ఎన్నాళ్లీ నిర్లక్ష్యం? (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్నాళ్లీ నిర్లక్ష్యం? (గుంటూరు)

నరసరావుపేట, ఫిబ్రవరి 11 (way2newstv.com): 
మూడేళ్లు గడిచినా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించినా ఇప్పటి వరకు కళాశాల భవన నిర్మాణం మొదలుకాలేదు. కనీసం ప్రహరీ గోడ కట్టలేదు. అదీ కూడా అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఇరుకు గదుల్లో సతమతమవుతున్నారు. రూ.కోట్ల నిధులున్నా, నిర్మాణాలు ముందకు సాగకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జేఎన్‌టీయూ(కె) విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నరసరావుపేటలో ఇంజినీరింగ్‌ కళాశాలను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. పట్టణంలోని ఓ విద్యాసంస్థకు చెందిన భవనాల్లో తాత్కాలికంగా తరగతులు మొదలయ్యాయి. కళాశాల మంజూరుకు అనుమతులతో పాటు కళాశాల భవనాలకు స్థలం కేటాయింపుల్లో సభాపతి కోడెల శివప్రసాదరావు చొరవ తీసుకున్నారు. 


ఎన్నాళ్లీ నిర్లక్ష్యం? (గుంటూరు)

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని శంకుస్థాపనకు మరీ తెచ్చారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపన చేస్తే ఇక కళాశాల నిర్మాణం శరవేగంతో సాగిపోతుందని భావించారు. ఆ తరువాత ఆరు నెలలు గడిచినా కూడా అడుగు ముందుకు పడలేదు. మరలా సభాపతి కోడెలతో మరోసారి భూమి పూజ చేయించారు. అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న చందాన పనులు ముందుకు సాగడం లేదు. ఈనేపథ్యంలో జేఎన్‌టీయూ కాకినాడ విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా రామలింగరాజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన కొంతమేర చొరవ తీసుకోవడంతో ప్రహరీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. దీంతో అందరూ ఇక చకాచకా పనులు సాగుతాయని, త్వరలోనే భవనాలు కూడా నిర్మిస్తారని ఆశలు పెట్టుకున్నారు. కాని అవికూడా ఆవిరైపోయాయి. గోడ నిర్మాణ పనులు కూడా ముందుకు సాగలేదు. చివరకు గత వారం రోజులుగా అసలు పనులే నిలిపివేశారు. ప్రహరీ నిర్మాణానికే రూ.2.75 కోట్లు నిధులు ఉన్నాయి. వంద మంది కార్మికులను పెట్టి ఉరుకులు పరుగుల మీద పనులు చేయించొచ్చు. కాని గుత్తేదారు మాత్రం అంత ఆసక్తి చూపలేదు. విశ్వవిద్యాలయం అధికారులు నరసరావుపేట జేఎన్‌టీయూ కళాశాలపై శ్రద్ధ చూపడం లేదని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రహరీ నిర్మాణం పని దక్కించుకున్న గుత్తేదారు పనులకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతుంది. ఈ పనిని ఉప గుత్తేదారుకు అప్పగించారని ప్రచారంలో ఉంది. స్థలం విషయంలో ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులున్నా, ఎందుకు సాగడం లేదనే ప్రశ్న ఉదయిస్తోంది. జేఎన్‌టీయూ కళాశాల కాకాని గ్రామం పరిధిలో నిర్మిస్తుండగా, స్థానిక పంచాయతీ కార్యదర్శి వచ్చి పనులు అడ్డుకున్నట్లు మరో కథనం వినిపిస్తుంది. చట్టపరంగా పంచాయతీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే నోటీసు ఇవ్వాలి. అప్పటికీ డబ్బు కట్టకపోతే పనులు ఆపాలి. నోటీసు ఇస్తే డబ్బు కడతామని స్థానిక జేఎన్‌టీయూ కళాశాల ఏఈ పంచాయతీ కార్యదర్శికి చెబితే నోటీసు మాత్రం ఇవ్వడం లేదని ఏఈ చెప్పుకొస్తున్నారు. దీంతోనే గుత్తేదారు పనులు నిలిపివేశారని వినిపిస్తున్నారు. వివాదాలు ఏమైనా ఉన్నా చక్కదిద్దాల్సిన విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు ఇటువైపు చూడటం మానేశారు. దీంతో రూ.కోట్ల నిధులున్నా, పనులు సాగడం లేదు. సభాపతి కోడెల చొరవ తీసుకొని నిర్మాణం ముందుకు సాగేలా చూడాలని పల్నాడు వాసులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం నరసరావుపేట పట్టణంలోని ఓ విద్యాసంస్థకు చెందిన భవనాల్లో జేఎన్‌టీయూ కళాశాలను నడుపుతున్నారు. ఇప్పటికీ 900 మంది విద్యార్థులు ఉన్నారు. ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రయోగాలు చేసేందుకు దారి ఉండటం లేదు. దీనికి తోడు వచ్చే విద్యా సంవత్సరం మరో 300 మంది విద్యార్థులు రానున్నారు. కళాశాల తరగతి గదులు ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోవు. కొత్త భవనాలు నిర్మాణానికి స్థలం విషయంలో ఇబ్బంది లేదు. ఇక కేటాయించిన నిధులైతే రూ.80 కోట్ల వరకూ ఉన్నాయి. అన్ని ఉన్నా గాని నిర్మాణం చేపట్టడంపై విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.