రియాల్టీలో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రియాల్టీలో

నెంబర్ వన్ గా తెలంగాణ, 15 వస్థానంలో ఆంధ్రా
హైద్రాబాద్, ఫిబ్రవరి 12, (way2newstv.com)
తెలంగాణ స్థిరాస్తి లావాదేవీలు అంచనాలు మించి జరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి భారీగా పెరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం పదినెలల్లో రియల్ ఆదాయం గణనీయంగా వృద్ధి సాధించింది. జనవరి నెలాఖరుకు 30 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. తమిళనాడు 23% వృద్ధిరేటుతో రెండోస్థానంలో ఉన్నది. కర్ణాటక (20), ఏపీ (15), మహారాష్ట్ర (13) తరువాతి స్థానాల్లో నిలిచాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు, స్టాంపులద్వారా తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన రాబడి లక్ష్యం రూ.4,700 కోట్లు కాగా.. జనవరి నెలాఖరు నాటికే 4,695 కోట్లు సాధించింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు, ఇతర ఫీజులు కలిపి రూ.4,830 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ-స్టాంపుల ద్వారా మరో రూ.700 కోట్ల వరకు రాబడి వచ్చింది. మొత్తం రాబడి 5,500 కోట్లు దాటినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 



రియాల్టీలో 

గత ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి మొత్తంగా నికరరాబడి రూ.4,500 కోట్లు రాగా.. ఈసారి ఇంకా రెండునెలలు ఉండగానే నికర రాబడి రూ.4,255 కోట్లు దాటింది. స్థానిక సంస్థల వాటాతో కలిపి రూ.4,830 కోట్ల రాబడి సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెల నుంచే రిజిస్ట్రేషన్ల జోరు బాగా పెరిగింది. తాజాగా జనవరి నెలలో రికార్డుస్థాయిలో 1,22,241 దస్తావేజులు రిజిస్టరయ్యాయి.
దీనిద్వారా ఒక్కనెలలోనే రూ.449 కోట్ల రాబడి సమకూరింది. గతేడాది జనవరిలో 99,133 దస్తావేజులు రిజిస్టర్ కాగా.. రూ.369 కోట్ల రాబడి వచ్చింది. రాష్ట్రంలో అన్నిరంగాల్లో జరుగుతున్న స్థిరమైన అభివృద్ధి, పెట్టుబడులకు అనువైన పరిస్థితులు రియల్‌రంగంలో రాబడి బాగా పెరుగడానికి దోహదపడుతున్నాయి. పారిశ్రామిక ప్రగతి, సులభతర వాణిజ్యవిధానంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి కారణంగా స్థిరాస్తుల క్రయ, విక్రయాలు జోరందుకున్నాయి. రాష్ట్ర మొత్తం స్థూల గృహోత్పత్తిలో రియల్‌రంగం కీలకపాత్ర వహిస్తున్నది. గతేడాది స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ను పరిశీలిస్తే అధికారికంగా లక్ష కోట్లు.. అనధికారికంగా రెండులక్షల కోట్ల రూపాయలకుపైగా విలువ గల ఆస్తుల క్రయవిక్రయాలు జరిగినట్టు తెలుస్తున్నది. మూడేండ్లుగా ఈ గ్రాఫ్ పైపైకి పోతున్నది. 2016-17లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.3,820 కోట్ల రాబడి రాగా.. 2017-18లో అది 4,500 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 5 వేల కోట్లు దాటనున్నది.