చైనా తరహాలో భీమవరం చేపల సాగు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చైనా తరహాలో భీమవరం చేపల సాగు

ఏలూరు, ఫిబ్రవరి 20, (way2newstv.com)
 చైనాలో సాగుచేస్తున్న తరహా చేపలను భీమవరంలో సాగుచేయడానికి ప్రయత్నాలు సర్కార్ ప్రారంభించింది. అలాగే నాణ్యమైన ఉత్పత్తుల కోసం చైనా తరహా సాగు విధానాలను అవలంబించనుంది. ఎగుమతులకు సైతం చైనా అనుసరిస్తున్న విధానాలనే అనుసరించాలని భావిస్తోంది. వైట్‌స్పాట్, రెడ్ డిసీజ్ వంటి వ్యాధులతో కోట్లాది రూపాయల నష్టాలను చవిచూస్తున్న ఆక్వా రైతాంగానికి ప్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్’ తీపి కబురును అందివ్వనుంది. చైనా దేశంతో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, థాయ్‌లాండ్ చెందిన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ మత్య్సశాఖ, తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సంయుక్తంగా చేసుకోనున్న ఒప్పందాలతో భారతదేశానికి ఆక్వా కల్చర్ హబ్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా సాగు ట్రెండ్ మారునుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో చైనా పద్ధతులను ప్రవేశపెట్టి, దశలవారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

 చైనా తరహాలో  భీమవరం చేపల సాగు 

ప్రస్తుత పరిస్ధితుల్లో ఆక్వా సాగు వల్ల ఎక్కువగా జలవనరులు కాలుష్యం అవుతున్నాయి. కోళ్ల ఫారాలు, కబేళాల నుంచి వస్తున్న వ్యర్థాలను ఆక్వా సాగుకు ఉపయోగిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. దీనివల్ల చెరువులోని నీరంతా కలుషితమవుతోంది. అలాగే ఇక్కడ సాగుకు ఉపయోగించే ఫీడ్ కారణంగా కూడా కొంత కాలుష్యం ఏర్పడుతోంది. ఇలా కలుషిత జలాల్లో పెరిగిన చేపల నాణ్యత కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. అయితే చైనా దేశంలో అనుసరిస్తున్న సాగు పద్ధతుల కారణంగా అక్కడ జలకాలుష్యం సమస్య ఉండదు. అక్కడ తయారుచేసే చేపల మేత వల్లకూడా జలాలు కలుషితం కావు. దీనివల్ల అక్కడి చేపల నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. దాదాపు ఐదువేల కిలోమీటర్ల దూరంలోని దేశాలకు సైతం చైనా బతికున్న చేపలను ఎగుమతి చేయగలుగుతోంది. ఇటువంటి ప్రమాణాలు పాటించడం వల్ల రాష్ట్రం నుండి ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతున్న వనామి రొయ్య నాణ్యంగా, రుచికరంగా ఉండే అవకాశముంది. చైనాలో 250 రకాల చేపలను ఉత్పత్తి జరుగుతుండగా, ఏపిలో మాత్రం కొర్రమేను, శీలావతి, బొచ్చు, పండుగప్ప వంటి రకాలు తప్ప కొత్త జాతులు, రకాలను ఉత్పత్తి చేయడం లేదు. ఇక చైనా ఒప్పందాలతో చేపల రకాలను ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుని, సాంప్రదాయ పద్ధతిలో వాటిని సాగుచేయనున్నారు. అప్పుడు రొయ్యతో పాటు చేపలను కూడ ఎగుమతి చేయడానికి అవకాశముంటుంది.