సిర్పూర్ మిల్లులో మంత్రి కేటీఆర్ పూజలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిర్పూర్ మిల్లులో మంత్రి కేటీఆర్ పూజలు

కుమ్రం భీం,(way2newstv.com)  
సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణపై నాలుగేళ్ల కార్మికుల నిరీక్షణకు నేడు తెరపడింది.. నాలుగేళ్ల క్రితం మూతపడిన సిర్పూర్ పేపర్ మిల్లును పునరుద్ధరించేందుకు మంత్రి కేటీఆర్  గురువారం కాగజ్ నగర్ లో పర్యటించి మిల్ లో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  మంత్రి ర్ మాట్లాడుతూ ఈ పేపర్ మిల్లుపై ఆధారపడిన కార్మికుల శ్రేయస్సు కోసమే  సిర్పూర్ పేపర్ మిల్లును పునః ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ పేపర్ మిల్లు మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. గత నాలుగేళ్ల నుంచి కార్మికులు అనేక కష్టాలు పడ్డారు. కార్మికుల బాధలను చూసిన ఎమ్మెల్యే కోనేరు కొనప్ప పేపర్ మిల్లును పునరుద్ధరణ చేయించేందుకు ఎంతో కృషి చేశారు. కోనేరు కొనప్ప కృషిని అందరూ అభినందించాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.

 


                                సిర్పూర్ మిల్లులో మంత్రి కేటీఆర్ పూజలు

  తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలు ప్రారంభిస్తున్నదని అన్నారు. ప్రభుత్వం పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు అయినా  ఇచ్చి తెరిపిస్తున్నదని తెలిపారు. కేసీఆర్ ను గద్దె దింపాలే అని కొందరు అంటున్నారు. ఎందుకు  అభివృద్ధి చేస్తున్నందుకా, పేదప్రజలకు మూడు పూటల అన్నం పెడుతున్నందుకా ... రైతు బంధుకు డబ్బులు  ఇచ్చి రైతులను అదుకున్నందుకా... అని ప్రశ్నించారు...  పేపర్ మిల్లు ఉద్యోగులకు దశల వారీగా అన్ని విధాల రాయితీలు అందిస్తామన్నారు. పరిశ్రమలను కాపాడుకునే బాధ్యత కార్మికులదే అని మంత్రి స్పష్టం చేశారు. కొత్త పరిశ్రమలను తెస్తున్నాం. మూతపడ్డ పరిశ్రమలను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ సంకల్పంతోనే పేపర్ మిల్లు పునరుద్ధరణ సాధ్యమైందన్నారు. ఏమి చేసైనా సరే మిల్లు తెరిపించాలని సీఎం ఆదేశించారని అన్నారు. మిల్లును టేకోవర్ చేసిన జేకే గ్రూప్కు రూ. 30 వేల కోట్ల టర్నోవర్ ఉందన్నారు. ఉపాధి కల్పన జరిపించేందుకు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తెలంగాణకు పరిశ్రమలు తెచ్చిన తర్వాత కొంతమంది కార్మిక నాయకులు,  తమ స్వార్థాల కోసం కార్మికుల్లో విబేధాలు సృష్టిస్తున్నారు. ఇలాంటి పనులు చేయవద్దని కార్మిక సంఘాలను కోరుతున్నానని కేటీఆర్ తెలిపారు. పేపర్ మిల్లు పునరుద్ధరణ కోసం యాజమాన్యానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంటింటికీ సురక్షిత మంచినీరును అందివ్వబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్న,  అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని శాసన సభ్యులు పాల్గొన్నారు.