న‌గ‌రంలోని క్లాక్‌ట‌వ‌ర్ల‌కు పున‌రువైభ‌వం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

న‌గ‌రంలోని క్లాక్‌ట‌వ‌ర్ల‌కు పున‌రువైభ‌వం

క్లాక్ ట‌వ‌ర్ల‌ను ప‌రిశీలించిన ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్‌*
హైదరాబాద్ ఫిబ్రవరి 13 (way2newstv.com):
 గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఉన్న చారిత్ర‌క క్లాక్‌ట‌వ‌ర్ల‌ను పున‌రుద్ద‌రించడం ద్వారా న‌గ‌ర చారిత్రక వైభ‌వానికి పున‌రువైభ‌వం తేవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో వందేళ్ల‌కు పైబ‌డ్డ 12 క్లాక్‌ట‌వ‌ర్లు ఉన్నాయి. ఈ క్లాక్ టవ‌ర్ల పున‌రుద్ద‌ర‌ణ‌లో భాగంగా ఇటీవ‌లే జీహెచ్ఎంసీ ద్వారా మ‌హ‌బూబ్ చౌక్‌, మోజంజాహీ మార్కెట్‌, సికింద్రాబాద్ క్లాక్‌ట‌వ‌ర్ల‌ను పున‌రుద్ద‌రించి న‌గ‌ర‌వాసులు స‌మ‌యాన్ని తెలుసుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. మిగిలిన 8 క్లాక్‌ట‌వ‌ర్‌జను కూడా పున‌రుద్ద‌రించ‌డానికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లు ప్ర‌స్తుత వాటి ప‌రిస్థితి త‌దిత‌ర అంశాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వ మున్సిప‌ల్ ప‌రిపాల‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్ నేడు వాటిని ప‌రిశీలించారు. 


 న‌గ‌రంలోని క్లాక్‌ట‌వ‌ర్ల‌కు పున‌రువైభ‌వం

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న 12 క్లాక్ ట‌వ‌ర్ల‌లో 9 హైద‌రాబాద్‌లో ఉండ‌గా మ‌రో మూడు సికింద్రాబాద్ ప‌రిధిలో ఉన్నాయి. వీటిలో మూడు మిన‌హా మిగిలిన 9 క్లాక్‌ట‌వ‌ర్ల‌ను తిరిగి ప‌నిచేసేలా త‌గు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి జీహెచ్ఎంసీ ఇంజ‌నీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారుల‌తో క‌లిసి ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్ నేడు శాలిబండ, సుల్తాన్‌బ‌జార్‌, మోండా మార్కెట్‌ల‌లోని పురాత‌న క్లాక్‌ట‌వ‌ర్ల‌ను ప‌రిశీలించారు. ఈ క్లాక్‌ట‌వ‌ర్ల‌కు సంబంధించి మ‌ర‌మ్మ‌తులు వెంట‌నే చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ముందుగా శాలిబండ‌లోని క్లాక్‌ట‌వ‌ర్‌ను అర్వింద్‌కుమార్‌ ప‌రిశీలించారు. ఈ క్లాక్‌ట‌వ‌ర్ పూర్తిగా శిథిలావ‌స్థ‌లో ఉండి గ‌డియారాలు కూడా పూర్తిగా చెడిపోయిన‌ట్టు గ‌మ‌నించి ఈ గ‌డియారాల‌ను వెంట‌నే మ‌ర‌మ్మ‌తులు చేసి వీటి నిర్వ‌హ‌ణ కాంట్రాక్ట్‌ను చేప‌ట్టాల‌ని జీహెచ్ఎంసీ అధికారుల‌ను ఆదేశించారు. అనంత‌రం సుల్తాన్ బ‌జార్ క్లాక్‌ట‌వ‌ర్‌ను సంద‌ర్శించ‌గా ఈ క్లాక్‌ట‌వ‌ర్ కూడా గ‌త కొన్నేళ్లుగా నిర్వ‌హ‌ణ లోపం వ‌ల్ల పూర్తిగా శిథిలావ‌స్థ‌లోకి చేరుకోవ‌డంతో పాటు క్లాక్‌ట‌వ‌ర్  ప్ర‌ధాన ర‌హ‌దారి వైపు ముందుభాగం ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన‌ట్టు ముఖ్య కార్య‌ద‌ర్శి గ‌మ‌నించారు. ఈ క్లాక్‌ట‌వ‌ర్‌ను పున‌రుద్ద‌రించ‌డంతో పాటు మ‌ర‌మ్మ‌తులు జ‌రిపి చుట్టూ ప్ర‌హ‌రీగోడ నిర్మించేందుకు పున‌రుద్ద‌ర‌ణ ప్ర‌ణాళిక‌ రూపొందించి వెంట‌నే ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు. చుట్టూ ఉన్న వృక్షాల కొమ్మ‌ల‌ను తొల‌గించి క్లాక్‌ట‌వ‌ర్ అందిరికీ క‌నిపించేలా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. సుల్తాన్ బ‌జార్ ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఉన్న ఓల్డ్‌ అసెంబ్లీ హాల్‌కు మ‌ర‌మ్మ‌తులు నిర్వ‌హించాల‌ని సూచించారు. అనంత‌రం మోండా మార్కెట్ భ‌వ‌నం మొద‌టి అంత‌స్తులో ఉన్న గ‌డియారాన్ని ప‌రిశీలించారు. ఈ మోండా మార్కెట్ గ‌డియారానికి కూడా మ‌ర‌మ్మ‌తులు నిర్వ‌హించి ప‌నిచేసేవిధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. స‌మీపంలో ఉన్న పాత జైల్ ఖానాను కూడా ప‌రిశీలించి శిథిలావ‌స్థ‌లో ఉన్న ఈ జైల్ ఖానాకు మ‌ర‌మ్మ‌తులు నిర్వ‌హించేందుకు స్థానిక వ్యాపారుల‌తో స‌మావేశం ఏర్పాటుచేసి త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సికింద్రాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్‌ను అర్వింద్‌కుమార్ ఆదేశించారు. ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్‌తో పాటు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌, చార్మినార్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు ముషార‌ఫ్ అలీ, శ్రీ‌నివాస్‌రెడ్డి, ర‌ఘుప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
*న‌గ‌రంలోని క్లాక్‌ట‌వ‌ర్ల వివ‌రాలు...*
1. సికింద్రాబాద్ క్లాక్‌ట‌వ‌ర్‌: 120 ఫీట్ల ఎత్తుగ‌లో నిర్మించిన సికింద్రాబాద్ క్లాక్‌ట‌వ‌ర్‌ను 1860లో నిర్మించారు. సికింద్రాబాద్‌కు చెందిన దివాన్ బ‌హ‌దూర్ సేత్ ల‌క్ష్మినారాయ‌ణ్ రాంగోపాల్ ట‌వ‌ర్‌పై ఏర్పాటుచేసిన గ‌డియారాన్ని బ‌హుక‌రించారు. 1897 ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన బ్రిటీష్ రెసిడెంట్ జాన్ చిఫేల్ ఫ్లోడెన్ రెండున్న‌ర ఎక‌రాల స్థ‌లంలో ఏర్పాటుచేసిన‌ ఈ క్లాక్‌ట‌వ‌ర్‌ను ప్రారంభించారు.
2. జేమ్స్ స్ట్రీట్ క్లాక్‌ట‌వ‌ర్‌: ఈ క్లాక్‌ట‌వ‌ర్‌ను సేట్ రాంగోపాల్ 1900 సంవ‌త్స‌రంలో నిర్మించారు. 
3. సుల్తాన్ బ‌జార్ క్లాక్‌ట‌వ‌ర్‌: 1865లో బ్రిటీష‌ర్లు సుల్తాన్‌బ‌జార్ క్లాక్‌ట‌వ‌ర్‌ను నిర్మించారు. అప్పటి బ్రిటీష్ రెసిడెన్సీలో నిర్మించిన ఈ క్లాక్‌ట‌వ‌ర్‌ ప్ర‌స్తుతం కోటి ప్ర‌భుత్వ మెట‌ర్న‌టి ఆసుప‌త్రి వ‌ద్ద ఉన్న దీనిని ప్ర‌తిఒక్క‌రూ చూడ‌వ‌చ్చు.
4. ఫ‌తేమైదాన్ క్లాక్‌ట‌వ‌ర్: నిజాం ప్ర‌భుత్వంలో ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ఉన్న ఖుర్షిద్ జా బ‌హ‌దూర్ చిన్న కొడుకు అయిన న‌వాబ్ జాఫ‌ర్ యార్ జంగ్ 1903లో ఫ‌తేమైదాన్ క్లాక్‌ట‌వ‌ర్‌ను నిర్మించారు. 1904లో ఈ క్లాక్ ట‌వ‌ర్‌ను 7వ నిజాం ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు.
5. మోజంజాహీ మార్కెట్ క్లాక్‌ట‌వ‌ర్‌: ఏడ‌వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ త‌న కుమారుడైన ప్రిన్స్ మోజంజా బ‌హ‌దూర్ పేరుపై మోజంజాహీ మార్కెట్‌లో 1933 నుండి 1935 మ‌ధ్య ఈ క్లాక్‌ట‌వ‌ర్‌ను నిర్మించారు. 
6. మ‌హబూబ్ చౌక్ క్లాక్‌ట‌వ‌ర్: చార్మినార్‌కు స‌మీపంలోని మ‌హ‌బూబ్ చౌక్ (ముర్గీచౌక్) వ‌ద్ద 1874 నుండి 1877 మ‌ధ్య ఈ క్లాక్‌ట‌వ‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఇండో యూరోపియ‌న్ శైలీలో ఈ క్లాక్‌ట‌వ‌ర్‌ను నిర్మించారు. 1892లో అస్మాన్ జా ఈ క్లాక్‌ట‌వ‌ర్‌ను జాతికి అంకితం చేశారు. ఈ క్లాక్‌ట‌వ‌ర్ చుట్టూ చ‌క్క‌టి ఉద్యాన‌వ‌నం కూడా ఏర్పాటు చేశారు. 
7. సెయింట్ జార్జ్ క్లాక్ ట‌వ‌ర్‌: సెయింట్ జార్జ్ చ‌ర్చ్‌లో ఏర్పాటుచేసిన క్లాక్‌ట‌వ‌ర్‌ను అప్ప‌టి చీఫ్ ఇంజ‌నీర్ జార్జ్ విల‌యం మ్యారెట్ రూపొందించారు. ఈ క్లాక్‌ట‌వ‌ర్‌ను 1867 ఏప్రిల్ 10న ప్రారంభించారు.
8. చార్మినార్ పై గ‌డియారాలు: చారిత్ర‌క చార్మినార్‌కు నాలుగువైపులా 1889లో గ‌డియారాల‌ను ఏర్పాటు చేశారు. 
9. శాలిబండ క్లాక్‌ట‌వ‌ర్‌: 1901లో రాజా శ్యాంరాజ్ బ‌హ‌దూర్ శాలిబండ‌లో క్లాక్‌ట‌వ‌ర్‌ను నిర్మించారు. నాలుగువైపులా క్లాక్‌ట‌వ‌ర్ల‌తో ఏర్పాటుచేసిన శాలిబండ క్లాక్‌ట‌వ‌ర్ చూప‌ర్ల‌ను ఆక‌ట్ట‌కునేలా ఉంటుంది. ఈ క్లాక్‌ట‌వ‌ర్ పై భారీ గంట కూడా ఏర్పాటు చేశారు.