో విస్తరించిన ఉపరితల గనుల్లో  55వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం నుంచే వర్షం ఉండడంతో కార్మికులు విధుల్లోకి వెళ్లలేదు. రెండోషిప్టులో కార్మికులను దింపేందుకు యాజమాన్యాలు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. చిరుజల్లులు కురుస్తూనే ఉండడంతో ఉపరితల గనుల్లో రోడ్లన్నీ బురదమయమయ్యాయి. ఫలితంగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిపివేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 20 వేల టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో 10 వేల టన్నులు, మణుగూరు ఏరియాలో 15 వేల టన్నులు, ఇల్లెందు ఏరియాలో 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాత్రికి వర్షం నిలిచిపోయిన పక్షంలో ఆదివారం ఉదయం నుంచి ఉపరితలగనుల్లో బొగ్గు ఉత్పత్తి తిరిగి ప్రారంభంకానుంది. జిల్లావ్యాప్తంగా 125.0 ఎంఎంల వర్షపాతం నమోదు చేసుకుంది. కల్లూరు, ఖమ్మం అర్బన్‌, వైరా మండలాల్లో భారీ వర్షం కురిసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పోల్చుకుంటే ఖమ్మం జిల్లాలో వర్షం తక్కువగా పడింది. ఖమ్మం జిల్లా సరాసరి వర్షపాతం 6.3 ఎంఎంలు కాగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా సరాసరి వర్షపాతం 17.6 ఎంఎంలు కావడం విశేషం.