అన్నీ లోపాలే.. (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అన్నీ లోపాలే.. (కృష్ణాజిల్లా)

నందిగామ, ఫిబ్రవరి 5  (way2newstv.com):కంచికచర్ల వద్ద  బైపాస్‌ రోడ్డు ఆకృతిలో లోపాలు ఉన్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నీటి ప్రవాహం సక్రమంగా వెళ్లేందుకు వీలు లేకుండా చప్టాలు నిర్మిస్తున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు నిల్వ ఉండి వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు సక్రమంగా పారేలా ఆకృతులు రూపొందించాలని, గతంలో ఉన్న ఇబ్బందులను సరి చేయాలని అనేక మార్లు జాతీయ రహదారుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో అన్నదాతలు రోడ్డు నిర్మాణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ లోపాలే.. (కృష్ణాజిల్లా)

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై కంచికచర్ల, నందిగామ వద్ద 11.5 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల బైపాస్‌ రోడ్డునురూ.316 కోట్లతో విస్తరించేందుకు టెండర్లు పిలిచారు. రూ.256 కోట్లకు (24 శాతం తక్కువకు) లక్ష్మీ ఇన్‌ఫ్రా కంపెనీ పనులు దక్కించుకుంది. ప్రస్తుతం పనులు చురుకుగా సాగుతున్నాయి. కంచికచర్ల బైపాస్‌ రోడ్డులో చెవిటికల్లు జంక్షన్‌ వద్ద గతంలో రెండు కల్వర్టులు నిర్మించారు. ఒక కల్వర్టు నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఎత్తులో నిర్మించడంతో ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం దానిని తొలగించి పక్కనే కొత్త కల్వర్టును నిర్మిస్తుండగా, నీటి ప్రవాహం జరగని విధంగా ఆకృతిని రూపొందించడం గమనార్హం. రెండో కల్వర్టును కేవలం కొద్ది వెడల్పుతో ఖానా నిర్మిస్తుండటంతో భారీ వర్షాలు పడినప్పుడు ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం ముందుకు వెళ్లకుండా, ఎగతన్ని చుట్టు పక్కల పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. బైపాస్‌ రోడ్డులో ఒకే కల్వర్టు ఉండటంతో తోళ్లవాగు, పందులవాగు, పెండ్యాల నుంచి వచ్చే వాగులు ద్వారా వచ్చే నీటి ప్రవాహంతో సుమారు 10 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. జాతీయ రహదారి కూడా కోతకు గురయ్యే అవకాశం ఉంది.

వర్షం పడినప్పుడు కంచికచర్ల, వీరులపాడు మండలంలోని పొన్నవరం, జమ్మవరం గ్రామాల వరద కంచికచర్ల చెరువులోకి వస్తుంది. పాత జాతీయ రహదారి మీద చెరువుకట్టకు దిగువున గతంలో నిర్మించిన కల్వర్టు ఐదు ఖానాలతో నిర్మించారు. నాలుగేళ్ల కింద వచ్చిన వరదకు కంచికచర్ల చెరువుకట్ట వద్ద జాతీయ రహదారిపై వరదనీరు పారింది. రెండు సహజమైన వాగుల ద్వారా అత్యధిక పరిమాణంలో వచ్చే వరద నీరు ప్రవాహించడానికి ఒక కల్వర్టు ఎలా సరిపోతోందని రైతులు ప్రశ్నిస్తున్నారు. దూరదృష్టి లేకుండా నిర్మాణ పనులు చేయడం ఎంతవరకు సబబు అని నిలదీస్తున్నారు.