కేంద్ర నిబంధనలతో కేసీఆర్ ఆర్థిక కోణం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేంద్ర నిబంధనలతో కేసీఆర్ ఆర్థిక కోణం

హైద్రాబాద్, ఫిబ్రవరి 21, (way2newstv.com)
అప్పు చేసి పప్పు కూడు తరహాలో రాజకీయాధికారమే లక్ష్యంగా వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి ప్రాంతీయపార్టీలు.కేంద్రప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు రాష్ట్రాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. నిజానికి ఆయా నిబంధనల కారణంగానే రాష్ట్రాలు కొంత నియంత్రణలో ఉంటున్నాయని చెప్పాలి.  రుణాల విషయంలో నియంత్రణలు విధిస్తోంది. గ్రాంట్లు, పన్నులను హేతుబద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా అందిస్తోంది. ఈ రకంగా కొంతమేరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు. అయితే ఈ నియంత్రణలో వివక్ష కనిపిస్తోందని ఆరోపిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు.సెక్యులర్ ఫ్రంట్ కడతానంటూ రాజకీయ అజెండాను వివిధ పార్టీల ముందు ఉంచుతున్న కేసీఆర్ అందుకు తగిన ప్రాతిపదికను ఆర్థిక కోణంలో సిద్ధం చేస్తున్నారు. వివిధ ప్రాంతీయ నేతలను, విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఫైనాన్షియల్ బుక్ తెరుస్తున్నారు. 


 కేంద్ర నిబంధనలతో కేసీఆర్ ఆర్థిక కోణం

రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరమనే డిమాండును ఎత్తుకున్నారు. దానిని రాజకీయాంశంగా మార్చడం ద్వారా ఒక ప్రత్యామ్నాయ రాజకీయవేదికను నిర్మించవచ్చని తలపోస్తున్నారు. తెలంగాణలో 15 వ ఆర్థిక సంఘం పర్యటన సందర్భంగా కేసీఆర్ తన ఆలోచనలను వెలికి తెచ్చారు. ఇవే విషయాలను ప్రాంతీయ పార్టీలకు రుచించే విధంగా వివరించబోతున్నారు. ఫైనాన్సియల్ అజెండాను పొలిటికల్ మిక్చర్ గా మార్చబోతున్నారు. కట్టుతప్పిన ఖర్చులతో వివిధ రాష్ట్రాలు ఆర్థిక సంకటాన్ని ఎదుర్కొంటున్నాయి. విపరీతమైన ఫైనాన్షియల్ పవర్స్ కేంద్రం చేతిలో ఉన్నాయి. విదేశాల నుంచి రుణాలు తెచ్చుకోవడం, రిజర్వు బ్యాంకును ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడం, వివిధ రకాలుగా అదనపు పన్నులు విధించే హక్కుల వంటివన్నీ కేంద్రానికి ఉన్నాయి. రాష్ట్రాలకు కేంద్రం నుంచి గ్రాంట్లు, పన్నులలో వాటాలు వస్తుంటాయి. మొత్తమ్మీద కేంద్రానికి సమకూరే వనరుల్లో 42శాతం రాష్ట్రాలకు అందచేస్తోంది. 14 వ ఆర్థిక సంఘం పుణ్యమా అని ఈ మేరకు అయినా నిధులు దక్కుతున్నాయి. అంతకుముందు ఇది 32 శాతం మాత్రమే.కేంద్ర ప్రభుత్వం తనకు ఉన్న ఆర్థిక అధికారాలతో రాష్ట్రాలను నియంత్రించాలని చూస్తోంది. వివిధ పథకాలను తన పెత్తనంలో మొదలు పెడుతోంది. రాజకీయ అవసరాలకు ఫైనాన్సియల్ పవర్స్ ను వినియోగించుకొంటోంది. రకరకాల పథకాలను ప్రవేశపెడుతోంది. దాంట్లో భాగస్వామ్యం వహించకతప్పని స్థితిని రాష్ట్రాలకు కల్పిస్తోంది. ఒకవేళ ఏవేని రాష్ట్రాలు ధిక్కరిస్తే ఆ పథకం తాలూకు ప్రయోజనాలను కోల్పోతున్నాయి. కేంద్రం నచ్చిన పథకాలు పెట్టుకుని ప్రజలకు మంచి చేస్తే ప్రాంతీయ పార్టీలకు పెద్దగా నష్టం లేదు. కానీ ఆయా స్కీములను రాజకీయ ప్రయోజనాలకు కేంద్రంలోని అధికారపార్టీ వినియోగించుకోవడమే ప్రాంతీయ అధినేతలకు రుచించడం లేదు. తమ వాటా తమకిచ్చేస్తే తమ ప్రయోజనాలు, రాష్ట్రాల అవసరాలకు అనుగుణమైన స్కీములు పెట్టుకుంటామంటూ కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల కేంద్రం ఏరకంగానూ పొలిటికల్ మైలేజీ క్లెయిం చేయకుండా కట్టడి చేయవచ్చనేది ఆయన యోచన. అయితే బీజేపీ, కాంగ్రెసు వంటి జాతీయ పార్టీలు ఇందుకు సిద్ధంగా ఉంటాయా? అంటే అనుమానమే. అనేక స్కీములను తగ్గించుకుని ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రాల వాటా ఇప్పటికే పెంచామని ఇక ఎంతమాత్రం పెంచడం కుదరదని కేంద్రం చెప్పేస్తోంది.కేంద్రానికి సమకూరే సొమ్ములో 50 శాతం రాష్ట్రాలకు ఇచ్చేయాలనేది కేసీఆర్ డిమాండ్. ఒకవేళ అదే జరిగితే ప్రభుత్వ నిర్వహణ, రక్షణ వ్యయం, సిబ్బంది జీతభత్యాలకు కేంద్ర బడ్జెట్ సరిపోతుంది. తాను సొంతంగా స్కీములు పెట్టేందుకు ఏరకంగానూ నిధులు ఉండవు. అసలు రాష్ట్రాల్లో పథకాలను కేంద్రం ఎందుకు అమలు చేయాలనేది కేసీఆర్ అభ్యంతరం. కేంద్రపథకాల కంటే రాష్ట్రాలే మంచి పథకాలను అమలు చేస్తున్నాయని తెలంగాణ అధినేత అభిప్రాయపడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని తమిళనాడు తొలుత ప్రవేశపెడితే దానిని దేశమంతా ఆచరిస్తోంది. అలాగే ఉపాధి హామీ పథకాన్ని తొలుత మహారాష్ట్ర అమల్లోకి తెస్తే ప్రస్తుతం దేశమంతా అమలు చేస్తున్నారు. రైతుబంధుని తెలంగాణ ప్రవేశపెడితే కేంద్రం అదే తరహా పథకానికి రూపకల్పన చేసింది. అందువల్ల తమకే స్వేచ్చ ఇస్తే మంచి పథకాలను అమలు చేస్తామంటూ కేసీఆర్ భరోసానిస్తున్నారు. ప్రధానంగా ద్రవ్యబాధ్యత, నిర్వహణ చట్టం రూపంలో స్థూల రాష్ట్రోత్పత్తిలో మూడు శాతానికి మించి అప్పు చేయకూడదంటూ నిబంధనలు పెట్టడాన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిని కేసీఆర్ జాతీయ అజెండాలోకి తేవాలని భావిస్తున్నారు. నాలుగుశాతమైనా అప్పు చేసుకునే వెసులుబాటు కల్పించాలనేది ఆయన సూచన.నిధులు, గ్రాంట్ల విషయంలో పేదరిక నిర్మూలనకు 2011 జనాభాను ద్రుష్టిలో పెట్టుకోవాలంటూ ఫైనాన్స్ కమిషన్ కు కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. అనేక రకాల ప్రగతిదాయక విధానాలతో జనాభాను నియంత్రించిన దక్షిణ భారత రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పశ్చిమబంగ, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలూ ఈవిషయంలో ఒకే బాటలోకి వస్తున్నాయి. కేసీఆర్ దీనిని కూడా అడ్వాంటేజ్ గా చేసుకుంటూ పొలిటికల్ అజెండాలోకి తేవాలని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆర్థిక వ్యవహారాలు రాజకీయ అజెండాలో ప్రధానం కావడం విశేషంగానే చెప్పుకోవాలి.