హస్తకళలు-చేనేత వృత్తుల విశిష్టత ఫై 5న సదస్సు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హస్తకళలు-చేనేత వృత్తుల విశిష్టత ఫై 5న సదస్సు

అమరావతి  (way2newstv.com) 
ఆంధ్ర ప్రదేశ్  హస్తకళలు, చేనేత  వృత్తులకు  నెలవు. మన రాష్ట్రంలో  ఉన్నన్ని కళలు, చేనేత ఉత్పత్తులు  మరే రాష్ట్రంలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. చేనేత, హస్తకళలు మన సాం స్కృతిక సంపద. సాంప్రదాయ బద్ధంగా  వస్తున్న ఈ  సాంస్కృతిక సంపదకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దేశీయ కళలను పర్యాటకులకు దగ్గర చేసే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది.తమ విపణులను పర్యాటక ఆకర్షణ భరితంగా ఏలా తీర్చిదిద్దుకోవాలి, పర్యాటకులతో ఏలా మాట్లాడాలి, తమ ఉత్పత్తుల గొప్పదనాన్ని వారికి ఏలా వివరించాలి వంటి అంశాలపై చేతి వృత్తిదారులకు ప్రత్యేక అవగాహన కల్పించటమే ధ్యేయంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.హస్తకళలు-చేనేత వృత్తుల విశిష్టత ఫై 5న సదస్సు 

 ఈ క్రమంలో తొలుత  విజయవాడ వేదికగా ఒక కార్యశాల నిర్వహించనున్నారు.  ఇదే తరహా సదస్సులు విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం ప్రాంతాలలోనూ జరగనున్నాయి. ఆదివారం నగరంలోని మినర్వాగ్రాండ్ వేదికగా ఉదయం పది గంటలకు జరిగే తొలి కార్యక్రమంలో  పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్షు శుక్లా స్వయంగా పాల్గొననున్నారు. ఈ నేపధ్యంలో మీనా మాట్లాడుతూ అధ్బుతమైన పనితీరుతో అంతర్జాతీయ స్ధాయి నిపుణతను ప్రదర్శిస్తున్న మన కళాకారులు తమ ఉత్పత్తుల విక్రయంలో కొత్తదనాన్ని చూపలేకపోతున్నారన్నారు. ప్రధానంగా పర్యాటకులకు తమ చేతి వృత్తులను చరిత్రను వివరిస్తూ ఇతర ఉత్పత్తుల కంటే ఇక్కడి ఉత్పత్తులు ఏలా ప్రత్యేకమైనవన్నది చెప్పగలగాలని, ఈ విషయంపైనే మన కళాకారులకు అవగాహన కల్పించనున్నామని వివరించారు. పర్యాటకులను ఆకర్షించడం మొదలు, చేనేత వృత్తికి సంబంధించిన మెళుకువలు, నాణ్యత, నైపుణ్యం, తయారీ తదితర విలువైన సమాచారాన్ని పరస్పరం బదలాయించుకునేలా సదస్సు తోడ్పడుతుందన్నారు. వృత్తిని, వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే దిశగా చేతి వృత్తి దారులను తీసుకు వెళ్లాలనేదే పర్యాటక  శాఖ  ముఖ్య ఉద్దేశ్యమని మీనా పేర్కొన్నారు.  సరికొత్త డిజైన్లు రూపకల్పన  చేసి వాటిని వృత్తిపరమైన నైపుణ్యత కలిగిన డిజైనర్ల ద్వారా మార్కెటింగ్ చేయడం వంటి వినూత్న కార్యక్రమాలు రూపొందించి చేనేత పరిశ్రమలను, చేతి వృత్తుల వారిని అభివృద్ధి పథంలో నడిపించడానికి పర్యాటక శాఖ కార్యాచరణ రూపొందించిందన్నారు. పర్యాటక శాఖ ముఖ్యంగా పర్యాటకులు, ఈ హస్తకళలు చేనేత ఉత్పత్తి దారులకు మధ్య ప్రచార మాధ్యమంలా పనిచేయ సంకల్పించిందన్నారు.ఆంధ్ర ప్రదేశ్ ను సందర్శించడానికి వచ్చిన పర్యాటకులకు అయా ప్రాంతాల అంగడిలలో లభించే  విభిన్న రకాల  ఉత్పత్తులు, వెరైటీలు, రాయితీల సమాచారాన్ని పర్యాటకులకు అందచేసే బాధ్యత పర్యాటక శాఖ తీసుకుంటుదని, ఇచ్చిన సమాచారానికి అనుగుణంగా వ్యాపార నిర్వహణ ఉండేలా చూసుకోవలసిన బాధ్యతను తమ సదస్సు ద్వారా వివరిస్తామని ముఖేష్ కుమార్ మీనా వివరించారు.  మన సాంస్కృతిక సంపద అయిన హస్తకళలు, చేనేత వృత్తులు మరుగున పడిపోతుండగా,  కనీసం ఆదరణ లభిస్తున్న కొన్ని కళలకైనా మనం జీవం పోసి హస్తకళలు, చేనేత వృత్తుల ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం స్థిర పరచాలనే  సంకల్పంలో భాగంగా పర్యాటక శాఖ ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్షు శుక్లా వివరించారు.