అంతా అస్తవ్యస్తం (తూర్పుగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అంతా అస్తవ్యస్తం (తూర్పుగోదావరి)

రాజమండ్రి, ఫిబ్రవరి 6 (way2newstv.com): జిల్లాలో నగరాలు, పట్టణాల పరిధిలో ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. పలు చోట్ల పట్టపగలే ఈ దీపాలు వెలుగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో పాడైన దీపాలను మార్చడంలో జాప్యం జరుగుతుండటంతో రోజుల తరబడి అంధకారం అలముకుంటోంది. మరికొన్ని ప్రాంతాల్లో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతుండటం మామూలై పోయింది. దీంతో వీటి ఏర్పాటులో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుతో విద్యుత్తును ఆదా చేయవచ్చన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసినా పర్యవేక్షణ లోపం ప్రతిబంధకంగా మారింది.
జిల్లాలో నగర, పురపాలక సంఘాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వీటిని మార్చే సిబ్బంది మాత్రం అందుబాటులో ఉండటం లేదు. వీటి నిర్వహణ పూర్తిగా ప్రైవేట్‌ సంస్థ చేతిలో ఉండటమే దీనికి కారణంగా ఉంది. 2015లో ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) సంస్థ వీటి ఏర్పాటు బాధ్యతలు చేపట్టింది.


అంతా అస్తవ్యస్తం (తూర్పుగోదావరి)

 జిల్లాలో రెండు నగరపాలక సంస్థలు, ఏడు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీల్లో కలిపి మొత్తం 48,290 ఎల్‌ఈడీ వీధి దీపాలను ఈ సంస్థ ఏర్పాటు చేసింది. దీనివల్ల విద్యుత్తు 50 శాతం మేరకు ఆదా అవుతుందని అధికారులు భావించినా నిర్వహణలో సమస్యలు ఇందుకు ఇబ్బందికరంగా మారాయి. పలు చోట్ల వీధి దీపాలు తరుచూ వెలగడం లేదు. పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో కూడిన ఈ దీపాలు మరమ్మతులకు గురైతే వాటిని బాగు చేయాలంటే అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది.దీంతో వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడమే ప్రత్యామ్నాయంగా మారింది. ఈ ప్రక్రియ కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఎక్కడైనా వీధి దీపాలు పాడైనట్లు మున్సిపల్‌ సిబ్బంది గుర్తిస్తే ఈ విషయాన్ని నిర్వహణ సంస్థకు ఫిర్యాదు చేస్తారు. సిబ్బంది అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో త్వరితంగానే వారు స్పందిస్తున్నా అనేక చోట్ల ఆ పరిస్థితి ఉండటం లేదు. దీంతో పలు చోట్ల రోజుల తరబడి వీధి దీపాలు వెలగక స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థల్లో ఈఈఎస్‌ఎల్‌ సంస్థ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతో కొంత మేర పరిస్థితి మెరుగుపడింది. ఇక్కడ దీపాలు పాడైన చోట కొత్తవి ఏర్పాటు చేసేందుకు కొంత సమయం పడుతోంది.పెద్దాపురం, పిఠాపురం పురపాలక సంఘాల పరిధిలోని శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు తరుచూ మొరాయిస్తున్నాయి. వీటి స్థానంలో కొత్తగా త్వరితంగా ఏర్పాటు చేయక పోవడంతో అంధకారం అలముకుంటోంది. తుని, అమలాపురం, సామర్లకోట తదితర పట్టణాల్లో సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ఒప్పంద కార్మికులతో తాత్కాలికంగా సేవలు అందిస్తున్నారు. మండపేట, రామచంద్రపురం పురపాలక సంఘాల్లో కూడా తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు చోట్ల పగటి పూట వీధి దీపాలు వెలుగుతున్నా పట్టించుకునే వారు కరవవుతున్నారు. ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యను పురపాలక శాఖ ఆర్డీ నాగరాజు దృష్టికి తీసుకెళ్లగా పురపాలక సంఘాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణలో సమస్య ఉందని తెలిపారు. ప్రైవేట్‌ భాగస్వామ్యం వల్ల మరమ్మతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయానఇన తమ ఉన్నతాధికారులకు తెలియజేశామని చెప్పారు. త్వరలో పరిష్కారం లభిస్తుందన్నారు.