రహస్య సొరంగాల్లో బాలికలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రహస్య సొరంగాల్లో బాలికలు

నల్గొండ  (way2newstv.com)
యాదరిగుట్టలో వ్యభిచార కార్యకలాపాల ఉదంతాలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. సోమవారం రాచకొండ కమిషనరేట్ పోలీసుల దాడిలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అభంశుభం తెలియని చిన్నారులను కొనుగోలు చేసి యుక్త వయసు రాగానే వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారనే చేదు నిజం తెలిసి బాహ్య ప్రపంచం నివ్వెరపోయింది. వ్యభిచార రొంపితో నిండిపోయిన యాదాద్రి ప్రక్షాళనలో భాగంగా పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. రెండు రోజులుగా పలు గృహాల్లో దాడులు నిర్వహించి మొత్తం 11 మంది చిన్నారులను రక్షించారు. గురువారం తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో మరో నలుగురు బాలికలను గుర్తించారు. అయితే, ఇదే ఇంటిలో రెండు రోజుల కిందట కూడా తనిఖీలు చేపట్టినా ఎవరూ పట్టుబడలేదు.రహస్య సొరంగాల్లో బాలికలు

 కానీ, ఆ ఇంట్లో చిన్నారులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో మరోసారి దాడిచేసిన పోలీసులు బాలికలను దాచి ఉంచిన సొరంగం చూసి విస్తుపోయారు. గదిలోని మంచం కింద గోడను తొలుస్తూ మూడు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ సొరంగంలో బాలికలను గుర్తించారు. పోలీసులు సోదాలకు వస్తున్నారన్న సమాచారం తెలిస్తే, వారిని ఆ సొరంగంలోకి పంపిస్తారని ఓ అధికారి వెల్లడించారు. ఆరుగురు పట్టే వీలున్న ఈ సొరంగాన్ని బయటకు ఎంతమాత్రమూ అనుమానం రాని విధంగా నిర్మించి, అడ్డుగా మంచం ఉంచినట్టు ఆయన తెలిపారు. పాత నరసింహస్వామి ఆలయానికి వెళ్లే దారిలోని మరిన్ని ఇళ్లలో ఇదే తరహా నిర్మాణాలు ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తోన్న పోలీసులు, మరింత విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి 5 నుంచి 8 ఏళ్ల వయసున్న చిన్నారులను కిడ్నాప్ చేసిన ఓ ముఠా వారిని యాదగిరిగుట్టలో కొంత మందికి విక్రయిస్తారు. ఈ పిల్లలను కొనుగోలు చేసిన మహిళలు మొదట వారితో ఇంటి పని, ఆ తర్వాత వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో చిన్నారుల వ్యాపారం పదేళ్ల కిందటి నుంచే జరుగుతున్నట్లు తెలుస్తోంది. చిన్న వయసులో ఉన్న ఆడపిల్లల్ని తీసుకొచ్చి, చిత్రహింసలు పెట్టి వ్యభిచారానికి అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 14 ఏళ్లు రాగానే వారిని వ్యభిచారంలోకి దింపి సొమ్ము చేసుకుంటున్నారని, కొంత మందిని దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.