సేవలు మృగ్యం (హైదరాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సేవలు మృగ్యం (హైదరాబాద్)

హైదరాబాద్, ఫిబ్రవి 5  (way2newstv.com):  ప్రభుత్వ రంగ ఆసుపత్రి నిమ్స్‌లో సేవలు రోజురోజుకు దిగజారుతున్నాయి. గతంతో పోల్చితే 20-30 శాతం మంది రోగులు పెరిగినా ఆ మేరకు సౌకర్యాలు కల్పించడంలో చొరవ కనిపించడం లేదు. దీంతో అనేక విభాగాల్లో సమస్యలు స్వాగతం పలుకున్నాయి. యూరాలజీ, న్యూరోసర్జరీ తదితర కీలక విభాగాల్లో శస్త్ర చికిత్సలకు రోగులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఒక్క న్యూరోసర్జరీలో మూడు నెలల నిరీక్షణ జాబితా ఉందంటే పరిస్థితి ఎలా ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రత్యేక చట్టం కింద నిమ్స్‌ ఆసుపత్రి ఏర్పాటైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఆసుపత్రి అయిన సరే... వైద్య సేవలకు ఇక్కడ డబ్బులు చెల్లించాలి. ప్రైవేటు ఆసుపత్రులతో పోల్చితే 30-40 శాతం తక్కువగా ఉంటాయి. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారు. అధిక ఆదాయ వర్గాలతోపాటు మధ్యతరగతి ప్రజలు, ఆరోగ్యశ్రీ కింద పేదలు ఇక్కడ చికిత్స తీసుకునేందుకు వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల నుంచే కాక.. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో రోగులు విచ్చేస్తుంటారు. నిత్యం 1500-2000 వరకు అవుట్‌పేషెంట్లు వస్తున్నారు. అధికారికంగా 1014 పడకలు ఉన్నాయి. అనధికారికంగా మరో 500-600 పడకలు నిర్వహిస్తున్నారు. ఆ మేరకు వైద్యుల నుంచి నర్సులు, నాలుగో తరగతి సిబ్బంది సేవలు పెరిగాలి.


సేవలు మృగ్యం (హైదరాబాద్)

అవుట్‌పేషెంట్‌ విభాగం వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోంది. పేరు నమోదు నుంచి చిటీ తీసుకునేందుకు 45 నిమిషాల నుంచి గంటపైనే పడుతోంది. తీరా వైద్యుల నుంచి చూపించి పరీక్షలు చేసుకునే సరికి పుణ్యకాలం గడిచిపోతోంది. కొందరైతే రెండో రోజు మళ్లీ రావాల్సి వస్తోంది. కొన్నిసార్లు తర్వాత రోజు సంబంధిత యూనిట్‌ లేకపోతే మళ్లీ మూడో రోజు వరకు నిరీక్షించాల్సి వస్తోంది. కొందరైతే ఆసుపత్రి ప్రాంగణంలోనే తమ వంతు వచ్చే వరకు నిరీక్షిస్తున్నారు. కొన్ని విభాగాలకు సంబంధించి సీనియర్‌ వైద్యులు సైతం ఓపీలకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. జూనియర్‌ వైద్యులతో ఓపీని నెట్టుకొస్తున్నారు.

ఆసుపత్రిలోని కొత్త బ్లాక్‌లో అత్యవసర విభాగం నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిత్యం పడకల కొరత వేధిస్తోంది. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు పడకలు లభించక ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర విభాగం నుంచి రోగులను 12 గంటలలోపు నిర్ణీత వార్డుకు తరలించాలి. కొందరు రోగులు 2-3 రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. తర్వాత వచ్చే వారికి అత్యవసర విభాగంలో చికిత్స తీసుకునేందుకు ఇబ్బంది ఎదురవుతోంది. కొందరైతే గంటల తరబడి అంబులెన్స్‌లకు పరిమితమవుతుంటే.. మరికొందరు వేరే ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు.

నిమ్స్‌ కు వచ్చేవారిలో 80 శాతం ఆరోగ్యశ్రీ రోగులే. వీరు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అంత వరకు రోగులకు ఆసుపత్రిలో ఉంటున్నారు. ఇక ఆపరేషన్‌ థియేటర్లు మధ్యాహ్నం ఒంటి గంటకే మూత పడుతున్నాయి. అనస్తీషియన్లు అందుబాటులో లేకపోవడంతో శస్త్ర చికిత్సలు వాయిదా పడుతున్నాయి. దీనికితోడు ఆరోగ్యశ్రీలో తొలుత రోగులతో డబ్బులు కట్టించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు భారీగా పేరుకుపోయినట్లు సమాచారం.
వ్యాధి నిర్ధరణలో జాప్యం..: నిమ్స్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యులు రాసిన కొన్ని పరీక్షలు ఇక్కడ అందుబాటులో ఉండటం లేదు. రోగులు డబ్బులు వెచ్చించి బయట పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇక న్యూరోసర్జరీలో రోగులకు సకాలంలో సర్జరీలు కావడం లేదు. వివిధ విభాగాల్లో రోగుల రద్దీకు తగ్గట్టు సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

శస్త్ర చికిత్సలు చేసే సమయంలో అనస్తిషీయా వైద్యులే కీలకం. ప్రస్తుతం ఒకటే బృందంతో నెట్టుకొస్తున్నారు. అత్యవసర విభాగంలో ఉన్న అనస్తిషియా బృందమే అన్నిచోట్లకు తిరుగుతూ సేవలు అందించే పరిస్థితి నెలకొంది. దాదాపు రూ.25 కోట్లతో బోన్‌మ్యారో చికిత్సల కోసం స్టెమ్‌సెల్‌ కేంద్రాన్ని తీర్చిదిద్దాలని నాలుగేళ్ల క్రితమే నిర్ణయించారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు విడుదల అయ్యాయి. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. రెండేళ్ల క్రితం నుంచి ఇదిగో అదిగో అనడం తప్ప సేవలు ప్రారంభం కాలేదు. దీనికితోడు పెట్‌స్కాన్‌ అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

 అత్యవసర విభాగంలో 90 వరకు వెంటిలేటర్లు ఉన్నాయి. ఇందులో 20-30 వరకు తరచూ మొరాయిస్తుంటాయి. మిగిలిన వెంటిలేటర్లు  సరిపోవడం లేదు. అత్యవసర సమాయాల్లో రోగులు వచ్చినప్పుడు వెంటిలేటర్లు లేవని ఎంతో మంది అత్యవసర సమయాల్లో వచ్చే రోగులను తిప్పి పంపుతున్నారు. వెంటిలేటర్లు దొరికే వరకు కొందర్ని గంటల తరబడి అంబులెన్సుల నుంచి దింగకు దించడం లేదు. కొందరు విసిగిపోయి వేరే ఆసుపత్రిలకు తరలిస్తున్నారు.