బిరబిరా కృష్ణమ్మ (అనంతపురం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బిరబిరా కృష్ణమ్మ (అనంతపురం)

అనంతపురం, ఫిబ్రవరి 6 (way2newstv.com): కరవు జిల్లాలో అన్నివైపులా కృష్ణా జలాలు పరుగులు పెడుతుండగా.. తాజాగా మరింత కృష్ణమ్మను తక్కువ సమయంలో ఎక్కువగా తీసుకునే అవకాశం కలగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టును మంజూరు చేసింది. తద్వారా జిల్లాలో మూడు నియోజకవర్గాలకు మేలు జరగడమే కాకుండా, చిత్తూరు జిల్లాకు సైతం మరింతగా ప్రయోజనం కలగనుంది.
జిల్లాలోని హంద్రీనీవా మొదటి దశ జీడిపల్లి జలాశయం వద్ద 216.3వ కి.మీ వద్ద ముగుస్తుంది. అక్కడి నుంచి రెండో దశ మొదలవుతుంది. ఈ రెండో దశ మన జిల్లాలోని తలుపుల మండలంలోని చిత్తూరు జిల్లా సరిహద్దులోని ప్రధాన కాల్వలో 490వ కి.మీ. వద్ద ముగుస్తుంది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో 554 కి.మీ. వరకు ప్రధాన కాల్వ ఉంది. అయితే మొదటి, రెండో దశల్లో కృష్ణమ్మ అనంతపురం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లోని మండలాలు దాటి వెళ్లడం, ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాల నేపథ్యంలో.. చివరకు నీరు వెళ్లడం కష్టమవుతోంది. మన జిల్లాలోని కదిరి, చెర్లోపల్లి జలాశయం వరకు నీరు చేరడానికి చాలా సమయం పడుతోంది.



బిరబిరా కృష్ణమ్మ (అనంతపురం)

వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు అన్నిచోట్లా నీటి కోసం ఎక్కువ డిమాండ్‌ ఉంటోంది. దీంతో ప్రభుత్వం కడప జిల్లాలోని గండికోట జలాశయం ద్వారా చిత్రావతి జలాశయం ద్వారా వచ్చే నీటిని తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా జిల్లాలో 11 నియోజకవర్గాలకు మేలు కలుగుతోంది. అటు హంద్రీనీవా మొదటి దశవైపు నుంచి వచ్చే నీరే కాకుండా, కడప జిల్లాలోని గండికోట జలాశయం నుంచి వచ్చే కృష్ణా జలాలను కూడా హంద్రీనీవా కాల్వలోకి తీసుకొచ్చేలా కీలక ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జలవనరుల శాఖ ఇంజినీర్లు పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలపడమే కాకుండా రూ.1,796.99 కోట్ల మేర పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జలవనరుల శాఖ మంగళవారం ఉత్తర్వు సంఖ్య 78 జారీ చేసింది. వెరసి ఇంజినీర్లు ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఆరంభించేందుకు సిద్ధమవుతున్నారు.

కడప జిల్లాలోని గండికోట జలాశయానికి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న వరద కాల్వ ద్వారా నీరు చేరుతుంది. అక్కడి నుంచి ఐదు ఎత్తిపోతల పథకాల ద్వారా చిత్రావతి జలాశయానికి నీరు వస్తోంది. రెండేళ్లుగా ఈ నీటిని తీసుకొస్తున్నారు. చిత్రావతి జలాశయ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీల మేర ఉంది. ఈ జలాశయం నుంచి తాజాగా నీటిని తరలించేందుకు ప్రతిపాదన చేశారు.చిత్రావతి వెనుక జలాల వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి నీటిని ఎత్తిపోస్తారు. ముదిగుబ్బ మండలం చిన్నొకోట్ల, ఎర్రగుంటపల్లి ప్రాంతం నుంచి కాల్వ మొదలై బుదనంపల్లి, బండ్లపల్లి, దొరిగల్లు మీదగా యోగివేమన జలాశయం వరకు 25 కి.మీ. మేర కాల్వ నిర్మిస్తారు. చిత్రావతి వెనుక జలాల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకమే కాకుండా యోగివేమన వరకు మరో మూడో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తారు. ఇలా వచ్చిన నీటితో 0.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న యోగివేమన జలాశయం నిండుతుంది. మళ్లీ యోగివేమన జలాశయం నుంచి నీటిని తరలించేందుకు మరో 4.5 కి.మీ. మేర కాల్వ నిర్మించి, మధ్యలో రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తారు. ఇలా వెళ్లిన నీరు నాగారెడ్డిపల్లె సమీపంలో హంద్రీనీవా ప్రధాన కాల్వలో 386.9వ కి.మీ. వద్ద కలుస్తుంది. ఇందులో మొత్తంగా 29.5 కి.మీ. మేర కాల్వ, ఆరు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తారు. ఈ పనులు చేసేందుకు రూ.1,827.57 కోట్ల మేర వ్యయం అవుతుందని అనంతపురం జలవనరుల శాఖ ఇంజినీర్లు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపారు. దీనిని పరిశీలించిన ఉన్నతాధికారులు రూ.1,796.99 కోట్ల మేర పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే చిత్రావతిలో నీటి లభ్యత మేరకు రోజుకు 2 వేల క్యూసెక్కులు చొప్పున ఈ కొత్త కాల్వ ద్వారా హంద్రీనీవా కాల్వలోకి తీసుకెళ్లేలా అవకాశం కల్పించారు.