లొసుగులే భూబకాసురులకు ప్రాణం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లొసుగులే భూబకాసురులకు ప్రాణం

నెల్లూరు, పిబ్రవరి 14, (way2newstv.com)
చట్టంలోని లొసుగులను తమకనుకూలంగా మలుచుకునే భూ బకాసురుల సంఖ్య పెరుగుతోంది. రెవెన్యూలో అవినీతిని తగ్గించేందుకు, పారదర్శకతను పెంచేందుకు మ్యుటేషన్‌ పద్ధతిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు ప్రకియకు శ్రీకారం చుట్టినట్టు ప్రభుత్వం చెప్పింది. నిబంధనల ప్రకారం ఎవరైనా ఇతరుల నుంచి భూములు కొనుగోలు చేసినప్పుడు ఆయా భూముల సర్వే నెంబర్లను బదిలీ చేయించుకుంటారు. రికార్డుల్లో పేర్లు తప్పులుగా నమోదైనా, వారసత్వంగా సంక్రమించిన ఆస్తులు, అన్నదమ్ముల వాటాలు, దానం లేక బహుమతి కింద సంక్రమించిన భూములు, ప్రభుత్వం తమకు కేటాయించిన అసైన్డ్‌ ల్యాండ్స్‌ను తమ పేర నమోదు చేయాలని మీ సేవ ద్వారా రెవెన్యూ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంటారు.


లొసుగులే భూబకాసురులకు ప్రాణం

ఇందుకు మ్యుటేషన్‌ విధానాన్ని చక్కగా వినియోగించుకుంటూ కోట్లాది రూపాయల విలువైన భూములను అప్పనంగా తమ ఖాతాల్లోకి కొందరు పెద్దలు మార్చుకుంటున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ర్యాంకింగ్‌ కోసం సర్కారు తెచ్చిన ఈ విధానం వారికి అలా ఉపయోగపడుతోంది. 2017 పిబ్రవరి 1నుంచి 2019 పిబ్రవరి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మ్యుటేషన్‌ కోసం దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా రెవెన్యూ కార్యాలయాలకు చేరాయి. రాష్ట్రం మొత్తం మీద అప్రూవల్‌ చేసిన సర్వే నెంబర్లు 35,45,277 కాగా వాటిలో తహశీల్దార్లు అప్రూవల్‌ చేసినవి 33,65,646. తహశీల్ధార్లు పరిశీలించకుండా గడువు తేదీ దాటిన అనంతరం ఆటోమేటిక్‌గా మ్యుటేషన్‌ అయిన సర్వే నెంబర్లు 1,79,631 ఉన్నాయి. వంశ పారంపర్యంగా దఖలు పడినవి, తోబుట్టువుల పంపకాల్లో వచ్చిన భూములను సైతం మ్యుటేషన్‌ చెయ్యకుండా కొందరు అధికారులు అడ్డుకునేవారు. ఈ డీమ్డ్‌ అప్రూవల్‌ విధానం వల్ల అలాంటి కేసుల్లో న్యాయం జరగవచ్చు కాని, దాన్ని అడ్డం పెట్టుకొని కొందరు పెద్దలు, భూ బకాసురులు క్షేత్ర స్ధాయి అధికారులతో లాలూచీ పడి విలువైన భూములను బైపాస్‌ మార్గంలో ఖరారు చేయించుకున్నారనే వాదన బలంగా వినబడుతోంది. రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం ఈ విషయాన్ని కొట్టిపారేయలేక పోతున్నారు. పలు మండలాల్లో గడువు తేదీ పూర్తయ్యే వరకు సెలవు పెట్టించడం, ఇతర విధులకు పురమాయించడం లాంటివి చేయడంతో ఇంత పెద్ద సంఖ్యలో డీమ్డ్‌ అప్రూవల్‌గా మారేందుకు కారణమైందనే విమర్శలున్నాయి. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే ఈ తంతు ఏ స్ధాయిలో జరిగిందో ఇట్టే అర్ధమవుతోంది.  పరిశీలనకు వచ్చిన దరఖాస్తులను 31 రోజుల్లోగా సంబందిత తహశీల్దార్‌ రికార్డులను పరిశీలించి ఆయా సర్వే నెంబర్ల భూములు యజమానులు ఎవరు? భూములు ఎవరి నుంచి వీరికి సంక్రమించాయి? ఆయా భూములు ఎవరి పేరుతో రికార్డుల్లో నమోదై ఉన్నాయి? వాగులు, వంకలు, ప్రభుత్వ భూములు లాంటివి దరఖాస్తుదారుడు తమవేనని దరఖాస్తు చేశాడా? అనే అంశాలను రికార్డులతోపాటు క్షేత్ర స్ధాయిలో పరిశీలించిన అనంతరం ఆయా సర్వే నెంబర్లను వెబ్‌ల్యాండ్‌లో సంబందిత అధికారులు అప్రూవ్‌ చేయాల్సి ఉంటుంది.  అధికార్లు రికార్డులను పరిశీలించకుండా నేరుగా డీమ్డ్‌ అప్రూవల్‌ కింద సర్వే నెంబర్లను ఎక్కించినట్లు స్పష్టమవుతోంది. ఫలితంగా పలుకుబడి కలిగిన నేతలు, వారి అనుయాయులు విలువైన భూములను అధిóకారికంగా రాజమార్గంగా పొందే అవకాశం కలుగుతోంది. పెద్దల కోసం మ్యుటేషన్‌ ను బైపాస్‌ చేసి వారికి భూములను కట్టబెట్టే యత్నం చేశారనే వాదన బలంగా వినబడుతోంది. రైతులు ఎవరైనా తమ భూములను ఇతరులకు కట్టబెట్టారని అప్పీల్‌కు వెళితే సంబందిత తహశీల్దార్‌కు నామ్‌కే వాస్తేగా అపరాధ రుసుంను ప్రభుత్వం విధిస్తుందని అధికారులు తెలిపారు. మ్యుటేషన్‌లో ఎక్కడైనా పొరబాట్లు జరిగితే ఆర్డీఓ. జాయింట్‌ కలెక్టర్లకు దరకాస్తు చేసుకుంటే గానీ పరిశీలించే అవకాశాలు లేవని ఉద్యోగులు పేర్కొంటున్నారుఅత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే డీమ్డ్‌ అప్రూవల్‌ చేయాలే తప్ప లక్షలాది సర్వే నెంబర్లకు అలా చేయకూడదు. తహశీల్దార్లు డీమ్డ్‌ అప్రూవల్‌ చేసిన వెంటనే ఆర్డీఓ లేదా జాయింట్‌ కలెక్టర్‌ సుమోటోగా పునర్విచారణ చేస్తే అక్రమాలు జరిగే అవకాశం తగ్గించ వచ్చు. ప్రస్తుతం ఇటువంటి మెకానిజం అమల్లో లేదు. ఫలితంగా తప్పులు ఎక్కువ దొర్లే అవకాశాలుంటాయి. ప్రభుత్వం డీమ్డ్‌ను ప్రవేశపెట్టడంలో ముఖ్యంగా రైతులకు త్వరగా పేర్లు బదిలీ చేయడం ఒకటైతే, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో కొనుగోలుకు సంబంధించి త్వరితగతిన పేర్లు మార్పుతో ర్యాంకింగ్‌ పడిపోకుండా ఉండేందుకు డీమ్డ్‌ను ప్రవేశపెట్టారు.