పర్యావరణ పరిరక్షణే..పండుగ పరమార్ధం.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పర్యావరణ పరిరక్షణే..పండుగ పరమార్ధం..

జగిత్యాల, ఆగస్ట్ 10, 2018 (way2newstv.com)
వినాయక చవితి..భారత్‌ అతిపెద్ద పండుగల్లో ఒకటి. తెలంగాణలో ఈ పండుగను అట్టహాసంగా జరుపుకుంటారు. గణపయ్య భారీ విగ్రహాలు ప్రతిష్టించి పూజాధికాలు నిర్వహిస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ప్రజలు ప్రతిష్టించే విగ్రహాల్లో ఎక్కువగా పర్యావరణానికి హానికారక పదార్ధాలు ఉంటున్నాయి. దీంతో మట్టితో తయారైన వినాయకుడి ప్రతిమలనే పూజించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. వారి సూచనలకు తగ్గట్లే మట్టి గణపయ్యలకు డిమాండ్ పెరుగుతోంది. ఇక సెప్టెంబర్‌లో వచ్చే ఈ వేడుక కోసం విగ్రహాల తయారీకి పలువురు సిద్ధమవుతున్నారు. జగిత్యాల జిల్లాలోనూ వినాయక ప్రతిమల తయారీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. విగ్రహాల్లో వివిధ రంగుల వాడకం హానికరమని పర్యావరణవేత్తలు అంటున్నారు. సహజ రంగులే వాడాలని సూచిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా గణపతి విగ్రహాలకు కొన్ని రోజుల పాటూ పూజాదికాలు నిర్వహించి అనంతరం వీటిని జలవనరుల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ విగ్రహాలకు అనేక రకాల కృత్రిమ రంగులను వాడుతున్నారు. విగ్రహాలు తీర్చిదిద్దడానికి వాడే రంగుల్లో పాదరసం, సీసం వంటి లోహ మూలికాలు ఉంటాయి. దీనితో పాటు ఆమ్లము, ఇతర సేంద్రియ పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ నీటిలో కలిసినప్పుడు కాలుష్యాన్ని పెంచుతున్నాయని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అందుకే ఈ సమస్యలేవీ ఉండని మట్టి గణపతులను పూజించాలని అంటున్నారు.
 
 
 
పర్యావరణ పరిరక్షణే..పండుగ పరమార్ధం..
 
పర్యావరణ కాలుష్య ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవడం లేదు. దీంతో సాగు, తాగు నీటి ఇబ్బందులు ఎర్పడుతున్నాయి. వానలు కురవక, వరదలు రాకపోవడంతో జలాశయాలన్నీ అడుగంటుతున్నాయి. కనీసం గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సైతం కాల్వలలో నీరు లేకుండా పోయింది. ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతీఒక్కరూ కృషిచేయాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్‌ ఆఫ్‌ ఫ్యారిస్‌తో చేసి, కృత్రిమ రంగులతో అలంకరించిన వినాయక విగ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాలు అధికం. కనుక యువత కాలుష్యరహిత మట్టి వినాయకుడి విగ్రహాలు ఏర్పా టు చేయాలి. ఇది సామాజిక బాధ్యతగా వారు గుర్తెరగాలి.  ఇదిలాఉంటే విగ్రహాలకు వేసిన పెయింట్‌ ఎండే సమయంలో విడుదలైన సేంద్రియ వాయువులు గాలిలోని నత్రజని, ఆక్సిజన్‌లతో కలసి ‘ఓజోన్‌’ అనే వాయువు ఏర్పడుతుంది. ఇది కొంత మోతాదులో ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. పెయింట్లలో రంగుల కోసం వాడే ఘన కణాలలో సాధారణంగా కాడ్మియం లేదా టైటాయంలతో కూడిన పదార్థాలు ఉంటాయి. ఇవి విషపూరితమైనవి. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. అందుకే సమస్యలేవీ ఉండని మట్టి గణపతులనే పలువురు ప్రిఫర్ చేస్తున్నారు.