కాలుష్య కాసారం (తూర్పగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాలుష్య కాసారం (తూర్పగోదావరి)

కాకినాడ, ఫిబ్రవరి 5  (way2newstv.com): జిల్లాలో వాయు కాలుష్యం బుసలు కొడుతోంది.. ప్రజారోగ్యాన్ని కష్టాల్లోకి నెట్టేస్తోంది..రూ.కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో  ప్రమాణాలకు పాతరేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో కాలుష్య కాటు తప్పడం లేదు. అప్పుడప్పుడూ తాకీదులు జారీ చేస్తున్నా సంబంధిత యాజమాన్యాల్లో చలనం ఉండటం లేదు. దీనికితోడు జిల్లాలో యథేచ్ఛగా వెలుస్తున్న క్వారీలు, మట్టిని తరలిస్తున్న వాహనాలు కాలుష్యం వెదజల్లుతుండటంతో ప్రజలు పలు వ్యాధుల బారినపడుతున్నారు.
జిల్లాలో రెండు ఎరువుల కర్మాగారాలు, 10 పేపర్‌ మిల్లులు, ఒక గ్యాస్‌ ఆధారిత పవర్‌ప్లాంటు నడుస్తున్నాయి. వీటితో పాటు బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు 100, స్టోన్‌ క్రషర్లు 80, సీఫుడ్‌ యూనిట్లు 11 ఉన్నాయి. 



 కాలుష్య కాసారం (తూర్పగోదావరి)

ఇవి కాకుండా చిన్న పరిశ్రమలు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటిని పరిశ్రమల శాఖతో పాటు కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తోంది. జిల్లాలో పలు పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను కాలువలు, నదులతో పాటు సముద్రంలోనూ నేరుగా వదిలేస్తున్నారు. మరికొన్ని పరిశ్రమల వల్ల వాయు కాలుష్యం ప్రజలను వెంటాడుతోంది. పారిశుద్ధ్య నిర్వహణ లోపం..కలుషిత జలాలు..వాతావరణ పరిస్థితుల నడుమ వ్యాధులతో తల్లడిల్లుతున్న ప్రజలకు వాయు కాలుష్యం మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతోంది.  ప్రజలకు ఉపాధి అవకాశాలను పెంచే క్రమంలో పరిశ్రమలను ఓ వైపు ప్రభుత్వం వెన్ను తట్టి ప్రోత్సహిస్తుండగా అందివచ్చిన అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకునే పరిస్థితి చాలాచోట్ల లేకపోవడంతో సమస్య ఎదురవుతోంది. కొన్ని పరిశ్రమలు  నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నా మరి కొన్ని నిబంధనలను పూర్తిగా పటపిటంచుకోని పరిస్థితి ఉంది. జిల్లాలో 64 మండలాల్లోని పరిశ్రమలను కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షక ఇంజినీరు, సహాయక ఇంజినీరు మాత్రమే పర్యవేక్షించాల్సి రావడంతో సమస్య ఎదురవుతోంది.

పరిశ్రమలు నిబంధనల ప్రకారం నడవాలంటే వెదజల్లుతున్న కాలుష్యం జనావళికి హాని చేయకూడదు. పరిశ్రమల్లో 20 శాతం నిర్మాణ ప్రాంతం.. మిగిలిన 80 శాతం గ్రీన్‌బెల్ట్‌ ఉండాలన్న నిబంధన ఉంది. డ్రెయిన్లలోకి వ్యర్థాలను వదలకుండా అన్ని పరిశ్రమల్లోనూ ఎఫిలియంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు (ఈటీపీ) తప్పనిసరి.. ప్లాంట్ల ఏర్పాటుకు స్థలం లేనివారు వ్యర్థ జలాలు ఆవిరి అయ్యేలా జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ (జెడ్‌ ఎల్‌డీ), మల్లిబుల్‌ ఎఫెక్ట్‌ ఎవాబరేటర్‌ (ఎంఈఈ)లను పరిశ్రమల స్థాయిని బట్టి ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. పరిశ్రమలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో వ్యర్థాలను బయటకు వదిలేస్తున్నారు. రెండు టన్నుల సామర్థ్యం గల పరిశ్రమలు సైక్లోన్‌ డస్ట్‌ కలెక్టర్‌, నాలుగు టన్నులైతే మల్టీ సైక్లోన్‌ డస్ట్‌ కలెక్టర్‌, ఆరు నుంచి ఏడు టన్నుల సామర్థ్యగలదైతే బ్యాగ్‌ ఫిల్టర్‌, 16 నుంచి 17 టన్నుల సామర్థ్యం ఉన్న పరిశ్రమైతే ఎలక్ట్రో స్టాటిక్‌ ప్రిసిపిలేటర్‌ (ఈఎస్పీ) ఏర్పాటు చేసుకోవాలి. నిర్మాణ, నిర్వహణ వ్యయాలను దృష్టిలో  ఉంచుకుని వీటిని కొందరు ఏర్పాటు చేయడంలేదు.కొన్ని చోట్ల ఇవి అందుబాటులో ఉన్నా వాడటం లేదు. దీంతో కాలుష్య సమస్య ఎదురవుతోంది. పెద్దాపురం, మండపేట, వాకలపూడి ప్రాంతాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అధికారుల పరిశీనలతో తేలింది.

మండపేట మండలం పరిధిలోని ఏడిద గ్రామ సమీపంలోని పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతున్నాయని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రైస్‌మిల్లులు, ఎడిబుల్‌ ఆయిల్‌, పేపర్‌ మిల్లులు తదితర 26 పరిశ్రమల్లో తనిఖీ చేశారు. వీటిలో తొమ్మిది పరిశ్రమలు నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు గుర్తించారు. విశాఖలోని కమిటీ ముందుకు విచారణకు హాజరవ్వాలని వాటి నిర్వాహకులకు తాకీదులు జారీ చేశారు. దీంతో ఆరు పరిశ్రమల నిర్వాహఖులు స్పందించి పరిస్థితులు చక్కదిద్దారు. మిగిలిన పరిశ్రమల యజమానులపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.

జిల్లాలో క్వారీల తవ్వకాలు, స్టోన్‌ క్రషర్ల నిర్వహణ ఇష్టారాజ్యంగా సాగుతోంది. కాలుష్య తీవ్రత పెరుగుతున్నా కీలక శాఖలు దృష్టిసారించే పరిస్థితి లేదు. ఈ తవ్వకాలు, పరిశ్రమల నిర్వహణలకు రాజకీయ దన్ను అధికంగా ఉండటంతో అధికారులు మిన్నకుంటున్నారు.పెద్దాపురం-జగ్గంపేట మధ్యలోని రామేశ్వరంపేట ప్రాంతంలో కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు ఏళ్లుగా సాగుతున్నాయి. భారీ వాహనాల రాకపోకల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలు దుమ్ముధూళితో నిండుతున్నాయి. జిల్లాలో స్టోన్‌ క్రషర్‌ యూనిట్లు నిబంధనలు పాటించడం లేదు. వీటి నుంచి దుమ్ము ధూళి చుట్టు పక్కల వ్యాపించకుండా పైన క్యాబిన్‌..చిప్స్‌ సేకరణకు క్యాబిన్‌ ఏర్పాటు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. దుమ్ము పైకి వ్యాపించకుండా తుంపర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంది. చాలా చోట్ల ఈ నిబంధనలు అమలు చేయడంలేదు. రౌతులపూడి, జగ్గంపేటలోని ఏలేశ్వరం, రాజమహేంద్రవరం గ్రామీణ పరిధిలోని కోలమూరు తదితర ప్రాంతాల్లో 70 వరకు స్టోన్‌ క్రషర్లు నడుస్తున్నాయి. వీటిలో 30 పరిశ్రమలు నిబంధనలు అతిక్రమిస్తూ నడుస్తున్నవే.వీటి నిర్వాకంతో వాయు కాలుష్యం పెరిగి సమీప ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.