కమల జ్యోతి పేరుతో ఇంటింటికి బీజేపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కమల జ్యోతి పేరుతో ఇంటింటికి బీజేపీ

హైద్రాబాద్, ఫిబ్రవరి 14, (way2newstv.com)
ఎన్నికలకు బీజేపీ తెలంగాణ శాఖ సన్నద్ధమవుతోంది. వరుసగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకుంది. ‘మన కుటుంబం- బీజేపీ కుటుంబం’ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల ఇళ్లపై పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నారు.రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొంత కసరత్తు కూడా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో పర్యటించిన అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలు పోటీ చేయాలనుకునే వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. 


కమల జ్యోతి పేరుతో ఇంటింటికి బీజేపీ

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ.. ఓడిన వారిలో ఓట్లు ఎవరు ఎక్కువగా సాధించారు..వారిలో ఎవరిని లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులుగా పోటీ చేస్తారన్న అంశంపై బీజేపీలో చర్చ జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల కారణంగా లబ్ధి పొందిన వారి జాబితాను పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర శాఖకు ఇటీవలే పంపించింది. ఈ జాబితాలో పేర్కొన్న వారి కుటుంబాలను పార్టీ శ్రేణులు నేరుగా కలవనున్నారు. నరేంద్రమోదీ కారణంగా దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని వివరించనున్నారు.అవినీతిరహిత పాలన, జవాబుదారి పాలన కావాలంటే.. మరోసారి మోదీ ప్రధానమంత్రిగా కావడానికి సహకరించాలని కోరనున్నారు. అనంతరం వారి ఇళ్లల్లో ‘కమలజ్యోతి’ పేరుతో జోతి వెలిగించనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జనవరిలో వస్తారని, ఫిబ్రవరి 13న వస్తారంటూ పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ ఆయన పర్యటన వాయిదా పడింది. చివరకు ఈ నెల 25 నుంచి 27 తేదీలోగా షా రాష్ట్ర పర్యటనకు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన పర్యటన అనంతరమే.. మార్చి 2న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. మార్చి 2నతో సంస్థాగత కార్యక్రమాలు పూర్తి అవుతున్నందున, ఆ తరువాతే అభ్యర్థుల ఎంపిక అంశంపై దృష్టి సారించాలని బీజేపీ భావిస్తోంది.. లోక్‌సభ ఎన్నికలకు మార్చిలో షెడ్యూల్ వెలువడే అవకాశమున్నంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన కూడా మార్చిలో ఉండనుందని పార్టీ నేతలు చెబుతున్నారు.